శంషాబాద్ పరిసరాల్లో చిరుత పులి సంచారం ఆనవాళ్లు లేవు

శంషాబాద్ పరిసరాల్లో చిరుత పులి సంచారం ఆనవాళ్లు లేవు
  • ట్రాప్ కెమెరాలతో ధృవీకరించిన అటవీశాఖ అధికారులు
  • అడవి పిల్లులు.. ఊర కుక్కలు.. అడవి పందుల సంచారమే కెమెరాల్లో రికార్డయింది

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు చుట్టూ..  పరిసరాల్లో చిరుత పులి సంచరించిన ఆనవాళ్లు లేవని.. అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తుందని వచ్చిన వార్తల  నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు  అప్రమత్తమయ్యారు. శంషాబాద్ రేంజి ఫారెస్ట్ సిబ్బంది, విమానాశ్రయం భద్రతా అధికారులతో కలసి చుట్టుపక్కల గట్టి సోదా నిర్వహించారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కెమెరాల్లో అడవి పిల్లులు.. ఊర కుక్కలు.. అడవి పందుల సంచారమే కెమెరాల్లో రికార్డయింది తప్ప చిరుతపులి ఆనవాళ్లు.. అడుగుజాడలు గాని కనిపించలేదు. ఎక్కడ కూడా చిరుత పులి తిరిగిన ఆనవాళ్లు గాని… చిరుతపులికి సంబంధించిన ఎటువంటి చిన్న ఆనవాళ్లు కనిపించలేదు. అయితే విమానాశ్రయం అధికారులకు చిరుత పులి కదలికలున్నాయని.. అడవి పందులను చంపుతోందని సమాచారం రావడంతో అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. చనిపోయిన అడవి పందుల అవశేషాలను క్షుణ్ణంగా పరిశీలించగా వాటిని అడవి కుక్కలు చంపినట్లుగా ఆధారాలు లభించాయి. విమానాశ్రయం అధికారులు కోరటంతో ముందు జాగ్రత్తగా 10 ట్రాప్ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. అందులో కూడా చిరుత పులి కదలికలు ఎక్కడా కనిపించలేదు.  కేవలం ఊర కుక్కలు, అడవి పిల్లులు, పందులు కనిపించాయి. ఇంత వరకు ఎక్కడ కూడా చిరుత పులి అడుగులు కనబడలేదు. విమానాశ్రయం ప్రహారీ దూకినట్లుగా గతంలో సీసీ కెమెరాలకు లభించిన ఆధారాలు సివిట్ క్యాట్ వి (మానుపిల్లి) అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్ పోర్టు అధికారుల విజ్ఞప్తి మేరకు మరొక 10 ట్రాప్ కెమెరాలు, ( మొత్తం 20), రెండు బోనులు (Trap Cages) కూడా పెట్టి తనిఖీలు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు మరియు విమానాశ్రయం సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. తమ సిబ్బంది ద్వారా తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు అభయం ఇచ్చారు.

 

ఇవి కూడా చదవండి

చెరువుల సంరక్షణ కోసం మహిళ డ్యాన్స్ సిరీస్

ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్… ఇంకో పదేండ్లు నేనే సీఎం

నేను రాజీనామా చేయాలనుకుంటున్నారా.. తోలు తీస్తా

వైరల్: కెమెరామెన్ ఓవరాక్షన్‌‌కు వరుడి సూపర్ రియాక్షన్

ధర్మారెడ్డి మన టార్గెట్ కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే కూల్చేయాలి