
- రకరకాల టెక్నికల్ సమస్యలతో తలపట్టుకున్న రెవెన్యూ స్టాఫ్
- మొరాయించిన సర్వర్.. ఓపెన్‌కాని పోర్టల్
- పావుగంటలో అయితదనుకుంటే.. గంటల పాటు వెయిటింగ్
- తహసీల్దార్ ఆఫీసుల్లో పడిగాపులు కాసిన జిల్లాల కలెక్టర్లు
- పలు మండలాల్లో లాగిన్ కాలేకపోయిన తహసీల్దార్లు
(వెలుగు, నెట్వర్క్) భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం రాష్ట్ర సర్కారు తెచ్చిన ధరణి పోర్టల్తొలి రోజే రెవెన్యూ స్టాఫ్‌కు, పబ్లిక్కు చుక్కలు చూపించింది. కొన్నిచోట్ల పోర్టల్ ఓపెన్ కాలే.. ఇంకొన్ని చోట్ల సర్వర్ ప్రాబ్లం.. చాలాచోట్ల డిజిటల్ సిగ్నేచర్ ఎర్రర్, రివర్స్ ఎండార్స్మెంట్ ప్రింటర్ సమస్య.. ఆధార్ అథెంటికేషన్ రాక.. ఫింగర్ప్రింట్లు తీసుకోక గంటలు గంటలు సతాయించింది. సోమవారం మధ్యాహ్నం దాకా ఎక్కడా రిజిస్ట్రేషన్లు మొదలే కాలేదు. ధరణి సేవలను లాంఛనంగా ప్రారంభించేందుకు తహసీల్దార్ ఆఫీసులకు వచ్చిన ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతోపాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు కూడా రెండు మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. దీంతో రెవెన్యూ స్టాఫ్ తలపట్టుకున్నారు. ప్రధానంగా రివర్స్ ఎండార్స్మెంట్ డాక్యుమెంట్ ప్రింటర్‌కు సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో చాలాచోట్ల రిజిస్ట్రేషన్లు మధ్యలోనే నిలిచిపోయాయి. కొన్ని తహసీల్దార్ఆఫీసుల్లో ఒకట్రెండు రిజిస్ట్రేషన్లు మాత్రం చేయగలిగారు. ఇక ధరణి పోర్టల్లో సర్వే నంబర్ల వారీగా విస్తీర్ణం తక్కువగా ఉండడం, రైతుల ఫొటోలు లేకపోవడం, కొన్ని ఊర్ల పేర్లు లేకపోవడం వంటి సమస్యలను ఆఫీసర్లు గుర్తించారు.
గత నెల 29న మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ ఆఫీసులో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అఫీషియల్‌గా ప్రారంభించారు. సోమవారం (ఈ నెల 2) నుంచి స్టేట్‌వైడ్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. సీఎం చెప్పినట్టే సోమవారం 570 మండలాల్లో ధరణి సేవలను ప్రారంభిస్తున్నట్టు ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వారు ఉదయం 10 గంటల నుంచే తహసీల్దార్ ఆఫీసులకు క్యూ కట్టారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా.. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుందని ఆశించారు. కానీ అంతటా సర్వర్ మొరాయించింది. పలు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా మంది తహసీల్దార్లు మధ్యాహ్నం వరకు కూడా పోర్టల్‌లోకి లాగిన్ కాలేకపోయారు. రివర్స్ ఎండార్స్మెంట్ డాక్యుమెంట్ ప్రింటర్ప్రాబ్లమ్వచ్చింది. పాస్ బుక్ లో పేజీకి రెండో వైపు ప్రింట్ కాలేదు. దీంతోపాటు అనేక మండలాల్లో వివిధ టెక్నికల్ సమస్యలు ఎదురయ్యాయి. మారుమూల మండలాల్లో సిగ్నల్స్సమస్యలతో ధరణి పోర్టల్ తెరుచుకోలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవాళ్లు గంటల తరబడి ఎదురుచూసి వెనుదిరిగారు. మధ్యాహ్నం రివర్స్ ఎండార్స్మెంట్ ప్రింటర్ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడంతో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా165 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.
ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య
3 గంటలు వెయిట్ చేసిన జగిత్యాల కలెక్టర్
కరీంనగర్జిల్లా చొప్పదండి మండలంలో నాలుగు స్లాట్స్బుక్ కాగా.. ఫస్ట్ డాక్యుమెంట్నుంచే సర్వర్ మొరాయించింది. కరీంనగర్ రూరల్ లో మూడు స్లాట్స్బుక్చేసుకోగా.. తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ ఎర్రర్ వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో తహసీల్దార్ల డిజిటల్ సిగ్నేచర్లు మ్యాచ్ కాక సైట్ ఓపెన్ కాలేదు. తొలిరోజు గిప్ట్ డీడ్లు రిజిస్ట్రేషన్కాలేదు. జిల్లాలో 28 మంది స్లాట్బుక్చేసుకోగా.. తొమ్మిది రిజిస్టేషన్లే అయ్యాయి. జగిత్యాల తహసీల్దార్ఆఫీసులో ధరణి సేవలు ప్రారంభించేందుకు వచ్చిన కలెక్టర్ రవి.. పోర్టల్ సతాయించడంతో మూడు గంటలు వెయిట్చేశారు. ఉదయం 11 గంటలకు రిజిస్ట్రేషన్అనుకోగా.. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించారు.
మెదక్‌లో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలే..
