స్పెయిన్‌లో మంటలు.. 7 వేల ఎకరాల్లో అడవి దగ్ధం

స్పెయిన్‌లో మంటలు.. 7 వేల ఎకరాల్లో అడవి దగ్ధం

అడవికి దగ్గరున్న ఊరును ఖాళీ చేయించిన అధికారులు

విలన్యువా డి వివర్‌‌ (స్పెయిన్‌) : స్పెయిన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈస్టర్న్​  వాలెన్సియా రీజియన్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో 3 వేల హెక్టార్లకు పైగా ( 7,413 ఎకరాలు) అడవి కాలిపోయింది. ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న దాదాపు 1,500 కుటుంబాలను ముందు జాగ్రత్తగా అధికారులు ఖాళీ చేయించారు. 500 మందికిపైగా ఫైర్‌‌ సిబ్బంది, 18 విమానాలు,  హెలికాప్టర్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. యూరోప్‌ ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న భూమిలో తేమ తగ్గడంతో అక్కడున్న అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం చెలరేగిన ఈ మంటలు క్లైమేట్‌ ఎమర్జెన్సీ పరిస్థితులకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని స్పానిష్‌ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎండాకాలం కంటే ముందే వాతావరణం వేడిగా ఉంటుందని, అందుకే ఇలాంటి అగ్ని ప్రమాదాలు సాధారణంగా జరుగుతున్నాయని పర్యావరణ మంత్రి థెరిసా రిబెరా అన్నారు. కాగా, యూరోపియన్‌ ఫారెస్ట్‌ ఫైర్‌‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ప్రకారం.. స్పెయిన్‌లో గతేడాది 493 అగ్ని ప్రమాదాలు జరగగా, 3,07,000 హెక్టార్లలో భూమి నాశనం అయింది.