మీకు 18 ఏండ్లు నిండితే ఈ టెస్టులు తప్పనిసరి.. పెరుగుతున్న గుండెపోట్లతో యువతకు డాక్టర్ల సూచన

మీకు 18 ఏండ్లు నిండితే ఈ టెస్టులు తప్పనిసరి.. పెరుగుతున్న గుండెపోట్లతో యువతకు డాక్టర్ల సూచన
  • యువ గుండెకు ఏమైంది?
  • ఆటలాడుతూ, జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ  కుప్పకూలుతున్న యూత్.. 
  • యుక్త వయసులోనే పెరుగుతున్న గుండెపోట్లు
  • ఇటీవల పదుల సంఖ్యలో మరణాలు
  • మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణమంటున్న డాక్టర్లు
  • 18 ఏండ్లు దాటితే టెస్టులు తప్పనిసరని సూచన


హైదరాబాద్, వెలుగు: గుండెపోటు వ‌‌‌‌య‌‌‌‌సు త‌‌‌‌గ్గించుకున్నది. ఒక‌‌‌‌ప్పుడు వృద్ధుల‌‌‌‌కు మాత్రమే వస్తుందనుకునే హార్ట్​ఎటాక్..​ఇప్పుడు 30 ఏండ్లలోపు  యువతీ, యువకులనూ బలితీసుకుంటున్నది. ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నట్టుండి ప్రాణాలను హరిస్తున్నది. గత కొన్నాళ్లుగా మన రాష్ట్రంలోనే పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 

ఆటలాడుతూ, జిమ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. చుట్టుపక్కలవారు గమనించి హాస్పిటల్స్‌‌‌‌కు తరలించేలోగా చనిపోతున్నారు. జన్యుపరమైన కారణాలకు తోడు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తీవ్ర మానసిక ఒత్తిళ్లే యువతీయువకుల్లో గుండెపోటుకు కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు.

 స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకం కూడా గుండె సమస్యలకు దారి తీస్తున్నదని అంటున్నారు. లక్షణాల్లేవని ఏమరపాటుగా ఉండవద్దని, 18 ఏండ్లు దాటాక ప్రతి ఒక్కరూ గుండె సంబంధ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. హార్ట్​ఎటాక్​, హార్ట్ ​ఫెయిల్యూర్​​ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మృతుల్లో సగం మంది 40 ఏండ్లలోపువారే 

దేశంలో గుండెపోటు కారణంగా గంటకు 250 మంది చొప్పున.. ప్రతిరోజూ సగటున 6 వేల మంది చనిపోతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ గణాంకాలు చెప్తున్నాయి. పదేండ్ల క్రితం వరకు 50, 60 ఏండ్లు దాటినవారిలోనే గుండెపోటు కనిపించేది. కానీ కొన్నాళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు  వచ్చింది.  2020–2023 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా గుండె పోటుతో చనిపోయిన వారి వివరాలను విశ్లేషిస్తే.. మృతుల్లో 50 శాతం మంది 40 ఏండ్ల లోపువారే ఉన్నట్టు తేలడం షాక్‌‌‌‌కు గురిచేసింది. మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని వైద్య, ఆరోగ్యశాఖ చెప్తున్నది. తెలంగాణలో గుండె వ్యాధులు పెరుగుతున్నాయని హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీలు లెక్కతేల్చాయి. 2019–20లో మొత్తం క్లెయిమ్స్‌‌‌‌లో గుండె వ్యాధుల వాటా 12 శాతం ఉండగా, 2023–24 వరకు ఏకంగా 20 శాతానికి పెరగడం కలవరపెడుతున్నది.  

గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న జంక్​ ఫుడ్​

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు యువతలో గుండెపోటు కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమ ని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ విని యోగం గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నదని అంటున్నారు. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కూల్ డ్రింక్స్‌‌‌‌లాంటి జంక్ ఫుడ్‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌ఫ్యాట్స్,  సాచురేటెడ్ ఫ్యాట్స్, అధిక ఉప్పు, చక్కెర ఉంటున్నాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తున్నాయి. 

