ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకే రోజు ఏడు చోట్ల చోరీలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకే రోజు ఏడు చోట్ల చోరీలు
  • హుండీలు, తాళం వేసిన ఇండ్లే టార్గెట్
  • చైన్ స్నాచింగ్ లతోనూ దడ పుట్టించిన దుండగులు
  • పోలీసులకు సవాలుగా మారిన కేసుల ఛేదన

వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొంగలు హడలెత్తిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఉదయం 4గంటల వరకు దొంగతనాలు చేస్తూ ధనం, నగలు లూటీ చేస్తున్నారు. తాళం వేసిన ఇండ్లు, ఆలయాల హుండీలు టార్గెట్ చేస్తున్నారు. ఒకింతకు తెగించి, చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించకుండా మాస్కులు ధరిస్తున్నారు. అవసరం అయితే సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, హార్డ్ డిస్క్ లను ఎత్తుకెళ్తున్నారు. అంతేకాక బయోమెట్రిక్ పడకుండా చేతులకు గ్లౌజలు ధరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒకే రోజు ఏడు సంఘటనలు జరగగా.. ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.

పీఎస్ పక్కనే..

మరిపెడ: పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా.. దొంగలు చోరీకి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటాక మరిపెడ పీఎస్ పక్కనే ఉన్న వీఆర్ మొబైల్స్ లో దొంగలు పడ్డారు. రేకులు కట్ చేసి, లోపలికి దూరారు. రూ.10వేల క్యాష్, రూ.80వేల విలువైన మొబైల్స్ ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, హార్డ్ డిస్కులు తీసుకెళ్లారు. కాగా, రెండ్రోజుల కింద మరిపెడలోని ఓ ఫర్టిలైజర్ షాప్ లో, ఎల్లంపేటలోని తాళం వేసిన ఇంటిలో దొంగలు చోరీలు చేశారు.

ఓసిటీలో.. హుండీలో..

కాశిబుగ్గ: వరంగల్ ఓసిటీలో ప్రముఖ సీతారామాంజనేయ స్వామి నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ టెంపుల్ లో ఆదివారం తెల్లవారుజామున కొందరు దుండగులు చొరబడి, హుండీలు పగలగొట్టారు. దాదాపు రూ.లక్ష సొత్తు ఎత్తుకెళ్లారు. అర్చకులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. కాగా, గతంలోనూ ఈ ఆలయంలో రెండు సార్లు హుండీలు పగలగొట్టారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా దొంగలు కల్లుగప్పి హుండీలను ధ్వంసం చేశారు.

ఎస్ఆర్ హాస్టల్ లో..

హసన్ పర్తి: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్  శివారులోని ఎస్ఆర్ హాస్టల్ లో ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు దుండగులు చొరబడి సెల్ ఫోన్లు, లాప్ టాప్ ఎత్తుకెళ్లారు. గోడ దూకి పారిపోతుండగా.. పోలీసులకు ఒకరు చిక్కారు. మరొకరు బావిలో పడిపోయాడు. ఇంకొకరు పరారీలో ఉన్నాడు. ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అలాగే హసన్​పర్తిలోని దేవన్నపేటలోనూ ఇద్దరు దొంగలు శనివారం అర్ధరాత్రి ఇండ్లలో చోరీకి యత్నించారు. కాలనీవాసులు అలెర్ట్ కావడంతో వారు పారిపోయారు. అంతకుముందు ఇదే కాలనీ సమీపంలోని ఆలియా తండాలో నలుగురు వ్యక్తులు పిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చారు. వారిని స్థానికులు పట్టుకోగా.. ఇద్దరు తప్పించుకున్నారు. మిగిలిన ఇద్దరిని చితకబాది, పోలీసులకు అప్పగించారు.

ఐనవోలు జాతరలో చైన్ స్నాచింగ్..

ఐనవోలు: ఐనవోలులో సాగుతున్న మల్లన్న జాతరలో ఓ దొంగ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గండు వసంత అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి  మల్లన్న దర్శనం కోసం రాగా.. శనివారం అర్ధరాత్రి సమయంలో వసంత మెడలోని పుస్తెల తాడును తెంపుకుని ఓ వ్యక్తి పరార్ అయ్యాడు. పోలీస్ స్టేషన్​కు సమీపంలోనే ఇది జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి, అనుమానితుడి ఫొటోలు రిలీజ్ చేశారు.  ఆచూకీ తెలిస్తే  87126 85030, 87126 85244 నెంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై వెంకన్న కోరారు.

పీహెచ్ సీలో..

మహబూబాబాద్ అర్బన్: మహబూబాబాద్ మండలం మల్యాల  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఆసుపత్రిలో దొంగలు చొరబడి టీవీ, పవర్ ఇన్వర్టర్ ను దొంగలించారు. డాక్టర్ అన్వేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.