ఈవారం ఎలిమినేషన్‌ ఉండబోదని టాక్

ఈవారం ఎలిమినేషన్‌ ఉండబోదని టాక్

వారమంతా ఒకెత్తు.. వీకెండ్ ఎపిసోడ్ ఒకెత్తు. బిగ్‌బాస్ వీక్షకులంతా ఎంతో ఆసక్తి చూస్తుంటారు శనివారం ఎప్పుడొస్తుందా అని. ఆ వారంలో జరిగిన వాటికి నాగార్జున ఎలా రివ్యూ చేస్తారా అని. ఈ సీజన్‌లో మొదటి వీకెండ్ ఎపిసోడ్‌ ఊహించినట్టుగా మస్తుమస్తుగా సాగింది. అతి చేసినవాళ్లకి నవ్వుతూనే  నాగ్ మొట్టికాయలు వేశారు . థమ్సప్, థంబ్స్ డౌన్ అంటూ మెచ్చుకోవాల్సిన చోట మెచ్చుకున్నారు. నొచ్చుకున్నా పర్లేదని చెప్పాల్సిన సుద్దులన్నీ చెప్పారు. 

సుర్రూ లేదు.. సుమ్మూ లేదు

వారమంతా ఓ రేంజ్‌లో రచ్చ చేసిన గీతూకి తనదైన శైలిలో నాగార్జున చురకలంటించారు. మన హౌస్ అంటే గీతూ ఒప్పుకోదు అంటూ సెటైర్లతో మొదలుపెట్టిన నాగార్జున.. బాగా ఆడుతున్నావు అంటూనే చెప్పాల్సినవన్నీ చెప్పారు. రివ్యూలు చెప్పీ చెప్పీ మధ్యలో దూరడం అలవాటైపోయింది అంటూ గీతూతో పాటు ఆదిరెడ్డికీ సుతిమెత్తగా క్లాస్ పీకారు. విశేషమేమిటంటే.. హౌస్‌లో ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా అడ్డుపడిపోయే గీతూ.. నాగార్జున మాటలకి కూడా అడుగడుగునా అడ్డుపడిపోయింది. ఇల్లు శుభ్రంగా ఉంచాలి, సివిక్ సెన్స్ ఉండాలి అని చెప్పే నువ్వు ఎన్నిసార్లు టిష్యూ ఇష్టం వచ్చినట్టు పడేశావో చూపించనా అని నాగార్జున అడిగితే.. పడేసే ఉంటాను అంటూ తన స్టైల్లోనే రియాక్ట్ అవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. నాగ్ కూడా తగ్గలా. మనం చెప్పేది ముందు పాటించాలి అని ముఖమ్మీదే చెప్పేశారు. అనవసమైన టాపిక్స్ మాట్లాడి విషయాన్ని ఎక్కడెక్కడికో లాగొద్దు అంటూ ఇనయాకి కూడా చెప్పారు. ఆలోచించి మాట్లాడటం, ఆవేశం తగ్గించుకోవడం మంచిదని రేవంత్‌కి సజెస్ట్ చేశారు. సంచాలకురాలిగా అదరగొట్టావంటూ ఫైమాని పొగిడిన నాగ్.. తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడే పద్ధతి నచ్చలేదని, నిన్ను నువ్వు అలా డీగ్రేడ్ చేసుకోవద్దని సూచించారు. తనతో చెప్పినంత ఫైర్ ఆటలో చూపించడం లేదని.. సుర్రు సుమ్మైపోతుందని చెప్పి వెళ్లాడు కానీ సుర్రూ లేదు సుమ్మయిందీ లేదు అంటూ చలాకీ చంటిపై సెటైర్ వేశారు. అర్జున్ ఆట నచ్చిందన్నారు. బాలాదిత్య బ్యాలెన్స్డ్‌గా ఉండే తీరుకు ఇంప్రెస్ అయ్యారు. ఇలా ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళ్లారు. మొదటి వారమనో ఏమో.. ఫైర్ అవ్వకుండా కూల్‌గానే కానిచ్చేశారు.

