బీఆర్ఎస్ ఆవిర్భావంపై పార్టీ క్యాడర్‌‌లో కన్ఫ్యూజన్

బీఆర్ఎస్ ఆవిర్భావంపై పార్టీ క్యాడర్‌‌లో  కన్ఫ్యూజన్
  • ఈనెల 27న ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలన్న హైకమాండ్
  • టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చింది అక్టోబర్ 5న
  • డిసెంబర్​9న ఏర్పడిన బీఆర్ఎస్

హైదరాబాద్, వెలుగు: భారత​రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావం ఎప్పుడనే కన్ఫ్యూజన్ ఆ పార్టీ క్యాడర్‌‌లో నెలకొంది. గతేడాది డిసెంబర్​9న బీఆర్ఎస్ ఏర్పడింది. కానీ ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని శ్రేణులను హైకమాండ్​ఆదేశించింది. 25న అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవాలని, 2,500 మంది నుంచి 3 వేల మంది వరకు ముఖ్య నాయకులందరినీ ఆహ్వానించాలని సూచించింది. 27న అన్ని గ్రామాలు, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని నిర్దేశించింది. అదే రోజు తెలంగాణ భవన్‌లో ఎంపిక చేసిన 350 మంది ప్రతినిధులతో రాష్ట్ర జనరల్​బాడీ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం తెలంగాణ భవన్‌పై బీఆర్ఎస్ జెండాను పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత నిర్వహించే జనరల్​బాడీ సమావేశంలో రాష్ట్ర, జాతీయ అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదిస్తారు. ఈ ఏడాదే జరిగే అసెంబ్లీ సమావేశాలకు సమాయత్తతపైనా చర్చిస్తారు. నిజానికి అక్టోబర్‌‌లో వరంగల్​కేంద్రంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తామని కేసీఆర్ కొన్నాళ్ల కిందట ప్రకటించారు. అక్టోబర్‌‌లో బీఆర్ఎస్​ ఆవిర్భావ సభకు ప్లాన్ చేసినప్పుడు.. ఇప్పుడు నిర్వహించే సమావేశం పేరు ఏమిటనే చర్చ గులాబీ నేతల మధ్య జరుగుతున్నది.

ఎన్నికలకు సిద్ధం చేసేందుకేనా

రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. కేవలం ఆరు నెలల సమయమే ఉండటంతో పార్టీ ముఖ్య నాయకులను ఎలక్షన్లకు సిద్ధం చేయడమే టార్గెట్​గా 27న పార్టీ జనరల్​బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఇన్నాళ్లు క్యాడర్​ను సంతృప్తి పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. 40కి పైగా నియోజకవర్గాల్లో పార్టీలో గ్రూపులు, లీడర్ల మధ్య కుమ్ములాటలు ఎక్కువగా ఉండటంతో వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో భాగంగానే సమ్మేళనాలకు రూపకల్పన చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఏం చెయ్యాలి? లీడర్లను ఎలా కలుపుకొని పోవాలి? అనే అంశాలపై 27న నిర్వహించే జనరల్​బాడీ మీటింగ్​లో కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు వివరించడం, అభివృద్ధి గురించి ప్రచారం చేసుకోవడంపై సూచనలు చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పలు అంశాలపై తీర్మానాలు చేయనున్నారు.

ఏప్రిల్ 27.. అక్టోబర్5.. డిసెంబర్ 9..

2021 ఏప్రిల్​27న జలదృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఏప్రిల్​నెలలో పార్టీ ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వహిస్తూ వస్తున్నారు. 2014 తర్వాత రెండేళ్లకోసారి ప్లీనరీ నిర్వహించేలా పార్టీ నిబంధనల్లో మార్పులు తెచ్చారు. కరోనా కారణంగా 2020లో ప్లీనరీ నిర్వహించలేదు. దీంతో 2021, 2022 సంవ త్సరాల్లో వరుసగా ప్రతినిధుల సభ (ప్లీనరీ) నిర్వ హించారు. 2021లో నిర్వహించిన ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడికి ఉన్న అధికారాలన్నీ వర్కింగ్​ప్రెసిడెంట్‌కు దాఖలు పరుస్తూ కీలక తీర్మానాని కి ఆమోదం తెలిపారు. 2022 ప్లీనరీ మొత్తం టీఆర్ఎస్​ను బీఆర్ఎస్​గా మార్చే లైన్​లో నిర్వ హించారు. 2022 అక్టోబర్​5న టీఆర్ఎస్​పార్టీ పేరును బీఆర్ఎస్​గా మారుస్తూ తీర్మానం చేశా రు. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలు పుతూ డిసెంబర్​8న లేఖ రాసింది. డిసెంబర్​9న మధ్యాహ్నం 1.20 గంటలకు తెలంగాణ భవన్​పై కేసీఆర్​బీఆర్ఎస్​ జెండా ఎగుర వేసి పార్టీ పేరు మారినట్టు అధికారికంగా  ప్రకటించారు. పార్టీ జనరల్​బాడీ సమావేశం నిర్వహించి జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ​పోషించబోయే పాత్రపై ముఖ్య నాయకులకు వివరించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చింది అక్టోబర్ 5న అయితే.. పార్టీ ఆవిర్భా వ దినోత్సవంగా నిర్వహించింది డిసెంబర్​9న. ఈ రెండు రోజుల్లో కాకుండా టీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసిన రోజున బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తుండటంతో క్యాడర్​లో గందరగోళం నెలకొంది.