జర్మనీలో రైతు ఉద్యమం ఇట్ల లేదు

జర్మనీలో రైతు ఉద్యమం ఇట్ల లేదు

జర్మనీ ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది. పర్యావరణాన్ని కాపాడేందుకు, చిన్న చిన్న పురుగులు, కీటకాలను కాపాడేందుకుగాను పురుగుల రక్షణ చట్టాన్ని తెచ్చింది. పురుగులు, కీటకాలు ఉంటేనే పర్యావరణం ఉంటుంది. జీవ వైవిధ్యం బతికి బట్టకడుతుంది. జంతుజాలం వర్థిల్లుతుంది. కాబట్టి పురుగులను కాపాడటం అత్యవసరం. ఇదీ ఈ చట్టం వెనుక ఉన్న ఆలోచన. ఇందుకోసం వంద మిలియన్ యూరోలు ఖర్చు చేయాలని, క్రిమిసంహారక మందుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని సంకల్పించింది. పంటపొలాలను ఆశించే క్రిమికీటకాలను చంపేందుకు ఎక్కువగా వాడే గ్లైఫోసేట్ వాడకాన్ని 2023 నాటికి పూర్తిగా నిషేధించాలని భావిస్తోంది. కానీ, అక్కడి రైతులు సహజంగానే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు.

 

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనల తరహాలోనే జర్మన్ రైతులు కూడా ట్రాక్టర్లను తీసుకుని రోడ్లెక్కారు. మన దేశ రాజధానిలో లాగానే బెర్లిన్ మహానగరంలోని బ్రాండెన్ బర్గ్ గేట్ వద్దకు ట్రాక్టర్లు వచ్చాయి. ఢిల్లీలో సింఘు, టిక్రీ, ఘజియాబాద్ బార్డర్ చెక్ పోస్టుల దగ్గర మన రైతులు ఎలా క్యాంపులు పెట్టారో వారు కూడా క్యాంపులు ఏర్పాటు చేశారు. కానీ రోడ్లను మాత్రం దిగ్బంధనం చేయలేదు. ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాకపోకలను స్తంభింపచేయలేదు. మన దేశంలో లాగా రైతుల పేరిట కొందరు ఖలిస్తానీలు, వామపక్షాల వారు బయలుదేరి జాతీయ పతాకాన్ని అవమానించలేదు. ఇంకేదో పతాకాన్ని ఎగరేయలేదు. పదునైన కత్తులతో పోలీసుల మీద విరుచుకుపడలేదు. రెండువందల మంది పోలీసులను గాయపరచలేదు. ప్రజాస్వామ్యయుతంగా తమ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాక్టర్లు రోడ్డైతే ఎక్కాయి కానీ, రోడ్డును బ్లాక్ చేయలేదు. పురుగులను కాపాడే పేరిట రైతులను చంపొద్దని మాత్రమే తమ వాదన వినిపిస్తున్నారు.

