ఇచ్చినట్టా.. ఇయ్యనట్టా!

ఇచ్చినట్టా.. ఇయ్యనట్టా!

హైదరాబాద్, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకు.. బడ్జెట్‌‌‌‌లో పేర్కొన్న లెక్కలకు మధ్య పొంతన లేదు. కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వటం లేదంటూ బడ్జెట్ స్పీచ్​ మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఐదేండ్లకు ఫైనాన్స్ కమిషన్​ సిఫారసు చేసిన ఇన్సెంటివ్స్ రూ.5,374 కోట్లు ఇవ్వలేదని తప్పుబట్టింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ స్కీమ్‌‌‌‌లకు నిధులు ఇవ్వాలంటూ నీతి అయోగ్ సిఫార్సు చేసినా ఒక్క పైసా ఇవ్వలేదని ఆర్థిక మంత్రి హరీశ్‌‌‌‌​రావు ప్రసంగంలో విమర్శించారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ.450 కోట్లు ఇవ్వాల్సి ఉంటే పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మరోవైపు ఇందుకు భిన్నంగా వచ్చే ఏడాది కూడా భారీగా నిధులు కేంద్రం నుంచి వస్తాయని బడ్జెట్ పుస్తకాల్లో రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేసుకుంది. బడ్జెట్‌‌‌‌ను అమాంతం పెంచుకుంది. ప్రస్తుత ఏడాది కేంద్రం నుంచి రూ.41 వేల కోట్ల గ్రాంట్లు వస్తాయని అంచనా వేసుకున్న ప్రభుత్వం.. 30 వేల కోట్లు వచ్చినట్లు సవరించుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.41,259 కోట్లు వస్తాయని కొత్త బడ్జెట్ లో చూపించింది. మిషన్​ కాకతీయకు రూ.5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు, జీఎస్​టీ పరిహారం రూ.1,237 కోట్లు, మరో రూ.495 కోట్లు గ్రాంట్లుగా వస్తాయని బడ్జెట్ రాబడుల్లో చూపించింది. అంటే కేంద్రం నుంచి నిధులు రావటం లేదని పదే పదే విమర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆ నిధులు వస్తాయని ఆశలు పెంచుకుందా.. బడ్జెట్ సైజ్ పెంచుకునేందుకు వచ్చినా రాకున్నా సరే.. అంకెల్లో చూపించుకుందా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఏపీ నిధులపైనా అదే లొల్లి

ఏపీ నుంచి తమకు రూ.17,828 కోట్లు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో ప్రస్తావించింది. అవే అంకెలను రెవెన్యూ రాబడుల్లో చూపించింది. గత ఎనిమిదేండ్లలో ఎన్నడూ లేని ఈ పద్దు కొత్తగా ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ అయింది. విద్యుత్తు బకాయిలకు సంబంధించి తెలంగాణ డిస్కంలు ఏపీ జెన్​కోకు రూ.6,756 కోట్లు వెంటనే చెల్లించాలని ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని.. విద్యుత్తు వినియోగానికి సంబంధించి ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.17,828 కోట్లు వెంటనే ఇప్పించాలని మంత్రి హరీశ్‌‌‌‌​రావు స్పీచ్​లో ప్రస్తావించారు. దీంతో ఏపీ, తెలంగాణ విద్యుత్ బకాయిల వివాదం మళ్లీ తెరపైకి వచ్చినట్లయింది.