గేమింగ్ జోన్లకు టార్గెట్​కి మించి ఆదాయం

గేమింగ్ జోన్లకు టార్గెట్​కి మించి ఆదాయం

హైదరాబాద్, వెలుగు: సిటీలోని గేమింగ్ జోన్లకు మస్త్​క్రేజ్ ఉంటోంది. కరోనాతో రెండేళ్లుగా మూతపడ్డ గేమింగ్ జోన్లు.. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో గతంలో కంటే రెట్టింపు జోష్​తో నడుస్తున్నాయి. వీక్​డేస్ లోనూ జనం ఎక్కువగా వస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో రద్దీ అంతకు డబుల్​ఉంటోందంటున్నారు. ఇండోర్ గేమ్స్​కు సిటిజన్లు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

10 నుంచి 100 రకాల గేమ్స్

కరోనాకు ముందు గేమింగ్ జోన్లకు మామూలు రోజుల్లో వెయ్యి నుంచి 1500 మంది దాకా వెళ్తుండేవారు. వీకెండ్స్, హాలిడేస్​లో ఆ సంఖ్య 4 వేల నుంచి 5వేల వరకు ఉండేది. ప్రస్తుతం అంతకుమించి జనం​వస్తున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. వారికి అనుగుణంగా సిటీలో పదుల సంఖ్యలో గేమింగ్​జోన్లు అందుబాటులో ఉన్నాయి. బయట సపరేట్​గా ఏర్పాటు చేసేవాటి కంటే మాల్స్​లో ఉండే ఇండోర్ గేమింగ్ జోన్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. షాపింగ్​కోసం, టైంపాస్ కోసం వెళ్లే చాలామంది వీటిల్లో గడుపుతుంటారు. ఒక్కో జోన్​లో విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 100 రకాల ఆటలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్​చేసే గేమ్స్​ఉన్నాయి. ఈ గేమ్ జోన్లలో ఆడాలంటే ముందుగా కార్డు తీసుకుని అందులో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 500 నుంచి వెయ్యి, రూ.1500 ఇలా మనకు నచ్చినంత అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. కార్డు సాయంతో స్కాన్​చేసి నచ్చిన గేమ్ ఆడుకోవచ్చు. కొన్ని చోట్ల గేమ్ పాయింట్స్, గిఫ్ట్స్ గెలుచుకునే చాన్స్​కూడా ఉంది.

టార్గెట్​కి మించి ఆదాయం

ప్రతి గేమ్ జోన్ కి డైలీ టార్గెట్స్, వీకెండ్ టార్గెట్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్ వేవ్ టైమ్ లో లాక్ డౌన్ల తర్వాత కొన్ని నెలల పాటు టార్గెట్ రీచ్ కావడానికి గేమ్ జోన్ల నిర్వాహకులు నానా తంటాలు పడ్డారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో సాయంత్రం వేళల్లో, వారాంతాల్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్​తో బయటికి వెళ్తున్నారు. పిల్లలను ఆకట్టుకునే కొత్త కొత్త ఆటలు, ఎంట్రీ ఫీజులు లేకపోవడంతో గేమ్స్​అన్నీచూసి నచ్చినవి ఆడేస్తున్నారు. ఓక్కో గేమ్ చార్జ్​రూ.80 నుంచి 150, 250, 500 వరకు ఉంటుంది. వీకెండ్​లో మూడు లక్షల నుంచి ఐదు లక్షల టార్గెట్ పెట్టుకుంటే అందుకు 20 నుంచి 30 శాతం ఎక్కువే రీచ్ అవుతున్నామని గేమింగ్ జోన్ల 
నిర్వాహకులు చెప్తున్నారు. 

ఫ్రెండ్స్ అంతా కలిసి..

ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నా. సాయంత్ర ఫ్రెండ్స్​తో కలిసి దగ్గరలోని మాల్​కి వెళ్తుంటాం. అక్కడి ఇండోర్ గేమ్స్ లో చాలా వెరైటీలొచ్చాయి. మేం ఎక్కువగా డ్రాప్ అండ్ ట్విస్ట్, డిస్క్ ఓ లాంటి గేమ్స్ ఆడుతుంటాం. బౌలింగ్ అండ్ గేమింగ్ కూడా ఆడుతాం. వీటితో వర్క్ ప్రెజర్ నుంచి కొంత రిలీఫ్ ఉంటుంది.
- ప్రసాద్, ఐటీ ఎంప్లాయ్, కూకట్​పల్లి 

ఫుల్ రష్ ఉంటుంది

వీకెండ్స్ లో ఫుల్ రష్​ ఉంటోంది. ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు గేమ్ జోన్ ఓపెన్ లో ఉంటుంది. కిడ్స్, పెద్దలకు గేమ్స్ సెపరేట్​గా ఉంటాయి. విజిటర్స్ ముందు వచ్చి గేమ్స్ అన్నీ పరిశీలించిన తర్వాత నచ్చితే కార్డ్ తీసుకుని ఆడుతుంటారు. ఇందులో రివార్డ్ పాయింట్స్, గిఫ్ట్స్ వస్తాయి. 
- వివేక్, మేనేజర్, ట్రిడోమ్ గేమ్ జోన్, కొండాపూర్