చిన్న వయసులోనూ..సైలెంట్ ఎటాక్

చిన్న వయసులోనూ..సైలెంట్ ఎటాక్

చడీ చప్పుడు కాకుండా గుండె ఆగిపోవడమే సైలెంట్​ హార్ట్​ఎటాక్​. ఇది ‘కోవర్ట్ కిల్లర్’ లాంటిది. అనుకోకుండా వచ్చే ఇలాంటి హార్ట్​ఎటాక్స్​ చాలా డేంజర్​. అయితే, సివియర్​ హార్ట్ఎటాక్​ అనేది చెప్పాపెట్టకుండా రాదు. కొన్ని రోజులు, వారాల ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది. లక్షణాలు కనిపించగానే అలర్ట్ కాకపోతే మాత్రం పరిస్థితి చేయిదాటిపోతుంది. హార్ట్​ఎటాక్​ సింప్టమ్స్​ని ముందుగా పసిగట్టి, ట్రీట్మెంట్ తీసుకుంటే  గుండెకి ఏ ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు అంటున్నారు కార్డియాలజిస్ట్ ప్రణీత్​. 

హిందీ బిగ్​బాస్​ పదమూడో సీజన్​ విన్నర్​ సిద్ధార్థ్​ శుక్లా నలభైయేళ్ల వయసులో హార్ట్​ ఎటాక్​తో చనిపోవడంతో చాలామంది షాక్​ అయ్యారు. ‘హార్ట్​ఎటాక్​ పెద్దవాళ్లకే వస్తుంది’ అనుకునే రోజులు పోయాయి.  ఇప్పుడు ముప్ఫయేళ్లకే హార్ట్​ఎటాక్ బారిన పడుతున్నారు. హార్ట్ఎటాక్​ వచ్చినప్పుడు గుండె లయలో మార్పులు వస్తాయి. హార్ట్ఎటాక్​ వచ్చినా కూడా గుండె కొట్టుకునే వేగంలో తేడా లేనంతవరకు తట్టుకోగలరు. ప్రాణాపాయం ఉండదు. కానీ, హార్ట్​బీట్​ మారితే వయసులో చిన్నవాళ్లైనా, పెద్దవాళ్లైనా తట్టుకోలేరు. 

హార్ట్​ఎటాక్​ వస్తుందిలా

‘లబ్​డబ్’... అంటూ రిథమిక్​గా కొట్టుకునే గుండె ఉన్నట్టుండి ఆగిపోవడమే హార్ట్ఎటాక్​. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే... రక్తనాళాల్లో చిన్న డ్యామేజ్​ ఏర్పడుతుంది. దీన్ని మెడికల్​ టర్మినాలజీలో ‘ఎరోజన్​’ అంటారు. ఈ డ్యామేజ్​తో ఒక్కసారిగా రక్తం గడ్డకట్టి,  రక్తనాళం అంతటా బ్లాక్​ అవుతుంది. అయితే  కొన్నిసార్లు రక్తనాళాల్లో డ్యామేజ్​ ఉండకపోవచ్చు. కానీ, రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి, రక్తం గడ్డకట్టడం వల్ల కూడా హార్ట్​ఎటాక్​ వస్తుంది. ముఖ్యంగా యంగ్​స్టర్స్​లో ఈ రకమైన సమస్యలు ఎక్కువ. కొకైన్​, ఇతర డ్రగ్స్​ తీసుకోవడం కూడా హార్ట్​ఎటాక్​ రిస్క్​ని పెంచుతుంది. స్మోకింగ్​ చేసేవాళ్లలో రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడి హార్ట్​ఎటాక్​ వచ్చే ఛాన్స్​ ఉంది. 

