హనుమకొండ సిటీ, వెలుగు : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. హనుమకొండలోని హరిత కాకతీయలో శుక్రవారం నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యాంకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు దక్కాల్సిన వాటాపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్, వరంగల్ అధ్యక్షుడు సొల్తి సారంగం, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు శివ, విద్యార్థి నాయకులు రంజిత్‌గౌడ్, యువజన నాయకులు కల్లూరి పవన్, ఏకాంబరం చిరంజీవి, బగ్గి రాజు, నాయిని సరస్వతి, పద్మజ పాల్గొన్నారు.
