‘ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి.. NPR, NRC కి మధ్య ఎలాంటి సంబంధం లేదు’

‘ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి.. NPR, NRC కి మధ్య ఎలాంటి సంబంధం లేదు’

హైదరాబాద్: NPR(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) అనేది NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)కి ముందస్తు చర్యల్లో భాగమని ప్రతిపక్ష పార్టీలు, మీడియాలోని ఒక వర్గం ప్రచారం చేస్తున్నదానిలో ఎంత మాత్రం నిజం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగా వారు చేస్తున్న నిరాధారమైన అసత్య  ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఆ రెండింటి మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పారు కిషన్ రెడ్డి. ఈ విషయమై గురువారం హైదరాబాద్ లో ఓ పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత NPR  2021 లో జరగనున్న జనగణన లో అంతర్భాగం మాత్రమేనని అన్నారు మంత్రి. గత యుపిఏ ప్రభుత్వం 2010లో ప్రారంభించిన ఎన్‌పిఆర్ ప్రక్రియను తాము కొనసాగిస్తున్నామని. కాకపోతే అందులోనే మరో మూడు, నాలుగు అదనపు అంశాలు జోడించి వివరాలు సేకరించడం జరుగుతుందని చెప్పారు.

ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రుల పుట్టిన ప్రదేశానికి సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డ్ నంబర్ మరియు చివరి నివాస స్థలం NPR లో పొందుపరచనున్న కనీస ప్రాథమిక అంశాలని కిషన్ రెడ్డి అన్నారు.ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు చేయడానికి అపోహలు సృష్టించి ప్రజల మనస్సుతో  ఆటలాడుతున్నాయన్నారు.

దేశంలో సమర్థవంతంగా అమలవుతున్న  సంక్షేమ ఎజెండాను నిర్వీర్యం చేసి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన  ఆయుష్మాన్ భారత్ లాంటి వివిధ పథకాల  అమలు కి విఘాతం కల్గించడమే ప్రతిపక్షాల లక్ష్యంగా కనబడుతోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు, విపక్షాలు, ఇతరులు ఈ విషయాలపై  చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని  విజ్ఞప్తి చేస్తున్నానన్నారు కిషన్ రెడ్డి.

అందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏ ప్రభుత్వమూ ప్రామాణికమైన మరియు సమగ్రమైన డేటా లేకుండా తన విధానాలను రూపొందించలేదని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.