సడన్​ హార్ట్​ఎటాక్ 

రక్తనాళాల్లో బ్లాకేజెస్​ ఎక్కడ ఉన్నాయి? అనే దాన్ని బట్టి హార్ట్​ఎటాక్​ తీవ్రత ఉంటుంది. పెద్ద పైపులా ఉండే రక్తనాళాల్లో ఎక్కడ బ్లాక్​ ఉన్నదనేది గమనించాలి. పై భాగంలో బ్లాక్​ అవుతుందా? కింది భాగంలో బ్లాక్​ అవుతుందా? అనేది ముఖ్యం. రక్తనాళం మొదట్లో బ్లాక్​ అయితే డ్యామేజ్​ ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంది. అలాకాకుండా కింది భాగంలో బ్లాక్​ అయితే డ్యామేజ్​గానీ, దాని  ప్రభావంగానీ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. సాధారణంగా సడన్​ హార్ట్​ఎటాక్స్ వల్ల ఉన్నచోటే కుప్పకూలిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే... బ్లాకేజ్​ అనేది రక్తనాళం మొదట్లోనే ఉంటుంది. దానివల్ల గుండె లోని ఎక్కువ భాగం డ్యామేజ్​ అవుతుంది. ఫలితంగా గుండె కొట్టుకునే వేగంలో తేడా వచ్చి చనిపోతారు. 

సైలెంట్​ హార్ట్​ఎటాక్​

నిజానికి సైలెంట్​ హార్ట్​ఎటాక్​ అనేది ‘సైలెంట్’ కానేకాదు. నార్మల్​ హార్ట్​ఎటాక్​ వచ్చినప్పుడు ఛాతి భాగంలో తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. వాళ్లని వెంటనే హాస్పిటల్​కి తీసుకెళ్లాలి. అదే ఛాతిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడిగా అనిపించడంతో పాటు మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగాఉండడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కూడా సైలెంట్​ హార్ట్ ఎటాక్​లో కనిపించవు. అందుకే, చాలామంది వీటి​ని తరచూ వచ్చే అసౌకర్యం అనుకోవాలో లేదా గుండెపోటు సంకేతం అనుకోవాలో తెలియక అయోమయానికి లోనవుతారు. అందుకే, వెంటనే  డాక్టర్​ని కలవరు. దాంతో వాళ్లకి ట్రీట్మెంట్​ ఆలస్యం అవుతుంది. 

హార్ట్​ఎటాక్​ సంకేతాలివి

ఛాతి మధ్యలో నొప్పి వస్తుంది. ఛాతి మీద బరువు పడ్డట్టు ఉంటుంది. అంతేకాకుండా ఛాతిని దగ్గరికి లాగినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు చిన్నగా మొదలై, అప్పుడప్పుడూ వచ్చిపోతుంటాయి. అప్పుడు గుండెలో మంటగా ఉంటుంది. 

శరీర భాగాల్లో నొప్పి

 కొందరిలో చేతులు, వెన్నెముక, మెడ, అరచేయి, పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. మరికొందరిలో వెన్నుభాగం నొప్పి పెడుతుంది. 

శ్వాసలో ఇబ్బంది

తేలికైన పనులు చేసినా కూడా అలసట అనిపించడం గుండెపోటు లక్షణమే. ఛాతిలో నొప్పి ఉన్నా లేకున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది సైలెంట్​ హార్ట్ ఎటాక్​కు కామన్ సిగ్నల్. తల తిరగడం, కళ్లు తిరిగి పడిపోవడం కూడా సంకేతాలే. కొందరిలో వాంతులు వస్తాయి. నిద్రలో చెమటలు పడతాయి. అయితే, ఫ్లూ ఇన్ఫెక్షన్​లో కూడా ఇలాంటి  లక్షణాలే కనిపిస్తాయి. అందుకే, చాలామంది వీటిని హార్ట్​ఎటాక్​ సంకేతాలుగా గుర్తించరు.

