ఉద్యమకారుల గుర్తింపులో జాప్యం ఉండదు.. జులై నెల చివరి వరకు సంప్రదింపులు : ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం

ఉద్యమకారుల గుర్తింపులో జాప్యం ఉండదు.. జులై  నెల చివరి వరకు సంప్రదింపులు : ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం

భీమదేవరపల్లి, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి కాలయాపన జరగదని ఎమ్మెల్సీ, ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 

గతంలో ఒక్కరి వల్లే తెలంగాణ ఏర్పడిందని ప్రజలను నమ్మించారని, పదేండ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్రం ఏర్పడిందని గుర్తించిన ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కోసం మాజీ ఎంపీ కేశవరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. 

1969 ఉద్యమం మొదలు రాష్ట్రం ఏర్పడే వరకు పోరాడిన జనసభ, ఐక్యవేదిక, ప్రజా, విద్యార్థి, రాజకీయ ఇతర సంఘాల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. క్రీయాశీలకంగా పనిచేసిన కేసులు లేకుండా ఉన్న కొంత మంది కళారులు, కవులు, జర్నలిస్టులను గుర్తించడంలో కూడా పలు సూచనలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 6న మొదలైన అభిప్రాయ సేకరణ ఈ నెల చివరి వారం వరకు పూర్తవుతందని చెప్పారు. 

మరో నాలుగు రోజుల్లో జర్నలిస్టులు, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, వైద్యులు, ఆలయ అర్చకులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరిస్తామని చెప్పారు. ఉద్యమకారుల నుంచి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో దరఖాస్తులు తీసుకోవాలనే విషయంపై ఆఫీసర్లు, ప్రభుత్వంతో మాట్లాడుతామన్నారు. సమావేశంలో జేఏసీ నియోజకవర్గ చైర్మన్ లక్ష్మారెడ్డి, డ్యాగల సారయ్య, ప్రకాశ్, యాదగిరి, స్వామి, ప్రవీణ్, వజ్రమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.