ఇది రక్తనాళాలను ఇరుకుగా మార్చి, గుండెకు రక్త సరఫరాను తగ్గిస్తూ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నది. అలాగే, ధూమపానం, మద్యపానం, పొల్యూషన్, నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణంగా యువతలో తొందరగా బీపీ, షుగర్, ఒబెసిటీ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బీపీ, ఒబెసిటీ వంటి సమస్యలను యువత తేలికగా తీసుకోవడం వల్ల  గుండెపోటు ముప్పు పెరుగుతున్నదని డాక్టర్లు చెబుతున్నారు. 

జన్యుపరమైన కారణాలు..

జన్యుపరమైన కారణాలు కూడా యువతలో గుండెపోటు మరణాలకు దారితీస్తున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు, హార్ట్​ఫెయిల్యూర్​లాంటి ఇష్యూస్​ ఉంటే, పిల్లలకు కూడా వచ్చే  ప్రమాదం ఉంటుందని, దీనిని ఫామిలియల్ హైపర్‌‌‌‌ కొలెస్టెరోలీమియా అంటారని చెప్తున్నారు. ఈ జన్యు సంబంధ వ్యాధి వల్ల శరీరం.. చెడు కొలెస్ట్రాల్‌‌‌‌ను తొలగించలేకపోతుంది. ఇది కుటుంబంలో ఒక‌‌‌‌ తరం నుంచి మ‌‌‌‌రో తరానికి సంక్రమిస్తుంది. 

తండ్రికి 55 ఏండ్లలోపు లేదా తల్లికి 65 ఏండ్లలోపు గుండెపోటు వచ్చి ఉంటే, పిల్లల్లో ప్రమాదం 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫామిలియల్ హైపర్‌‌‌‌కొలెస్టెరోలీమియా ఉన్నవారిలో ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి, చిన్న వయసులోనే గుండెపోటుకు దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు. యుక్తవయస్సులో ఎలాంటి లక్షణాలు కనిపించవని, కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు చిన్నతనంనుంచే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ టెస్టులు చేయించుకోవాలి.. 

గుండె సమస్యలు ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి 18 ఏండ్లు నిండిన వారు పలు టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గుండె నిర్మాణం, కవాటాల పనితీరును తెలుసుకోవడానికి 2డీ ఎకో కార్డియోగ్రామ్, హార్ట్ బీట్ ను తెలుసుకోవడానికి ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ), రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి కొలవడానికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, గుండె పనితీరును తెలుసుకోవడానికి  కార్డియాక్ బయోమార్కర్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు. వీటితోపాటు తరుచూ బీపీ చెక్​చేసుకోవాలని, అలాగే ఊపిరితిత్తుల సమస్యలను గుర్తించడానికి చెస్ట్ ఎక్స్‌‌‌‌రేలాంటి పరీక్షలు అవసరమని సూచిస్తున్నారు. 

ఈ లక్షణాలుంటే జాగ్రత్తలు తప్పనిసరి..

ఛాతిలో నొప్పి, బిగుతు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా చెమటలు పట్టడం, తల తిరగడం, మైకం, చేతులు, దవడ, వెనుక భాగంలో నొప్పి.. ఈ లక్షణాలు ఉంటే గుండె సంబంధ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలని, ఫాస్ట్‌‌‌‌ఫుడ్‌‌‌‌ తగ్గించి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినడం మంచిదని చెబుతున్నారు.  

పొగాకు, మద్యానికి దూరంగా ఉండడం, యోగా, ధ్యానం, తగిన నిద్రతో ఒత్తిడి తగ్గించుకోవడం చేయాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే రెగ్యులర్‌‌‌‌ హెల్త్‌‌‌‌ చెకప్‌‌‌‌లు చేయించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా సీపీఆర్ నేర్చుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.  జిమ్ చేసేవాళ్లు ఒకేసారి అధిక బరువులు ఎత్తకూడదని,  ప్రోటీన్ పౌడర్లు, స్టెరాయిడ్స్ కూడా గుండెపోటుకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు.

