కులాలు, మతాలకు అతీతంగా .. స్నేహభావంతో ఉండాలి

కులాలు, మతాలకు అతీతంగా ..  స్నేహభావంతో ఉండాలి
  • మనిషికి అవయవాలు ఎంత అవసరమో వృత్తులు అంతే అవసరం
  • పాలకుల ప్రేమ, భక్తి శ్రద్ధల వల్ల రాష్ట్రం ఏ లోటూ లేకుండా సాగుతున్నది: చిన జీయర్​స్వామి
  • జనగామ జిల్లా వల్మిడి రామాలయంలో విగ్రహ పున: ప్రతిష్ఠాపన

జనగామ/ పాలకుర్తి, వెలుగు: సమాజంలో అందరూ ఒకేతాటిపై ఉండాలి.. కులాలు, మతాలకు అతీతంగా స్నేహభావంతో మెలగాలి.. సమాజం పెద్ద శరీరం లాంటిది.. మనిషికి అవయవాలు ఎంత అవసరమో అన్ని వృత్తులు అంతే అవసరం..’’ అని త్రిదండి చినజీయర్​ స్వామి అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలోని రామాలయంలో సోమవారం విగ్రహ పున: ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిం ది . ఈ వేడుకకు చినజీయర్​ సహా మంత్రులు, లీడర్లు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. మనుషుల్లో అంతర్లీనమై ఉన్న ప్రేమ, సోదర భావం పెంపొందించి మానసిక ధైర్యం ఇచ్చేందుకు ఆలయాలు ఎంతో అవసరమని చినజీవయర్​ చెప్పారు. 

పాలకుల ప్రేమ, భక్తి శ్రద్ధల వల్ల రాష్ట్రం ఏ లోటూ లేకుండా సాగుతున్నదని తెలిపారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆలయ పున:నిర్మాణం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అభినందనీయుడని ఆయన అన్నారు. పురాతన ఆలయాన్ని టూరిజం ప్యాకేజీలో అభివృద్ధి చేయడం గొప్ప విషయమని చెప్పారు. వాల్మీకి నివాసం ఉన్న ప్రాంతం అయినందునే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. పక్కన ఉన్న మునుల గుట్టను కూడా అందంగా తీర్చిదిద్ది, రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రులను ఆయన కోరారు.  కాగా, వల్మిడి ఆలయ వేడుకకు సీఎం కేసీఆర్​ వస్తారని అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయన రాలేదు.