మెదక్ జిల్లాలో 10 మంది స్లాట్ బుక్ చేసుకున్నా ఒక్క రిజిస్ట్రేషన్‌కూడా కాలేదు. ల్యాండ్ పార్టిషన్ కోసం కొల్చారానికి చెందిన వారు స్లాట్ బుక్ చేసుకోగా ఆధార్ ఆథెంటికేషన్ కాకపోవడంతో ప్రాసెస్ పూర్తి కాలేదు. సిద్దిపేట జిల్లాలో ఒకే స్లాట్ బుక్కయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 17 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మారుమూల మండలాలైన నాగల్ గిద్ద, కంగ్టి, కల్హేర్, మొగుడంపల్లి, పుల్కల్, రాయికోడ్, నారాయణఖేడ్ మండలాల్లో మధ్యాహ్నం వరకు సర్వర్ డౌన్ అయింది.
డిజిటల్ సిగ్నేచర్లు ఎర్రర్ వచ్చి..
వరంగల్ అర్బన్ జిల్లాలో 15 స్లాట్లు బుక్‌చేసుకోగా.. కేవలం 8 రిజిస్ట్రేషన్లు జరిగాయి. హసన్‌పర్తిలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్లు చాలాసేపు ఎదురుచూసి వాపస్ పోయారు. సర్వర్మొరాయించడంతో సాయంత్రం 4 గంటల వరకు ఆరు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో మ్యుటేషన్‌కు సంబంధించి డిజిటల్ సంతకం చేసేప్పుడు సర్వర్ ప్రాబ్లం వచ్చింది. ములుగు జిల్లాలో 9 మండలాలు ఉండగా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో 7 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ సందర్భంగా సర్వే నంబర్ల వారీగా విస్తీర్ణం తక్కువగా ఉండడం, ఊర్ల పేర్లు సరిగా లేకపోవడం సమస్యలను ఆఫీసర్లు గుర్తించారు.
కామారెడ్డి జిల్లాలో ఐదే రిజిస్ట్రేషన్లు
కామారెడ్డి జిల్లాలో తొలి గంటన్నర పాటు తహసీల్దార్లు లాగిన్కాలేకపోయారు. రివర్స్ ఎండార్స్మెంట్ డాక్యుమెంట్ ప్రింటర్‌కు సర్వర్ కనెక్ట్ కాలేదు. మూడు గంటలు కష్టపడితే కామారెడ్డి తహసీల్దార్ ఆఫీసులో మూడు, లింగంపేటలో ఒకటి, బాన్సువాడలో ఒక రిజిస్ట్రేషన్ చేశారు.
ఆరు స్లాట్లు.. మూడు రిజిస్ట్రేషన్లు
ఆదిలాబాద్ జిల్లాలో సోమవారానికి 9 స్లాట్లు బుక్ కాగా మూడు రిజిస్ట్రేషన్లు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ధరణి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్ కాలేదు. ఆసిఫాబాద్ లో ఒక స్లాట్ బుక్ అయినా వేలిముద్ర తీసుకోలేదు. మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో ధరణి రిజిస్ట్రేషన్లలో టెక్నికల్ ప్రాబ్లమ్తలెత్తింది. తహసీల్దార్ల డిజిటల్ సిగ్నేచర్ ఎర్రర్స్ వచ్చాయి. హాజీపూర్ మండలంలో సోమవారం ఐదు స్లాట్స్ బుక్ కాగా.. ఒకే ఒక్క రిజిస్ట్రేషన్ పూర్తిచేశారు. జైపూర్‌లో ఒక స్లాట్ బుక్ కాగా.. కరెంటు లేక రిజిస్ట్రేషన్ చేయలేదు.
మిగతా జిల్లాల్లోనూ..
- నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సర్వర్ బిజీ కారణంగా మీ సేవ సెంటర్ల వద్ద స్లాట్ బుకింగ్ కోసం రైతులు పడిగాపులు పడ్డారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలో, సూర్యాపేటలో సర్వర్ ప్రాబ్లమ్ వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రైతుల రిజిస్ట్రేషన్లు మధ్యలో నిలిచాయి.
- పాలమూరు పరిధిలోని గద్వాల జిల్లా లో రిజిస్ట్రేషన్లకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. ధరూర్‌లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించినా రిజిస్ట్రేషన్లు జరగలేదు. గిఫ్ట్ డీడ్ కోసం ఒక స్లాట్ బుక్ అయినా సాయంత్రం నాలుగున్నర వరకూ డిజిటల్ సిగ్నేచర్ దగ్గరే ఆగిపోయింది. మానవపాడు మండలంలో వెబ్ సైట్ ఓపెన్ కాలేదు.- నాగర్ కర్నూలు జిల్లాలో చాలాచోట్ల రివర్స్ ఎండార్స్మెంట్ ప్రింటర్ వద్ద టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. నారాయణపేట జిల్లాలో కొద్ది సేపు సర్వర్ సతాయించింది. దీనికి ఇంటర్నెట్ఇష్యూ కూడా తోడై స్టాఫ్, రైతులు ఇబ్బందిపడ్డారు.
- ఖమ్మం జిల్లాలో పలు చోట్ల సర్వర్ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్లు లేటయ్యాయి. కల్లూరులో మీసేవలో స్లాట్‌బుక్ చేసుకోవడంలో సమస్య ఏర్పడింది. ఎర్రుపాలెం,
పెనుబల్లి మండలాల్లో సర్వర్ చాలా సేపు సతాయించింది.