V6 News

వెలుగు ఓపెన్ పేజీ : మద్యం ఆదాయం వెనుక అంతులేని విషాదం

వెలుగు ఓపెన్ పేజీ :  మద్యం ఆదాయం వెనుక అంతులేని విషాదం

‘ప్రభుత్వ ఆదాయ వనరులు పౌరుల జీవన ప్రమాణాలను పెంపొందించేవిగా ఉండాలి.  సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సేకరించడంలో పేద కుటుంబాల ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం దెబ్బతినకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.’  తెలంగాణ రాష్ట్ర అబ్కారీ ఆదాయం 2025–26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 44,557 కోట్లకు  చేరుకుంది.  ఇది  గత  ఏడాదితో పోలిస్తే దాదాపు 19 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పది వేల కోట్లుగా ఉన్న ఆదాయం,  ఇప్పుడు నాలుగు రెట్లు పెరగడానికి మద్యం అమ్మకాలతో పాటు లైసెన్స్ ఫీజులు,  దరఖాస్తు రుసుములు ప్రధాన కారణమయ్యాయి.  అక్రమ మద్యం రవాణాను అరికట్టడం, పండుగ సీజన్లలో పెరిగిన వినియోగం రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై విపరీతంగా ఆధారపడుతోంది. ఈ ధోరణిని ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రతిపాదించిన 'సామర్థ్యాల అభివృద్ధి'  కోణంలో చూస్తే  ప్రభుత్వం ప్రజల  ఉత్పాదకతను,  ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.  మానవ వనరుల  అభివృద్ధి కంటే ఆదాయ వృద్ధికే  ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో  రాష్ట్ర  ఉత్పాదకత  క్షీణిస్తుంది.  

తెలంగాణలో 43 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు.  ఆర్టికల్ 47 ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలను, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రానిదే.  కానీ, ఇక్కడ ప్రభుత్వమే మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తోంది.  2020–-21లో రూ. 27,288 కోట్లు ఉన్న ఆదాయం,  2025–-26 నాటికి రూ.44,557 లకు చేరి సుమారు  23శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీనివల్ల  పేద కుటుంబాల్లో పొదుపు శాతం పడిపోతోంది. పిల్లల చదువు,  పౌష్టికాహారంపై పెట్టాల్సిన ఖర్చు మద్యం దుకాణాలకు మళ్లుతోంది.  ప్రభుత్వం కేవలం ఆదాయం కోసం ప్రజల బలహీనతను వాడుకోవడం నైతికంగా సమర్థనీయం కాదు.  ప్రజల ఆరోగ్యం కంటే ఖజానా నింపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా పరిపాలనను వ్యాపారంగా మార్చడం సరికాదు.

ప్రజారోగ్యంపై మద్యం ప్రభావం

తెలంగాణలో మద్యం వల్ల సంభవించే కాలేయ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు పెరిగాయని  వైద్య నివేదికలు  హెచ్చరిస్తున్నాయి.  ప్రభుత్వ ఆసుపత్రులలో  నమోదవుతున్న  కేసుల్లో  గణనీయమైన శాతం మద్యపాన వ్యసనం వల్ల తలెత్తినవే ఉంటున్నాయి.  ఒకవైపు ప్రభుత్వం 'ఆరోగ్య శ్రీ' వంటి పథకాల ద్వారా చికిత్స కోసం ఖర్చు చేస్తూ,  మరోవైపు  మద్యం  అమ్మకాల  ద్వారా ఆ అనారోగ్యానికి కారణమవుతోంది.  ఇది  ఒక  విషవలయం లాంటిది.  మద్యపానం వల్ల  కలిగే  పోషకాహార లోపం,  మానసిక ఒత్తిడి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి.  మద్యానికి  బానిసలైన వారి పిల్లల్లో  ఎదుగుదల లోపాలు,  రక్తహీనత వంటి  సమస్యలు  ఎక్కువగా  కనిపిస్తున్నాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ  ప్రమాణాల ప్రకారం,  మద్యం  నియంత్రణకు ప్రభుత్వం చేపట్టాల్సిన  కనీస చర్యలను  కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖ పాటించడం లేదు. 

