సిటీ చెరువులు కంపు కొడుతున్నయ్

సిటీ చెరువులు కంపు కొడుతున్నయ్

హైదరాబాద్, వెలుగు :వేసవి ఎండలు పెరిగిపోతుండగా సిటీలో ఉదయం  పూట ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు.  సాయంత్రం వేళల్లో చల్లని గాలిని ఆస్వాదించేందుకు చెరువుల వద్దకు వెళ్తే భరించలేని వాసన వస్తోంది. కాసేపు కూడా నిల్చోలేని, ఉండలేని పరిస్థితి నెలకొంది.  అందుకు చెరువుల్లోని నీళ్లు కలుషితమవడమే కారణం.  ఎండలతో చెరువుల్లోని వ్యర్థాలు, రసాయనాలతో నీటిపై గ్రీన్ ఆల్గే ఏర్పడుతోంది. దీంతో భరించలేని దుర్వాసన వస్తోంది. గ్రేటర్​లో చెరువుల అభివృద్ధికి రూ.94 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్టు ఈనెల19న బల్దియా అధికారులు చెప్పగా, పనులు స్టార్ట్​చేసి పూర్తయ్యేలోపు రోగాల బారిన పడతామని చెరువుల సమీపంలోని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా, వాటర్‌‌‌‌ వర్క్స్, పీసీబీల సమన్వయ లోపంతోనే చెరువులు మురుగుగా మారిపోతున్నాయని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. 

వ్యర్థాలు కలుస్తుండగా..

సిటీలో సుమారు185 చెరువులు ఉండగా, వీటిలో చాలావరకు కబ్జాలకు పాలవగా, మరికొన్ని ఇండ్లకు సమీపంలో ఉన్నాయి. హుస్సేన్ సాగర్, కూకట్​పల్లి,  ఐడీఎల్ చెరువు, బాలాపూర్ పెద్ద చెరువు, కూకట్​పల్లి మైసమ్మ చెరువు, ఆర్కేపురం చెరువు, సరూర్ నగర్ చెరువు, నాగోల్ అయ్యప్ప కాలనీ చెరువు,  మల్కాజిగిరి మిని ట్యాంక్ బండ్, దుర్గం చెరువు, షామీర్ పేట్ చెరువు ఇలా తదితర చెరువులకు దగ్గరలోనే ఇండ్లు ఉంటాయి. ఆయా  చెరువుల్లోకి డ్రైనేజీ, కెమికల్​వేస్టేజ్, ప్లాస్టిక్​కవర్ల లాంటివి చేరుతుండగా ఎండల ఉష్ణోగ్రతకి ఘనపదార్థాల నుంచి రసాయనాలు విడుదలవుతుంటాయి. దీని ద్వారా గ్రీన్ ఆల్గే (ఆకుపచ్చని నాచు) ఏర్పడి విపరీతమైన వాసన వస్తోంది. చెరువుల ప్రాంతంలో జరిగే కార్యకలాపాలు, కాలుష్యం, డ్రైనేజీ నీరు ఇవన్నీ కలిసి వాటి నుంచి  గ్రీన్ ఆల్గే వృద్ధి చెందుతుందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. బల్దియా, వాటర్‌‌‌‌ వర్క్స్, పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అధికారులు సమన్వయంతో పనిచేస్తే చెరువుల శుద్ధి, సంరక్షణ సరిగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆయా డిపార్ట్​మెంట్ల మధ్య సమన్వయం లేకపోవడంతో చెరువుల సంరక్షణ సరిగా లేదని విమర్శిస్తున్నారు.   

నివారణ ఇలా..

