కొండపోచమ్మ కోసం ఎండుతున్నఎల్లంపల్లి

కొండపోచమ్మ కోసం ఎండుతున్నఎల్లంపల్లి
  • మొత్తం 288 టీఎంసీలొచ్చినా ఇప్పుడు కటకటే
  • ప్రాజెక్టులోకి పైనుంచి ఎన్నడూ లేనంతగా భారీ వరద
  • తొలిసారిగా రివర్స్​ పంపింగ్​తోనూ నీళ్లు
  • ఉన్న నీళ్లన్నీ మిడ్​మానేరుకు లిఫ్టింగ్
  • కేసీఆర్​ ఫామ్​హౌజ్​ సమీపంలోని కొండపోచమ్మ రిజర్వాయర్​కు చేరుతున్న నీళ్లు
  • పది రోజులైతే మంచిర్యాల, పెద్దపల్లితోపాటు
  • హైదరాబాద్​ సిటీకి తాగునీటి ముప్పు

కొండంత ఎత్తుకు గోదావరి నీళ్లను ఎత్తిపోసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో దిగువన ఉన్న ఎల్లంపల్లి అడుగంటుతోంది. ఉన్న నీళ్లన్నీ కొండపోచమ్మ సాగర్​ వైపు లిఫ్ట్​ చేయటం, ఎండలు మండుతుండటంతో రిజర్వాయర్​లో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. బుధవారం నాటికి ఈ రిజర్వాయర్​లో 5.7 టీఎంసీల నీళ్లున్నాయి. గత ఏడాది కంటే నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో రిజర్వాయర్​పై ఆధారపడ్డ రెండు జిల్లాల్లోని టౌన్లకు తాగునీటి ఎద్దడి మొదలైంది. గ్రేటర్​ హైదరాబాద్​కు కూడా ముప్పు పొంచివుంది. రాజధానితోపాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా కేంద్రాలు, నాలుగు నియోజకవర్గాలకు ఎల్లంపల్లి నుంచే డ్రింకింగ్​ వాటర్​ సప్లై అవుతోంది. ఎన్టీపీసీలో కరెంట్ ఉత్పత్తి కోసం కూడా ఇక్కడి నుంచే పైపులైన్  ద్వారా నీటిని సరఫరా చేస్తారు. దీనివల్ల రోజురోజుకు నీటిమట్టం మరింతగా తగ్గిపోతోంది.

ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఎల్లంపల్లి రిజర్వాయర్​లోకి వరద వచ్చినా దానిపై ఆధారపడ్డ ప్రాంతాలకు కటకట మొదలైంది. జనానికి తాగునీటి కష్టాలు తరుముకొస్తున్నాయి. ఇప్పటికే మంచిర్యాలకు మంచి నీళ్లు సప్లైచేసే పంపు హౌస్​కు నీళ్లు అందడం లేదు. ఇతర ప్రాంతాలకూ నీళ్లు సరఫరా చేసే పరిస్థితి లేదు. మరో వారం పాటు ఇదే పరిస్థితి ఉంటే.. మంచి నీటి పథకాలకు సరఫరా ఆగిపోతుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.

కష్టాల్లో ఎల్లంపల్లి స్కీములు

వర్షాలు పడితే తప్ప ఎల్లంపల్లికి నీటి కటకట తప్పేటట్టు లేదు. దిగువన ఉన్న గోదావరి నుంచి రివర్స్​ పంపింగ్​ చేసే పరిస్థితి కూడా లేదు. మేడిగడ్డ బ్యారేజీలో అర టీఎంసీ, అన్నారంలో 2, సుందిళ్లలో 3.5 టీఎంసీల నీళ్లున్నాయి. దీంతో ఇప్పట్లో పంపింగ్ చేసే చాన్స్​ లేదు. ఇక ఎల్లంపల్లి నుంచి రోజూ ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో వాటర్  స్కీంకు 337 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాలకు 39 క్యూసెక్కులు, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలకు 29 క్యూసెక్కులచొప్పున మొత్తంగా 687 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో161 క్యూసెక్కుల నీళ్లు ఆవిరైపోతున్నాయి. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్టీపీసీ సహా వాటర్ ​స్కీంలకు నీటి తిప్పలు తప్పవని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. టౌన్లలోని కాలనీలకు రోజు విడిచి రోజు నీళ్లిస్తున్నారు. మిషన్ భగీరథ పూర్తికాకపోవడంతో మంచిర్యాలలో పాత వాటర్ స్కీం ద్వారా వాటర్​ సప్లై చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లిలో నీళ్లు డ్రింకింగ్​ వాటర్​ స్కీమ్​ల ఇన్​టేక్​ వెల్స్​ కంటే దిగువకు తగ్గిపోయాయి. రిజర్వాయర్​లో కాల్వలు తవ్వి ఇన్​టేక్​ వెల్స్​ వైపు నీళ్లు మళ్లించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు.

