
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ ప్రదానోత్సవం హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా ఘనంగా జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులను ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. గత ప్రభుత్వం ఈ అవార్డులను పట్టించుకోలేదు. పదేండ్ల విరామం తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందజేసింది. శనివారం (జూన్ 14) జరిగిన అవార్డుల వేడుకలో 2014 జూన్ నుంచి 2023 వరకూ ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందజేశారు. 2024 ఏడాదికి గాను అన్ని విభాగాలతో పాటు ఆరు స్పెషల్ జ్యూరీ అవార్డులను కూడా ప్రదానం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ గద్దర్ అవార్డును అందుకున్నారు. అలాగే బాలకృష్ణ, విజయ్ దేవరకొండలకు స్పెషల్ జ్యూరీ అవార్డులను సీఎం అందజేయడంతో పాటు పలు కేటగిరీస్‌లో విజేతలను ఆయన అవార్డుతో సత్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరికొన్ని అవార్డులను ప్రదానం చేయగా, ఇంకొన్ని అవార్డులను నటుడు బాలకృష్ణ, నటీమణులు జయసుధ, జయప్రద, సుహాసిని కూడా ప్రదానం చేశారు.
ఆస్కార్ అవార్డు గ్రహీతలు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అవార్డులను అందుకోవడం పట్ల విజేతలు హర్షం వ్యక్తం చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా ఆయన పేరిట అవార్డులను ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. 1996లో మా నాన్నగారి పేరిట ప్రారంభించిన ఎన్టీఆర్ అవార్డును నేను అందుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అవార్డుతో పాటు అందజేసిన నగదు పురస్కారాన్ని బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు అందజేస్తున్నాను” - బాలకృష్ణ
‘‘తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అన్నకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి థ్యాంక్స్. డైరెక్టర్ సుకుమార్ గారు లేనిదే ఇది సాధ్యం అయ్యేది కాదు. పుష్ప చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయమని చెప్పిన మాకు సపోర్ట్‌గా నిలిచిన రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ అవార్డును మా ఫ్యాన్స్‌కు అంకితం చేస్తున్నా”. - అల్లు అర్జున్
‘‘కాంతారావు గారి పేరిట ఇస్తున్న ఈ అవార్డును అందించడం ఒక ట్రిబ్యూట్. మహబూబ్ నగర్‌లో పుట్టిన పిల్లాడిగా ఈ అవార్డును అందుకోవడంతో నాపై బాధ్యత పెరిగింది. ఇంకా ఎంతో చేయాలనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దిల్ రాజు గార్లకు ధన్యవాదాలు’’.
- విజయ్ దేవరకొండ
‘‘తెలంగాణ సీఎం, డిప్యూటి సీఎం నుంచి అందుకుంటున్న ఈ పురస్కారాన్ని బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తున్నాను’’ - కీరవాణి
‘‘ఎక్కడెక్కడ ఏమేమి సాధించినా మన గడ్డమీద, మన నేలమీద, మనవాళ్ల మధ్య ఇలాంటి గౌరవం పొందడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం’’. - చంద్రబోస్
2024 గద్దర్ అవార్డ్ విజేతలు
బెస్ట్ ఫిల్మ్: కల్కి 2898 ఏడీ
బెస్ట్ సెకండ్ ఫిల్మ్: పొట్టేల్
బెస్ట్ థర్డ్ ఫిల్మ్: లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్(పుష్ప 2)
ఉత్తమ నటి: నివేదా థామస్ (35)
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్(కల్కి)
నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: కమిటీ కుర్రోళ్ళు
బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్:
35 ఇది చిన్న కథ కాదు
ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ: రజాకార్
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్:
యదు వంశీ(కమిటీ కుర్రోళ్ళు)
బెస్ట్ హోల్‌సమ్ ఎంటర్‌టైనర్: ఆయ్
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్:
ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్:
భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్:
సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన -
నిజమే చెబుతున్న సాంగ్)
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్:
శ్రేయ ఘోషల్ (పుష్ప 2 - సూసేకీ సాంగ్)
బెస్ట్ కమెడియన్: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: మాస్టర్ అరుణ్ దేవ్
(35 ఇది చిన్నకథ కాదు)
మాస్టర్ హారిక (మెర్సీ కిల్లింగ్)
బెస్ట్ స్టోరీ రైటర్: శివ పాలడుగు
(మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ లిరిసిస్ట్: చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్:
విశ్వనాధ్ రెడ్డి (గామి)
బెస్ట్ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్:
అరవింద్ మీనన్ (గామి)
బెస్ట్ కొరియోగ్రాఫర్: గణేష్ మాస్టర్ - దేవర - ఆయుధ పూజ సాంగ్
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్: అధినితిన్
జిహాని చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్:
చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శీను (రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
బెస్ట్ బుక్ ఆన్ సినిమా: మన సినిమా
ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు:
నందమూరి బాలకృష్ణ
కాంతారావు ఫిల్మ్ అవార్డు:
విజయ్ దేవరకొండ
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు: మణిరత్నం
బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్
నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్ అవార్డు:
అట్లూరి పూర్ణచంద్రరావు
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్