- హెచ్ఎండీఏకే భారీ నిర్మాణాల అనుమతులు కొనసాగిస్తారా?
- లేదా జీహెచ్ఎంసీకి బదలాయిస్తారా?
- త్వరలోనే సీఎం అధ్యక్షతన హెచ్ఎండీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ
హైదరాబాద్సిటీ, వెలుగు: విలీనం తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మధ్య అధికారాల బదిలీలపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. ఇప్పటికే కొత్తగా విస్తరించిన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ పరిపాలన ప్రారంభం కావడంతో పాటు వార్డుల డీలిమిటేషన్ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్వరకూ హైరైజ్ భవనాలు, అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు, కొత్త లేఅవుట్ల అనుమతులన్నీ హెచ్ఎండీఏనే ఇస్తుంది. విస్తరణ తర్వాత ఈ అధికారాలు జీహెచ్ఎంసీకి బదిలీ అవుతాయా అనేది ఇంకా స్పష్టత లేదు. ఔటర్ప్రాంతాల్లో భారీ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న హెచ్ఎండీఏ వద్దనే డెలిగేషన్పవర్స్ఉన్నాయి. హెచ్ఎండీఏ నుంచి ఈ అధికారాలు జీహెచ్ఎంసీకి రావాలంటే చాలా తతంగమే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. భారీ నిర్మాణాలు, అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు, విల్లాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా హెచ్ఎండీఏ ఏటా రూ.1,300 నుంచి రూ.1,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. తాజా పరిణామాల నేపథ్యంలో తన అధికారాలు జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తే హెచ్ఎండీఏ తన ఆదాయాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందంటున్నారు.
త్రిపుల్ఆర్లోనే హెచ్ఎండీఏ అనుమతులు!
హెచ్ఎండీఏ పరిధి ప్రస్తుతం ఓఆర్ఆర్అవతల నుంచి త్రిపుల్ఆర్వరకూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నిర్మించే నిర్మాణాలకే హెచ్ఎండీఏ
అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నగరం నుంచి 2వేల చ. కి.మీ. దాటిన తర్వాతనే హెచ్ఎండీఏ పరిధి మొదలవుతుంది. ప్రస్తుతం త్రిపుల్ఆర్పరిధిలో కొత్తగా నిర్మాణాలు పెద్దగా జరగడం లేదు. ఆయా ప్రాంతాలు అభివృద్ధి సాధించి భారీ నిర్మాణాలు రావాలంటే మరో 6 నుంచి 10 ఏండ్ల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకూ హెచ్ఎండీఏ మనుగడ ఎలా అన్న విషయంలో స్పష్టత లేదు. ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ఎలివేటెడ్కారిడార్లు, ఓఆర్ఆర్ నుంచి త్రిపుల్ఆర్ను కలుపుతూ నిర్మించే రేడియల్రోడ్ల నిర్మాణం, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే హెచ్ఎండీఏకు భారీగా నిధులు అవసరం. మరి ఈ నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న విషయంలోనూ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని అధికారులు
తెలిపారు.
సీఎం వద్దనే తేలనున్న భవితవ్యం
జీహెచ్ఎంసీ పరిధి విస్తరించడం, హెచ్ఎండీఏ అధికారాలను కుదించడం విషయాలపై రెండు శాఖల మధ్య నెలకొన్న సందగ్ధత త్వరలోనే తొలగిపోనుంది. ప్లానింగ్బాడీగా ఉన్న హెచ్ఎండీఏకు ప్రస్తుతం ఉన్న అధికారాలను జీహెచ్ఎంసీకి బదలాయిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే భారీ నిర్మాణాల అనుమతులు ఎవరు ఇవ్వాలన్న విషయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన త్వరలోనే హెచ్ఎండీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలోనే భారీ నిర్మాణాల అనుమతులు ఎవరి పరిధిలో ఉండాలన్న విషయం పై క్లారిటీ రానుందని తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలో ఇప్పుడు హెచ్ఎండీఏ ఇస్తున్న భారీ నిర్మాణాల అనుమతుల అధికారాన్ని కొనసాగిస్తారా? లేక ఆ అధికారాలను జీహెచ్ఎంసీకే బదలాయిస్తారా? అన్న విషయంపైనే అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