తెచ్చింది తక్కువ.. తీసుకుపోయింది ఎక్కువ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తొలిసారిగా గోదావరి నీటిని దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎగువన ఎల్లంపల్లికి (రివర్స్​ పంపింగ్) ఎత్తిపోశారు. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల మీదుగా నుంచి 53 టీఎంసీల నీటిని ఎల్లంపల్లిలో ఎత్తిపోశారు. అదే టైంలో ఎల్లంపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తూ మిడ్​ మానేరుకు తరలించారు. అయితే దిగువన నుంచి ఎత్తిపోసిన నీళ్లతోపాటు రిజర్వాయర్​లో నికరంగా ఉన్న నీళ్లను కూడా లిఫ్ట్ చేయటంతో.. నెల రోజుల్లోనే ఎల్లంపల్లి ఖాళీ అయింది. దిగువ నుంచి ఎల్లంపల్లిలోకి 53 టీఎంసీలు పంపింగ్​ చేస్తే.. ఎల్లంపల్లి నుంచి మాత్రం 68 టీఎంసీలను మిడ్​మానేరుకు లిఫ్టు చేయటం గమనార్హం. దీనితో రిజర్వాయర్​లో ఉండాల్సిన 15 టీఎంసీల నీళ్లు దారి మళ్లాయి. మొత్తం 20.175 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పుడు ఐదు టీఎంసీల నీళ్లే ఉన్నాయి. ఎండాకాలం, లోకల్​ అవసరాలకు సరిపడా నిల్వ చేయాలనే జాగ్రత్తలు తీసుకోకపోవటంతోనే తాగునీటి కటకట మొదలైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లంపల్లి నీళ్లే.. కొండపోచమ్మ వైపు!

ఎగువ నుంచి భారీ వరద, దిగువ నుంచి రివర్స్​ పంపింగ్, ఒక్క ఏడాదిలోనే 288 టీఎంసీల వరద వచ్చినా ఎల్లంపల్లికి నీటి ఎద్దడి తలెత్తటం ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లే, దశలవారీగా మిడ్​మానేరుకు, రంగనాయకసాగర్​కు పంప్​ చేసి.. ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్​కు వైపు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి​ ఫామ్​హౌస్​ ఉంది. అంత దూరం, అంత ఎత్తుకు కాళేశ్వరం నీళ్లను తీసుకెళ్లాలని ప్రభుత్వం చేసిన హడావుడితోనే ఎల్లంపల్లి ఎండిపోతోందన్న విమర్శలు వస్తున్నాయి.

మురికినీళ్లు వస్తున్నయ్

‘‘మా కాలనీల దినం తప్పి దినం నీళ్లిస్తున్నరు. ఆ నల్లాలు గంటసేపు కూడా ఇడుస్తలేరు. మురికి నీళ్లు వస్తున్నయి. తాగడానికి చాలా ఇబ్బందయితుంది.’’

– జి.మధుమిత, రెడ్డికాలనీ, మంచిర్యాల

కెనాల్స్ తీయాల్సిందే..

‘‘మరికొద్ది రోజుల్లో మంచిర్యాల వాటర్ స్కీం, మిషన్ భగీరథ ఇన్​టేక్ వెల్స్​కు నీళ్లొచ్చే పరిస్థితి లేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోంచి కెనాల్స్ తవ్వించి, నీటిని పంప్ ​చేస్తాం.’’

– శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీర్

 రికార్డు వరద.. మొత్తం గోదాట్లోకే..

వానాకాలంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎల్లంపల్లికి వరద వచ్చింది. ఎగువన ఎస్సారెస్పీ నుంచి.. కడెం, ఆదిలాబాద్​ వాగు నుంచి వచ్చిన ఇన్​ఫ్లోలతో 235 టీఎంసీల నీళ్లు వచ్చాయి. దాంతో ఆగస్టులోనే ఎల్లంపల్లి గేట్లు ఎత్తారు. 210 టీఎంసీలను గోదావరిలోకి వదిలేశారు. ఎల్లంపల్లికి వరద వచ్చినపుడు  నీళ్లను లిఫ్ట్ ​చేయకపోవడం, కాళేశ్వరం లింక్2 పనులు మొదలుకాకపోవడంతో నీళ్లన్నీ వృధాగా వెళ్లాయి.