నేరాలు-సామాజిక అశాంతి

మద్యం అందుబాటు పెరగడం నేరాల రేటుపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది.  జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదికల ప్రకారం, తెలంగాణలో గృహహింస కేసులు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి.  మద్యం ప్రభావంతో జరిగే  గృహహింస రాష్ట్రంలో 37 శాతానికి చేరింది.   వేల సంఖ్యలో మహిళలు, పిల్లలు అనుభవిస్తున్న నరకయాతన. మద్యం మత్తులో జరిగే అత్యాచారాలు,  హత్యలు, ఘర్షణలు సామాజిక భద్రతను ప్రశ్నార్థకం  చేస్తున్నాయి.  అలాగే,  రోడ్డు  ప్రమాదాల  విషయంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. మద్యం తాగి వాహనం నడపడం  వల్ల జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అధిక శాతం 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల  యువతే ఉండటం  విషాదకరం.  శాంతిభద్రతల  పరిరక్షణ  ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.  ఆదాయం కోసం మద్యం  దుకాణాలను  గల్లీ గల్లీకి విస్తరించడం వల్ల నేర పరిశోధనకు పోలీసు యంత్రాంగంపై భారం పెరుగుతోంది.  

2026-27 అంచనాలు

గత  ప్రభుత్వం  ప్రారంభించిన  దూకుడు ఎక్సైజ్  విధానాన్ని  ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే వేగంతో కొనసాగిస్తోంది.  రాజస్థాన్,  హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్సైజ్ ఆదాయాన్ని నిర్దిష్టంగా ఆరోగ్య రంగానికి కేటాయించే పద్ధతులు పాటిస్తున్నాయి.  తెలంగాణ ప్రభుత్వం అటువంటి ఉత్తమ పద్ధతులను విస్మరించింది. ముఖ్యంగా మద్యం ప్రభావంతో జరిగే  గృహహింస  తెలంగాణలో 37 శాతానికి చేరింది.  ఇది జాతీయ సగటు 25 శాతం కంటే చాలా ఎక్కువ.  ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ చెప్పినట్లు, ప్రజల సంపదను హరించే పన్నులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. మద్యం పన్ను అటువంటి వర్గంలోకే వస్తుంది.  ప్రభుత్వం కేవలం ఒక ఆదాయ మార్గంగా మద్యం వైపు చూడటం కాకుండా, దీనివల్ల కలిగే సామాజిక నష్టాన్ని  అంచనా వేయాలి.  జనాభా ప్రాతిపదికన కాకుండా, సామాజిక అవసరాల  ప్రాతిపదికన మద్యం విధానాన్ని రూపొందించాలి.   పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుతూనే  ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాలి.  అప్పుడే తెలంగాణ నిజమైన సంక్షేమ రాష్ట్రంగా నిలుస్తుంది. భవిష్యత్తు తరాలను వ్యసన ముక్తి వైపు నడిపించే  బాధ్యతను  ప్రభుత్వం స్వీకరించాలి.  అప్పుడు మాత్రమే రాష్ట్ర ఆర్థికవ్యవస్థ సుస్థిరంగా మారుతుంది.

వార్షిక ఎక్సైజ్ రాబడి విశ్లేషణ 

రాష్ట్ర స్థూల ఆదాయంలో ఎక్సైజ్ వాటా గణనీయంగా పెరుగుతోంది.  ఆర్థికవేత్తల అంచనా ప్రకారం,  ఒక రాష్ట్ర ఆదాయం మద్య నియంత్రణ లేకుండా పెరిగితే అది సామాజిక అశాంతికి దారితీస్తుంది.  కేవలం  పన్నుల వసూళ్లే ధ్యేయంగా పెట్టుకున్న ఎక్సైజ్ శాఖ,  మద్యపాన నియంత్రణ బాధ్యతలను పూర్తిగా విస్మరించింది.  దీనివల్ల కలిగే మానవ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవడం లేదు. కేవలం రాబడి అంకెలను మాత్రమే చూపిస్తూ ప్రగతిని చాటుకోవడం శోచనీయం.

- డా. కట్కూరి
పాలసీ ఎనలిస్ట్​