25 ఏండ్లుగా భద్రత కల్పించిన ఎస్పీఎఫ్​ను పక్కన పెడ్తున్న సర్కార్

25 ఏండ్లుగా భద్రత కల్పించిన ఎస్పీఎఫ్​ను పక్కన పెడ్తున్న సర్కార్
  •     గతంలో కంటే రెట్టింపుగా.. 350 మంది పోలీసులతో కాపలా

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్​దరిదాపుల్లో ఆందోళనలు, నిరసనలకు తావులేకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది. సెక్రటేరియెట్ పరిధిలో ఆందోళనలు జరిగితే అణచివేసేలా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాలని భావిస్తోంది. ఎవరైనా చలో సెక్రటేరియెట్ అంటూ ఆయా సమస్యలపై  ధర్నాలకు, ఆందోళనలకు పిలుపునిస్తే అరెస్ట్​లు చేసి, భయబ్రాంతులకు గురిచేయాలన్న ఆలోచనతోనే..  ఇప్పుడున్న ఎస్పీఎఫ్ సిబ్బందికి కాకుండా సివిల్, బెటాలియన్ పోలీసులకు సెక్యూరిటీ బాధ్యతలను అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంతకుముందు సెక్రటేరియెట్ వద్ద ఉన్న సిబ్బంది కంటే రెట్టింపుగా కొత్త సెక్రటేరియెట్​కు నలువైపులా 350 మంది పోలీసులతో బందోబస్తుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఆరు ఫ్లోర్లు ఉన్న కొత్త సెక్రటేరియేట్​లో ఒక్క సీఎం, సీఎంఓ ఉండే ఆరో ఫ్లోర్​లోనే 30 మంది పోలీసులను సెక్యూరిటీగా పెట్టనున్నట్లు తెలిసింది.

మిగతా అన్ని ఫ్లోర్​లకూ పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 3 ఎంట్రెన్స్​లు ఉండటంతో మూడు చోట్ల గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నారు. సీఎం, మంత్రులు, సీఎస్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్లే మార్గాల్లో ఎక్కువ మందితో సెక్యూరిటీ కల్పించనున్నారు. మొత్తంగా 350 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చి సెక్రటేరియెట్ విధుల్లోకి తీసుకోనున్నారు. అడిషనల్ ఎస్పీ హోదాలోని అధికారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్​గా ఉండనున్నారు. 

కావాలనే ఎస్పీఎఫ్​ను పక్కన పెడ్తున్నరు 

ఉమ్మడి ఏపీ కాలం నుంచి రాష్ట్ర సెక్రటేరియెట్​భద్రతను తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) సిబ్బంది చూసుకుంటున్నారు. దాదాపు 25 ఏండ్ల నుంచి ఇబ్బందులు లేకుండా ఎస్పీఎఫ్​ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సీఎస్, సీనియర్ ఐఏఎస్​లు, సెక్రటేరియెట్ సిబ్బంది వ్యవహారాలపై వీరికి అవగాహన ఉంది. ఏదైనా సమస్యతో వచ్చే విజిటర్స్ విషయంలోనూ మంచి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక సెక్రటేరియెట్​​లోనూ ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలోనే సెక్యూరిటీ కొనసాగుతోంది.

ప్రస్తుతం దాదాపు120 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఎస్పీఎఫ్ బందోబస్త్ వల్ల ఎలాంటి సమస్యలు రాలేదు. అయినా.. ఎస్పీఎఫ్​ను పక్కనపెట్టి సివిల్​, బెటాలియన్ పోలీసులకే బాధ్యతలు అప్పగించడంపై మంత్రులు, ఉన్నతాధికారుల నుంచే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పట్లాగే ఎస్పీఎఫ్​తో సెక్యూరిటీ ఏర్పాటు చేసి.. అదనపు సిబ్బంది కోసం బెటాలియన్ పోలీసులను వినియోగించుకుంటే బాగుంటుందని ఇటీవల సీఎం వద్ద మంత్రులు, సీఎస్, డీజీలు అభిప్రాయపడినట్లు తెలిసింది.