చెరువుల్లో గ్రీన్ ఆల్గే పేరుకుపోకుండా నివారించొచ్చని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇందులో సహజసిద్ధంగా ప్రకృతివనరులతో, అదేవిధంగా బ్యాక్టిరియల్ మెషనరీ సాయంతో కూడా చెరువులను ఆల్గే నుంచి శుద్ధి చేయొచ్చని అంటున్నారు. నగరంలోని చెరువుల్లోకి మురికి నీటిని పోనివ్వకుండా ఆపడంతో పాటు వాటిల్లో కప్పలను, చేపలను పెంపకం చేయాలని సూచిస్తున్నారు. దీంతోపాటు గుర్రపుడెక్క సాయంతో కూడా గ్రీన్ ఆల్గే ని నివారించొచ్చని చెప్తున్నారు. గుర్రపు డెక్క ఉన్న చోట ఆల్గే రూపాంతరం చెందదని కాబట్టి గుర్రపుడెక్కను పెంచుతూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచిస్తున్నారు. దీంతో పాటు సరూర్ నగర్ చెరువులో ఏర్పాటుచేసిన ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా కూడా ఘన వ్యర్థాలు చెరువులోకి వెళ్లడం ఆపడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. 

పేరుకుపోతున్న  గ్రీన్ ఆల్గే.. 

 చెరువుల్లో గుర్రపు డెక్క, వాటి ద్వారా  ఏర్పడే దోమల గురించే ఎక్కువగా సమస్యలు వస్తాయి. అయితే సమ్మర్​లో మరో సమస్య జనాలను తీవ్ర ఇబ్బంది పెడుతుంది. చెరువుల్లో పేరుకుపోయిన గ్రీన్ ఆల్గే వచ్చే దుర్వాసనను భరించలేకపోతుంటారు. చాలా చెరువుల్లో గుర్రపు డెక్కతో పాటు ఆకుపచ్చని ఆల్గే పేరుకుపోయి కనిపిస్తుంది. ఎండాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న ఉక్కపోత నుంచి సేదతీరేందుకు జనాలు ఎక్కువగా చెరువుల పరిసర ప్రాంతాలకు వెళ్తుంటారు. పార్కులతో పాటు చెరువుల చుట్టుపక్కలకు కూడా వాకింగ్ కు, ప్రశాంతత కోసం పోతుంటారు. చెరువుల నుంచి వస్తున్న దుర్వాసన ముప్పుతిప్పలు పెడుతుందని, అటువైపు వెళ్లాలంటేనే భయంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. 

శాంపిల్స్ తీసుకుని టెస్ట్  చేయించాలి

సమ్మర్​లో చెరువుల్లో కెమికల్ రియాక్షన్ జరిగి దుర్వాసన పెరుగుతుంది. చెరువుల్లో కలిసే వ్యర్థాల బట్టి తీవ్రత ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్  చెరువుల్లో విడుదలయ్యే గ్యాస్ శాంపిల్స్ ని సేకరించి ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయాలి. వాసన తీవ్రత ఎక్కువగా ఉండి జనాలు అనారోగ్యసమస్యల బారిన పడతారని భావిస్తే ఆ చెరువు చుట్టుపక్కలకు వెళ్లొద్దని హెచ్చరిక బోర్డు పెట్టాలి. ప్రస్తుతం అలాంటివేమి లేవు. ముందుగా చెరువుల్లో మురుగు నీరు  కలవకుండా ఆపాలి. ఆ తర్వాత ప్రకృతి వనరులతో గ్రీన్ ఆల్గే నిర్మూలన చేపట్టాలి. 
- దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త

దుర్వాసన పీల్చుకుంటే ఆస్తమా, ఊపిరితిత్తుల్లో సమస్యలు

చెరువుల్లో కలిసే వ్యర్థాలు, నాన్ బయోడీగ్రెడబుల్ వేస్టేజ్, కెమికల్స్ లాంటి వాటితో దుర్వాసన వస్తుంది. దీన్ని పీల్చుకున్నపుడు ఆస్తమా, ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తుంటాయి. తీవ్రమైన వాసన వస్తుందని తెలిసినప్పుడు ఆ చుట్టు పక్కలకు వెళ్లొద్దు. ముఖ్యంగా పెద్దవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. 
- డాక్టర్​ నవోదయ, 
జనరల్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్స్