రేవంతే టార్గెట్

హౌస్‌లోకి వెళ్లేటప్పుడు అందరికీ ఇన్‌ట్యూషన్ కార్డ్స్ ఇచ్చిన నాగార్జున.. వాటిని ఈ ఎపిసోడ్‌లో వాడారు. వాళ్ల కార్డ్ మీద ఉన్న సింబల్‌ని బట్టి ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆ కార్డ్ వాళ్లకి ఇవ్వమని చెప్పారు. నక్క, వెన్నుపోటు, ఎవరితో గొడవ వస్తుంది లాంటి నెగిటివ్ కార్డ్స్ ఎక్కువగా రేవంత్‌కే వెళ్లాయి. నామినేషన్స్‌ నీకే ఎక్కువ, ఇక్కడా నీకే ఎక్కువ అంటూ నాగ్ నవ్వారు. ఆట ఇంకా మొదలవ్వలేదు కద సర్, తర్వాత చూపిస్తాను అంటూ చేసీ చేయనట్టుగా సవాల్ చేశాడు రేవంత్. అయితే ఆదిరెడ్డి మాత్రం రేవంత్‌ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. లవ్ కార్డ్ని అతనికే ఇచ్చాడు. చాలా మంచి మనిషి అని, నోరు ఒక్కటే చెడ్డదని, అదొక్కటీ తగ్గితే తనంత బెస్ట్ ఎవరూ ఉండరని అన్నాడు. ఇప్పుడు రేవంత్‌కి తన ప్రేమ చాలా అవసరమని, తాను పక్కనే ఉంటే అతను కాస్త కూల్ అయ్యే చాన్స్ ఉంది కనుక తనకే ఇస్తున్నానని చెప్పాడు.

ఎలిమినేట్ అయ్యేదెవరు?

వీకెండ్‌లో కంటెస్టెంట్లు ఎంత ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించినా అది వారికి టఫ్‌ టైమ్ అనే చెప్పాలి. ఓవైపు నాగార్జున చేతిలో మొట్టికాయలు తినాలి. మరోవైపు ఎలిమినేషన్‌ని ఫేస్ చేయాలి. దాంతో వారికీ టెన్షన్, చూస్తున్న ప్రేక్షకులకీ టెన్షన్. మొదటివారం రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనయా, ఆరోహి, అభినయశ్రీ ఉన్నారు. ఈ ఎపిసోడ్‌లో శ్రీసత్య, చంటి సేవ్ అయ్యారు. మిగతావారు డేంజర్‌‌ జోన్‌లో ఉన్నారు. అయితే ఈవారం ఎలిమినేషన్‌ ఉండబోదని టాక్. నిజానికి ఇనయా, ఆరోహి, అభినయశ్రీ.. ఈ ముగ్గుర్లో ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోతారంటూ రెండు మూడు రోజుల నుంచీ ప్రచారం జరుగుతోంది. అది గమనించిన యాజమాన్యం ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్‌ని ఆపేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఎందుకంటే ప్రతిసారీ ఎలిమినేట్ అయ్యేవారి పేరు బైటికి వచ్చేస్తోంది. దాన్ని బ్రేక్ చేయడం కోసం ఈసారి షో నిర్వాహకులు రివర్స్ గేమ్‌ ప్లాన్ రెడీ చేసుకున్నారని అంటున్నారు. అదెంత వరకు నిజమో తెలీదు కానీ.. ఎలిమినేట్ చేయాలి అంటే కచ్చితంగా అభినయశ్రీనే చేయాలంటున్నారు అనలిస్టులు. ఎందుకంటే మిగతావారితో పోలిస్తే ఆమె కాస్త తక్కువ యాక్టివ్‌. ఎవరైనా గొడవ పడితే మధ్యలో వచ్చి ఆపే విషయంలోనే ఆమె ఎక్కువ కనబడుతుంది. మొన్న ఒక టాస్క్ లో బాగా పర్‌‌ఫార్మ్ చేసింది కానీ మిగతావారు ఇచ్చినంత ఫుటేజ్ ఇవ్వలేకపోతోంది. ప్రేక్షకులంతా ఇలా ఆలోచిస్తే కనుక ఆమెకి తక్కువ ఓట్లు పడి ఉంటాయి. లేదంటే ఇది తారుమారయ్యే అవకాశమూ ఉంది. ఏం జరుగుతుందనేది ఇవాళ్టి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.