ఆ నాలుగు పల్లెల్లో రైతు బంధు లేదు.. బీమా రాదు

V6 Velugu Posted on Jun 14, 2021

  • సర్కార్ సాయానికి నోచుకోని నాలుగు పల్లెలు

కడిలబాయితండాకు చెందిన మహిళా రైతు కరంటోతు చంప్లి(48) పేరుపై సర్వే నంబర్ 273/550లో ఉన్న తన తండ్రికి సంబంధించిన 3.20 ఎకరాల అసైన్డ్ భూమిని విరాసత్ చేశారు. ఆమె పేరిట పాత పట్టాదారు పాస్ బుక్ ఉంది. ధరణి పోర్టల్ లోనూ ఆమె వివరాలు ఉన్నాయి. 2020లో మార్చి 31న ఆమె గుండెపోటుతో చనిపోయింది. కొత్త పాస్ బుక్ రాకపోవడంతో రైతు బీమా డబ్బులు రాలేదు. ప్రభుత్వం పాస్ బుక్ ఇచ్చి ఉంటే తమకు బీమా సాయం అందేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ నాలుగేండ్ల కింద చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరిలాగే తమకూ కొత్త పాస్ బుక్కులు వస్తాయని ఆశించిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. రాష్ట్రమంతా అసైన్డ్ పట్టాదారులకు రైతు బంధు, రైతు బీమా వర్తిస్తుంటే రాచకొండ రెవెన్యూ విలేజ్ పరిధిలో మాత్రం పట్టాదారు పాస్ బుక్కులకు కూడా దిక్కు లేకుండా పోయింది. ఫారెస్ట్ అధికారుల అభ్యంతరం పేరిట రెవెన్యూ అధికారులు 800 మంది రైతులకు పాస్ బుక్స్ నిలిపివేయడంతో వారంతా రైతు బంధు సాయానికి నోచుకోవడం లేదు. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తూ చనిపోతే బీమా కూడా అందడం లేదు. 20 ఏండ్లుగా క్రాప్ లోన్లు ఇస్తున్న బ్యాంకులు.. ఇప్పుడు లోన్లు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలతో ఎన్నో ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటున్న దళిత, గిరిజన రైతులు.. ఈ సర్కార్ హయాంలో తీవ్రంగా నష్టపోతున్నారు.

మూడు సర్వే నంబర్లు.. 
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ విలేజ్ పరిధిలోని రాచకొండ, కడిలబాయి తండా, ఐదు దోనల తండా, తూంబాయి తండాల్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 9,418.19 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండగా, 2,217.20 ఎకరాల్లో పట్టా భూములు, 2,063 ఎకరాల్లో లావణి పట్టా(అసైన్డ్) భూములు, 626 ఎకరాల్లో సీలింగ్‌‌‌‌ భూములు ఉన్నాయి. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 273లో మొత్తం 7,351 ఎకరాల భూమి ఉండగా ఇందులో 5,479 ఎకరాలు రిజర్వు ఫారెస్ట్ భూములు, 1871 ఎకరాలు అసైన్డ్, 82.19 ఎకరాలు సీలింగ్‌‌‌‌, 28.28 ఎకరాలు అసైన్‌‌‌‌ మెంట్‌‌‌‌  సీలింగ్‌‌‌‌ భూములు, 53.31 ఎకరాలు ఆర్డీవో సీలింగ్‌‌‌‌ భూములు ఉన్నాయి. అలాగే సర్వేనంబర్ 106లో మొత్తం 559 ఎకరాల భూములు ఉండగా నల్గొండ ఆర్డీవో కింద 111.36 ఎకరాలు, సీలింగ్‌‌‌‌ కింద 12.16 ఎకరాలు, రిజర్వు ఫారెస్టు కింద 89.05 ఎకరాలు ఉన్నాయి. సర్వే నంబర్ 192లో 3,159 ఎకరాలు ఉండగా 3007 ఎకరాలు రిజర్వు ఫారెస్ట్, 152 ఎకరాలు లావణి పట్టా భూములు ఉన్నాయి. 

తొక్కని గడపలేదు.. తిరగని ఆఫీసు లేదు.. 
గత ప్రభుత్వాలు రాచకొండ రెవెన్యూ పరిధిలో 504 మంది రైతులకు లావణి పట్టాలు, 165 మందికి సీలింగ్ పట్టాలు, 185 మంది గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు. వీళ్లందరికి పాత పాస్ బుక్స్ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో పోర్టల్ లోనూ ఈ భూముల సర్వే నంబర్లు, రైతుల పేర్లు నమోదయ్యాయి. కానీ వీరికి అధికారులు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదు. దీంతో వారికి ప్రభుత్వమిచ్చే రైతు బంధు సాయం సుమారు రూ.10 కోట్లు అందకుండా పోయింది. అలాగే సుమారు 40 మంది రైతులు చనిపోయినా రైతు బీమా వర్తించలేదు. తమకు న్యాయం చేయాలని రాచకొండ రైతులు స్థానిక ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు, తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు కలిసినా సమస్య పరిష్కారం కాలేదు. రెవెన్యూ అధికారులు సర్వే మొదలు పెట్టగానే ఫారెస్ట్ అధికారులు ఆటంకాలు సృష్టిస్తున్నారని, రెవెన్యూ భూములను కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ అని వాదిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.  

హద్దులు చూపండి
మా తండా వాళ్లకు లావణి పట్టాలు ఉన్నా ఫారెస్ట్ వాళ్లు భూముల్లోకి రానివ్వట్లే.  రెవెన్యూ అధికారులు పాసు బుక్స్ ఇయ్యట్లేదు. రైతు బంధు వస్తలేదు. ఎన్నో ఏళ్ల నుంచి చౌటుప్పల్ బ్యాంకులో పాస్ బుక్స్ పెట్టి క్రాప్ లోన్లు తీసుకునేటోళ్లం. ఇప్పుడు కొత్త పాస్ బుక్స్ రాకపోవడంతో లోన్లు కూడా ఇస్తలేరు. సర్వే చేసి ఫారెస్ట్, రెవెన్యూ భూముల హద్దు తేల్చాలి. డిజిటల్ సర్వేకు మా ఊరిని సెలక్ట్ చేయాలి.  
- గోవర్ధన్ నాయక్, కడిలబాయి తండా

Tagged Telangana, Rachakonda, rythubandhu, rythu beema, , government help

Latest Videos

Subscribe Now

More News