ట్వీట్లు, టూల్‌‌‌‌కిట్లు లేవు

జర్మనీలో జరుగుతున్న ఉద్యమానికి జార్జి సోరోస్ వంటి అమెరికన్ ఉద్యమకారుడు డబ్బు మూటలను పంపించలేదు. జర్మనీలో ప్రభుత్వాన్ని కూలదోసేస్తానని ప్రకటించలేదు. అంతకన్నా ముఖ్యంగా, రిహానా వంటి పాప్ సింగర్లు, గ్రెటా థన్‌‌‌‌బర్గ్ లాంటి పర్యావరణ వేత్తలు, మియా ఖలిఫా వంటి పోర్న్ స్టార్లు ప్రకటనలు ఇవ్వలేదు. వామపక్ష లిబరల్ శక్తులు, మీడియా ముసుగులో పనిచేసే కుహనా ప్రగతివాదులు ట్విట్టర్ టూల్ కిట్లను పంపిణీ చేయలేదు. మన దేశంలో మాదిరిగా ఖలిస్తానీలు డాలర్ల నుంచి పౌండ్ల దాకా గుమ్మరించి మరీ ఉద్యమకారుల తోకలకు నిప్పు పెట్టలేదు. జర్మనీలో రైతుల పోరాటాన్ని రైతులే చేస్తున్నారు. పర్యావరణవాదులు చేయడం లేదు. ఎక్కడో బెంగళూరులో కూర్చున్న దిశారవి వంటి వారు, ముంబైలో కూర్చున్న నికితా జోసెఫ్ వంటి వారు సోషల్ మీడియా ద్వారా రైతు ప్రేమ పేరిట విషాన్ని విరజిమ్మలేదు. వారికి మద్దతుగా బర్ఖాదత్ నుంచి రాజ్‌‌‌‌దీప్ సర్దేశాయిల దాకా ఫేక్‌‌‌‌ న్యూస్ ని ప్రచారం చేయలేదు. తెల్లవాళ్ల దేశమైన జర్మనీలో రైతు పోరాటానికి బాసటగా కెనడా ప్రధానమంత్రి ట్రూడో రంగంలోకి దిగలేదు. చాన్స్ లర్ యాంజెలా మెర్కెల్ కు సలహాలు ఇవ్వలేదు. రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించలేదు. ఇంగ్లండ్ లో లేబర్ ఎంపీల్లా ఎగిరెగిరి పడలేదు. ఇండియా అంతర్గత విషయం గురించి బ్రిటన్​ పార్లమెంట్​లో చర్చించాలని పట్టుబట్టలేదు.

ఇండియాలోనే ఎందుకు

జర్మనీ రైతాంగ పోరాటాన్ని సమర్థిస్తూ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లో ఎవరూ సంపాదకీయాలు రాయలేదు. మిలియన్ల డాలర్లు గుమ్మరించి యాడ్స్‌‌‌‌ ఇవ్వలేదు. రెండున్నర మిలియన్ల డాలర్లు ముట్టచెప్పి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల చేత ట్వీట్లు చేయించలేదు. అంతే కాదు విదేశాల్లో సూపర్ బౌల్ టోర్నమెంట్ల మధ్య 30 సెకండ్ల కమర్షియల్ బ్రేక్స్ ఇచ్చి మరీ ఇండియాలో జరిగే “రైతాంగ” పోరాటాల ప్రకటనలు ఇవ్వలేదు. మరి ఇండియా విషయంలోనే ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఒకప్పుడు తెల్లజాతివారికి బానిసలుగా పడున్న కారణంగా ఈనాటికీ ఇండియన్లపై అధికారం చెలాయించాలన్న మానసికత తెల్లవారిని ఇంకా వదల్లేదు. వాళ్లకి వదల్లేదు సరే. మన దేశంలో ఉన్న మెకాలే మానసపుత్రులకీ వదల్లేదు. అందుకే తెల్లవాడికి మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం ఉందని వాళ్లు భావిస్తున్నారు. అందుకే థన్‌‌‌‌బర్గ్ అక్కడెక్కడో తలాడిస్తే బెంగళూరులో తోకాడిస్తున్నారు.

జర్మనీలో రైతులు చట్టాలను అతిక్రమించలేదు. చట్టాలను పూర్తిగా గౌరవిస్తూ తమ నిరసనను తెలియచేస్తున్నారు. పరిధులు దాటకుండా పోరాడుతున్నారు. నిజానికి మన దేశంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలూ రైతులకు మేలు చేస్తాయి. కొత్త మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. కొత్త కొనుగోలుదారులను తెస్తున్నాయి. రైతులకు తమ ఉత్పత్తులను దాచుకునే హక్కును, మంచి ధర పలికినప్పుడు అమ్ముకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అయినా విదేశీ శక్తులు, వాటి అడుగులకు మడుగులొత్తే వారు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

 – కస్తూరి రాకా సుధాకర్‌‌‌‌రావు, సీనియర్​ జర్నలిస్ట్