కొత్త ట్రెండ్.. మా పెళ్లి ఖర్చు మాదే

కొత్త ట్రెండ్.. మా పెళ్లి ఖర్చు మాదే
  • 30 శాతం పెరిగిన అప్లికేషన్లు
  • ఎక్కువగా ఢిల్లీలోనే..హైదరాబాద్ లో తగ్గింది
  • టయర్ 2 సిటీల్లో విశాఖపట్నం టాప్
  • ఇండియా లెండ్స్రిపోర్ట్ లో వెల్లడి

పెండ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు. ఓ మామూలు కుటుంబంలో పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా తలకు మించిన భారమే మరి. అందుకే ఇప్పటి తరం (మిలీనియల్స్​) పెళ్లి కోసం అమ్మానాన్నల సంపాదనపై ఆధారపడొద్దని డిసైడ్​ అయ్యారు. తమ పెళ్లిని తామే చేసుకోవాలనుకుంటున్నారు. లోన్ల బాట పడుతున్నారు. మన దేశంలో ఇప్పుడు ఆ ట్రెండ్  బాగా పెరిగిపోయింది. పెళ్లి కోసం తీసుకుంటున్న లోన్లు 30 శాతం పెరిగాయి. ఇండియాలెండ్స్​ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2018–19తో పోలిస్తే 2019–2020లో పెళ్లి కోసం తీసుకున్న లోన్లు బాగా పెరిగాయని రిపోర్ట్​ పేర్కొంది.

వాటికే ఎక్కువ ఖర్చు

పెళ్లంటే మామూలు విషయం కాదన్న సంగతి తెలిసిందే. పెళ్లి వేదిక, డెకరేషన్​, పెళ్లి బట్టలు, నగలు, చుట్టపక్కాలకు గిఫ్టులు, పెండ్లి భోజనాలు.. వాటికయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. ఇప్పుడు వాటికి కొన్ని కొత్త హంగులూ జత కలిశాయి. స్పెషల్​ మేకప్​ ఆర్టిస్టులు, ఫొటో షూట్​లు, సెషన్​ల వంటివి తోడయ్యాయి. దీంతో ఖర్చు మరింత ఎక్కువవుతోంది. అయినా, మిలీనియల్స్​ వెనకాడడం లేదు. అలాగని తల్లిదండ్రుల సంపాదనపై ఆధారపడట్లేదట. తమ సొంత డబ్బులతో ఆ హంగామా కానిస్తున్నారట. తమ సంపాదనలో సేవ్​ చేసుకున్నది పోనూ, రూ.2 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా పెళ్లికి లోన్లు తీసుకుంటున్నారట.

హైదరాబాద్​లో పడిపోయింది

మొత్తంగా ఈ ట్రెండ్​ పెరిగినా హైదరాబాద్​లో మాత్రం తగ్గింది. 2018–19తో పోలిస్తే 2019–2020లో పెండ్లికి లోన్లు తీసుకున్న వారి సంఖ్య 12 శాతం తగ్గిపోయింది. ఇక, ఎక్కువగా నేషనల్​ క్యాపిటల్​ రీజియన్​ (ఎన్​సీఆర్​)లో ఈ ట్రెండ్​ బాగా ఎక్కువ పెరిగింది. పెండ్లికి లోన్లు తీసుకున్న వారి సంఖ్య ఎకాఎకిన 98 శాతం పెరిగిపోయింది. ఆ తర్వాతి ప్లేస్​ కోల్​కతాది. 67 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత ముంబై 51%, బెంగళూరులో 44 శాతం వృద్ధి నమోదైంది. టయర్​2 సిటీల విషయానికొస్తే విశాఖపట్నం, లక్నోలు 39 శాతం పెరుగుదలతో చార్ట్​ను లీడ్​ చేస్తున్నాయి. పెండ్లి లోన్ల విషయంలో అబ్బాయిలతో అమ్మాయిలూ పోటీ పడుతున్నారు. మొత్తం లోన్ల అప్లికేషన్లలో అమ్మాయిల వాటానే 42 శాతం మరి. మొత్తంగా పెండ్లి లోన్ల వాటాలో మిలీనియల్స్​ భాగం 84%.