లక్షణాలు లేవని లైట్ తీసుకోవద్దు 

మా వద్దకు చాలా మంది యూత్ వస్తుంటారు. బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌లాంటి సమస్యలను వారు చాలా తేలికగా తీసుకుంటారు. మెడికేషన్ ఫాలో అవరు. దానివల్ల కొన్నిరోజులకు ఇర్రివర్సబుల్ డ్యామేజ్ జరుగుతుంది. అప్పుడు కిడ్నీలు, గుండె నాళాలపై ప్రభావం పడ్తుంది. లక్షణాలు కనిపించగానే అప్పుడు సీరియస్​గా తీసుకుంటారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రైమరీ స్టేజ్‌‌‌‌లో గుర్తించి సరైన మెడికేషన్ ఫాలో అయితే గుండెపోటు ముప్పును సాధ్యమైనంతవరకు తగ్గించవచ్చు. 
- డాక్టర్ నరేశ్ మోనిగారి, కార్డియాలజిస్ట్ , రెనోవా సెంచరీ హాస్పిటల్స్ (హైదరాబాద్) 

టీ తాగి లేస్తూ..

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన తంబళ్ల శివ (29)  ఉదయం ఇంట్లో టీ తాగిన అనంతరం ఫ్రెండ్స్ పిలవడంతో బయటకి వెళ్లేందుకు లేచాడు. రెండు అడుగులు వేసి పక్కనే ఉన్న గోడను పట్టుకుని అలాగే కుప్పకూలిపో యాడు. శివ తమ్ముడు హుటాహుటిన కల్వకుర్తిలో ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌కు తీసుకువెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ అప్పటికే శివ చనిపోయినట్టు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసి.. జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటున్న శివ హఠాత్తుగా గుండెపోటుతో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. అతడికి గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తల్లిదండ్రులు తెలిపారు.

వాష్‌‌‌‌రూమ్​కి వెళ్లివస్తూ..

సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన బైండ్ల నరేందర్ (28) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అతడికి షామీర్‌‌‌‌‌‌‌‌పేట్ మండలం జగన్‌‌‌‌గూడ గ్రామానికి చెందిన శివానితో రెండేండ్ల క్రితం పెండ్లయింది. ఈ దంపతులకు 8 నెలల కుమారుడు అయాన్ష్ ఉన్నాడు. జూన్​16న ఉదయం వాష్‌‌‌‌రూమ్‌‌‌‌కి వెళ్లి తిరిగి ఇంట్లోకి వస్తూ ఛాతిలో నొప్పి వస్తుందంటూ కింద పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తుండగానే మృతి చెందాడు.

షటిల్ ఆడుతూ..

ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేశ్​(25) షటిల్ ఆడు తూ ఒక్కసారిగా కుప్పకూలి చని పోయాడు. తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడైన రాకేశ్.. డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్ కార్ల షోరూంలో చేరాడు. ఉప్పల్ భగాయత్‌‌‌‌లోని ఎలైట్ గేమర్ గ్యారేజ్‌‌‌‌లోని విక్రాంతి బ్యాడ్మింటన్ అకాడమీలో జులై 27న రాత్రి స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక స్నేహితులంతా వచ్చి లేపే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే రాకేశ్​ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు.  

పదేండ్ల చిన్నారి..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రొటీగూడ గ్రామానికి చెందిన దిగుట్ల సమన్విత (10) అనే చిన్నారి నిరుడు నవంబర్‌‌‌‌‌‌‌‌లో గుండెపోటుతో మృతి చెందింది. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న సమన్విత.. స్కూలుకు వెళ్లే ముందు ఉదయం ఛాతిలో నొప్పి వస్తుందని తల్లికి చెప్పి స్పృహ కోల్పోయింది.  కుటుంబ సభ్యులు ఆమెను మండల కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.  

