- సెన్సెక్స్ 1372 పాయింట్లు అప్..400 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ముంబై:దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కరెంటు మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు ఆపేస్తున్నట్లు చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు రెండు శాతం మేర పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,372.06 పాయింట్లు పెరిగి 74,068.45 వద్ద స్థిరపడింది. ఇది ఒక దశలో 1,793 పాయింట్లు లాభపడి 74,489.39 స్థాయిని తాకింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 399.75 పాయింట్లు ఎగబాకి 22,912.40 వద్ద ముగిసింది. సోమవారం నాటి భారీ పతనం నుంచి మార్కెట్లు కోలుకోవడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చింది. ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేయబోమని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఘర్షణ వాతావరణం కొంత తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. గత సెషన్‌లో ముడి చమురు ధరలు 11 శాతం పడిపోవడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. అంతర్జాతీయ చమురు బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ 1.96 శాతం పెరిగి 101.9 డాలర్లకు చేరింది.
రంగాల వారీగా లాభాలు ఇలా
సెన్సెక్స్ 30 కంపెనీల్లో లార్సెన్ అండ్ టూబ్రో, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. పవర్ గ్రిడ్, ఎస్బీఐ షేర్లు మాత్రమే నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.77 శాతం, స్మాల్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.29 శాతం మేర పెరిగాయి. సర్వీసెస్ రంగం 3.46 శాతం, ఇండస్ట్రియల్స్ 2.98 శాతం, ప్రైవేట్ బ్యాంక్స్ 2.63 శాతం లాభపడ్డాయి. ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రాణించాయి.
నిపుణుల విశ్లేషణ
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గడం వల్ల మార్కెట్లలో రికవరీ కనిపిస్తోందని లైవ్ లాంగ్ వెల్త్ ఫౌండర్ హరిప్రసాద్ అభిప్రాయపడ్డారు. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, హర్మూజ్ పరిణామాలపై స్పష్టత వచ్చే వరకు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లెమన్ మార్కెట్స్ డెస్క్ ఎనలిస్ట్ గౌరవ్ గార్గ్ కూడా చమురు సరఫరా ఆటంకాలు తొలగుతాయనే ఆశతో మార్కెట్ పెరిగిందని తెలిపారు. దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్ఎస్ఈ, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ వంటి ఆసియా మార్కెట్లు సైతం భారీ లాభాలతో ముగిశాయి.
రూ.7.56 లక్షల కోట్లు పెరిగిన సంపద
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.7.56 లక్షల కోట్లు పెరిగి రూ.4,22,78,312.77 కోట్లకు చేరింది. మార్కెట్లో మొత్తం 2,968 షేర్లు లాభపడగా, 1,295 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 168 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) సోమవారం రూ.10,414.23 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.12,033.97 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. సోమవారం సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు పతనమై 72,696.39 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.
23 పైసలు తగ్గిన రూపాయి
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం 23 పైసలు క్షీణించి రూ.93.76 వద్ద ఆల్‌టైమ్ లో స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం కావడం, చమురు ధరల పెరుగుదల ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. విదేశీ నిధులు వెనక్కి వెళ్లడం రూపాయిపై ఒత్తిడి పెంచింది. బుధవారం రూపాయి విలువ రూ.93.65 నుంచి రూ.94.25 మధ్య ఉండవచ్చని అంచనా.