30, 40 ఏండ్లలో కూడా

హార్ట్​ఎటాక్​​ అనేది పెద్దవాళ్లలోనే రావాలనే  రూల్​ లేదు. ఎందుకంటే ఇప్పుడు సెడెంటరీ లైఫ్​స్టయిల్... అంటే ఎక్కువ టైం ఫోన్​, టీవీ చూస్తూ కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం​ వల్ల హార్ట్​ఎటాక్​ తొందరగా వస్తుంది. చిన్న వయసే అయినప్పటికీ రక్తకణాల మీద ఒత్తిడి పడి అవి వయసు మీరిపోతున్నాయి. అందుకే, ముప్ఫయి, నలభైయేళ్లు వచ్చేసరికి చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు మొదలవుతున్నాయి. కొలెస్ట్రాల్​ లెవల్స్​ పెరగడం, రక్తనాళాలు బ్లాక్​ అవడం వంటి సమస్యలు పాతికేళ్లు దాటిన వాళ్లలోనూ కనిపిస్తున్నాయి. స్ట్రెస్​ లెవల్స్​ పెరగడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం, వీటికి తోడు పొగతాగడం, ఆల్కహాల్​ వంటి అలవాట్ల వల్ల రక్త ప్రసరణకి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. 

ఇ.సి.జి తీయించుకోవాలి

హార్ట్​ఎటాక్​ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు.  హార్ట్​ఎటాక్​ లక్షణాలు కనిపించినా, ఛాతిలో నొప్పి అనిపించినా  ఏమాత్రం ఆలస్యం చేయకుండా   ఇ.సి.జి (ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్) తీసుకోవాలి. ఆ రిపోర్టుని ఫిజీషియన్​​కి చూపిస్తే, గుండె జబ్బుల ముప్పు ఉందా? లేదా? అన్నది చెబుతారు. ఒకవేళ హార్ట్​ఎటాక్​ ముప్పు ఉందని చెబితే వెంటనే కార్డియాలజిస్ట్​ని కలిసి  ట్రీట్మెంట్ తీసుకోవాలి.  

గోల్డెన్​ అవర్​

హార్ట్ఎటాక్​ వచ్చినప్పుడు బ్లాక్​ అయిన రక్తానాళాన్ని ఎంత తొందరగా ఓపెన్​ చేస్తామనేది చాలా ముఖ్యం. మూసుకు పోయిన రక్తనాళాన్ని గంట లేదా కనీసం మూడు గంటల్లోపల ఓపెన్​ చేయాలి. ఆ టైంని ‘గోల్డెన్​ అవర్’​ అంటాం. మందులు ఇవ్వడం లేదా స్టంట్​ వేయడం వల్ల రక్తనాళం తెరుచుకుంటుంది. ఆ మూడు గంటలు  దాటితే, గుండె కండరాలు దెబ్బతింటాయి. హార్ట్​బీట్​లో తేడా వస్తుంది. దాంతో, ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు.

కేసులు పెరిగాయి 

తిండి, జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల హార్ట్ఎటాక్స్​ వచ్చే ఛాన్స్ ఎక్కువ.  కరోనా టైంలో, కరోనా తగ్గిన తర్వాత కొందరిలో గుండెపోటు కేసులు పెరిగాయి. మనదేశంలో హార్ట్ఎటాక్​తో చనిపోయే వాళ్ల సంఖ్య 2014 నుంచి క్రమంగా పెరుగుతోంది. 

ఈ జాగ్రత్తలు ముఖ్యం

బీపీ, షుగర్​ ఉంటే కంట్రోల్​లో ఉంచుకోవాలి. ఆల్కహాల్​, స్మోకింగ్​ వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి. డైట్​ విషయానికి వస్తే,,.. గుండెని ఆరోగ్యంగా ఉంచే ఫుడ్​ తినాలి. తాజా పండ్లు, కూరగాయలు, వాల్​నట్స్, బాదం, బీన్స్​, హెల్దీ ఫ్యాట్స్​ తింటే మంచిది. అలాగే, ఛాతిలో నొప్పి అనిపించినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే కార్డియాలజిస్ట్​ని కలవాలి. అవసరమైన మందులు వాడాలి.

 డా​.పి.ప్రణీత్​
కార్డియాలజిస్ట్
కేర్​ హాస్పిటల్స్,  హైదరాబాద్​.