పెళ్లయిన 14 రోజులకే.. 

మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌‌‌‌పల్లిలో పెండ్లైన 14 రోజులకే గుండెపోటుతో వరుడు చనిపోయాడు. గ్రామానికి చెందిన అక్కమొల్ల సాయికిరణ్ అలియాస్ చింటు (22)కు మే 21న అదే గ్రామానికి చెందిన అనూషతో వివాహం జరిగింది. సాయికిరణ్ గత జూన్ 3న రాత్రి గ్రామంలో ఓ ఇంట్లో పెండ్లికి బ్యాండ్ కొట్టేందుకు వెళ్లి, అర్ధరాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లారి  లేచి బాత్రూమ్‌‌‌‌కు వెళ్లి  గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయాడు.

సుతారి పనిచేస్తూ.. 

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం లోని గున్నెపల్లి  గ్రామా నికి చెందిన అల్లి సోమన్న(26) కూలి నాలీ  చేస్తూ కుటుంబా న్ని పోషించేవాడు.  జూన్​ 30న సుతారి  పనికి వెళ్లాడు.  పనిచేస్తున్న క్రమంలో గుండె పోటు రావడంతో ఛాతి పట్టుకొని కూర్చున్నాడు. అక్కడికక్కడే చనిపోయాడు.  

ఇంటర్ విద్యార్థిని..

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు  సపావత్ తండాకు చెందిన సపావత్ రోజా (17) సీరోలు ఏకలవ్య పాఠశాలలో ఇంటర్​ ఫస్టియర్ చదివేది. ఏప్రిల్ 2న రాత్రి జరిగిన వీడ్కోలు సమావేశంలో డ్యాన్స్ చేస్తుండగా, ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన ఉపాధ్యాయులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రోజా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు చెప్పారు.

మాల తీయగానే ప్రాణాలు విడిచిండు.. 

21 రోజులపాటు హనుమాన్ మాల ధరించి నిష్టగా ఉన్న యువకుడు మాల తీసిన మరుక్షణమే  గుండెపోటుతో చనిపోయాడు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్​కు చెందిన నీరటి శిషేశ్వర్‌‌‌‌‌‌‌‌(32) తల్లిదండ్రులతో కలిసి హుజూరాబాద్‌‌‌‌ టౌన్​లోని ఇందిరానగర్‌‌‌‌‌‌‌‌లో ఉండేవాడు. గత మే నెలలో శిషేశ్వర్‌‌‌‌‌‌‌‌ 21 రోజులపాటు  హనుమాన్ మాల ధరించాడు. అదే నెల 24న మాల తీసిన రోజే ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడు. తల్లిదండ్రులు టౌన్​లోని ఓ ప్రైవేట్​ డాక్టర్​కు చూపించుకొని ఇంటికి వచ్చారు. 25న ఉదయం బాత్రూంలో స్నానం చేసి వస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. 

రాఖీ కట్టించుకొని..  నిద్రలోనే యువకుడు మృతి

గొల్లపల్లి, వెలుగు: అక్కతో రాఖీ కట్టించుకున్న ఓ యువకుడు నిద్రలోనే మృతిచెందాడు. ఈ ఘటన పండుగపూట జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలో విషాదం నింపింది. గరిగంటి తిరుపతి, సత్తవ్వ దంపతుల రెండో కుమారుడు అనిల్ (24)  హైదరాబాద్‌‌‌‌లో పీజీ చదువుతున్నాడు. రాఖీ పండుగకు 4 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. 

శనివారం తన అక్క, బంధువులతో రాఖీలు కట్టించుకున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయాడు. సాయంత్రమైనా లేవలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెళ్లి పిలవగా స్పందించలేదు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనిల్‌‌‌‌కు నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చినట్లు భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.