ఆరు గజాల్లో ఉన్న ఆ ఇంట్లో ఏడుగురు నివాసం

ఆరు గజాల్లో ఉన్న ఆ ఇంట్లో ఏడుగురు నివాసం

ఆ ఇంట్లో కూర్చోడానికి కూడా స్థలం సరిపోదు. ఆరు గజాల్లో ఉన్న ఆ ఇంట్లో ఏడుగురు నివాసం ఉంటున్నారు. కొందరు ఇంట్లో ఉంటే... మరికొందరు బయట ఉండాల్సిన పరిస్థితి.  అంత పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి ఏ ప్రభుత్వం సంక్షేమ పథకం కూడా అంద లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం... ఫించన్ కోసం ఏళ్ళ తరబడిగా ఎదురుచూస్తున్నారు. ఖమ్మంలోని ఆరు గజాల్లోని ఇంట్లో నివసిస్తున్న పేద కుటుంబంపై స్పెషల్ స్టోరీ

ఖమ్మం బి.కె. బజార్ లో గుమ్మడి ముత్యాలు , వెంకటమ్మ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్ళకు ఇద్దరు కూతుళ్ళు, ఒక కుమారుడు. 20 ఏళ్ల క్రితం తాతల కాలం నాటి ఆస్తి పంపకాల్లో ఆరు గజాల చిన్న ఇల్లు వీరి వాటాకు వచ్చింది. కుమార్తెలు ఇద్దరికీ, తర్వాత కుమారుడికీ పెళ్ళి చేశారు. ఆయన ముగ్గురు పిల్లలతో కలిపి... మొత్తం ఏడుగురు కుటుబ సభ్యులు ఆరు గజాల ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబం మొత్తం కలిసి ఒకచోట కూర్చోలేని పరిస్థితి. రాత్రిళ్ళు కుమారుడు సుధాకర్ భార్య పిల్లలతో ఇంట్లో నిద్రిస్తే, తల్లి దండ్రుల బయటే ఉంటారు. వర్షం వచ్చినా, చలి ఎక్కువైనా ఆ కుటుంబం మొత్తానికి జాగరణే. ఇంట్లో  కూడా  సరిగ్గా నిద్ర పోయే అవకాశమే లేదు. సామాగ్రి ఇంట్లో ఉండటంతో దాదాపు 16యేళ్ళ నుంచి ప్రశాంతంగా పడుకోలేదని అంటున్నారు కుటుంబసభ్యులు.

కుమారుడు సుధాకర్ సుతారీ కూలీ, తల్లి కొబ్బరి బోండాలు అమ్ముతుంది. తండ్రి ముత్యాలుకి చేయి విరగడంతో 20 ఏళ్లుగా ఏ పనీ చేయట్లేదు. ఈ కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా దయనీంగా ఉంది. ముత్యాలుకి 62 ఏళ్ళయినా ఆసరా పెన్షన్ రావట్లేదు. వృద్ధాప్య పింఛన్ కోసం ఎన్నిసార్లు అప్లయ్ చేసినా .... అధికారుల చుట్టూ తిరిగినా.. పెన్షన్ మంజూరు కాలేదని అంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చుట్టూ తిరిగినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ముత్యాలు కుటుంబం. ఇప్పటికైనా ఇల్లు, పింఛన్ ఇప్పించాలని వేడుకుంటున్నారు.