ప్రారంభించినా పనులు చెయ్యరు.. ఏండ్లుగా సాగుతున్న బ్రిడ్జీల నిర్మాణాలు

ప్రారంభించినా పనులు చెయ్యరు.. ఏండ్లుగా సాగుతున్న బ్రిడ్జీల నిర్మాణాలు
  • మంజూరైన కొన్ని శంకుస్థాపనలకే పరిమితం
  • కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం
  • వర్షాలు, వరదలతో నిలిచిపోతున్న రాకపోకలు
  • రోజుల తరబడి జలదిగ్భంధంలో చిక్కుకుంటున్న గ్రామాలు 

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో వాగులపై బ్రిడ్జిల నిర్మాణాలు నత్తకు నడక నేర్పినట్లు సాగుతున్నాయి. ఆర్అండ్​బీ, పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పెండింగ్​లోనే ఉంటున్నాయి. వర్షాలు, వరదలకు వాగులపై ఉన్న లోలెవల్ బ్రిడ్జీలపై నుంచి వరద నీరు పారి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సర్కారు చాలా చోట్ల కొత్త బ్రిడ్జీలను మంజూరు చేస్తోంది. జిల్లాలోనూ కొన్ని బ్రిడ్జీలు మంజూరు చేసినా పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

మరికొన్ని చోట్ల ప్రారంభించినా.. నిర్లక్ష్యం కారణంగా ఏండ్లగా ఆ పనులు సాగుతూనే ఉన్నాయి. ఫలితంగా ప్రతి ఏటా వానాకాలంలో గ్రామాలు వాగులు దాటలేక జలదిగ్భంధంలో చిక్కుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు 60కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంజూరైన బ్రిడ్జీల నిర్మాణాలు ఇప్పటికే పూర్తైపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు.

ఇదీ పరిస్థితి

భీంపూర్ మండలంలోని కరంజి టి వాగుపై 2022లో రూ.4 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభం కాగా ఈ అక్టోబర్​లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఈ పనులు చాలా స్లోగా నడుస్తున్నాయి. సిరికొండ మండలంలోని చిక్మాన్ వాగుపై 2021లో ప్రారంభమైన బ్రిడ్జి పనులు ఈఏడాది ఫిబ్రవరిలోనే పూర్తికావాల్సి ఉండగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా అప్రోచ్ రోడ్లు కొట్టుకుపోవడంతో ఈ బ్రిడ్జిలను దాటే గ్రామాల ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జైనథ్ మండలంలోని అంతరాష్ట్ర రహదారిపై తరోడ గ్రామం వద్ద ఇటీవల పాత బ్రిడ్జి దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ కొత్త బ్రిడ్జితో పాటు రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.490 కోట్లు మంజూరు చేసింది. అయితే, నాలుగు నెలలు గడుస్తున్నా పరిస్థితులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. బ్రిడ్జి పక్క నుంచి వాగులో తాత్కాలిక రోడ్డు వేసినప్పటికీ అది వర్షాలకు కొట్టుకపోవడంతో రాకపోకలకు జనం ఇబ్బందులు పడుతున్నారు.  

పూర్తి నిర్లక్ష్యం

జిల్లాలో నిర్మిస్తున్న బ్రిడ్జీ పనులపై పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పనుల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నా వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. త్వరగా పూర్తిచేయాలని కనీసం ఒత్తిడి చేయడంలేదని తెలుస్తోంది. ఫలితంగా బ్రిడ్జీల నిర్మాణాలు ఏళ్లతరబడి సాగుతూనే ఉన్నాయి. ఇటు ప్రజాప్రతినిధులు సైతం నెమ్మదిగా నడుస్తున్న నిర్మాణాలపై గానీ.. మంజూరైన పనులపై గానీ దృష్టి సారించడం లేదు. ఫలితంగా ప్రతి ఏటా వానాకాలంలో ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు.

బోథ్ గ్రామ శివారులోని కండ్రి వాగు వద్ద పరిస్థితి ఇది. వాగుపై ఉన్న పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో పక్కనే తాత్కాలిక వంతెన వేశారు. ఇటీవల భారీ వర్షాలకు ఆ వంతెన కొట్టుకుపోయింది. బోథ్ నుంచి నిగిని గ్రామం వరకు రహదారి నిర్మాణంతోపాటు బ్రిడ్జి కోసం ప్రభుత్వం రెండేండ్ల క్రితం రూ.19 కోట్లు మంజూరు చేసింది. కానీ రోడ్డు పనులు ప్రారంభించి నత్త నడకన సాగుతుండడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోలేదు. దీంతో దాదాపు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇలా అసంపూర్తిగా కనిపిస్తున్న బ్రిడ్జి ఇచ్చోడ మండల కేంద్రం నుంచి సిరిచెల్మకు వెళ్లే వాగుపై నిర్మిస్తున్నారు.  రూ.1.41 కోట్లతో ప్రారంభించిన ఈ పనులు ఏప్రిల్ లోనే పూర్తిచేయాల్సి ఉండగా.. పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో అటుగా రాకపోకలు సాగించే 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.