సుక్క లేక ఆగమవుతున్నమందుబాబులు

సుక్క లేక ఆగమవుతున్నమందుబాబులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు    హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఇందిరానగర్‌‌‌‌‌‌‌‌లో ఉండే ఓ వ్యక్తికి రోజూ లిక్కర్​ తాగే అలవాటు ఉంది. నాలుగు రోజులుగా ఎక్కడా లిక్కర్​ దొరకలేదు. దీంతో మతిస్థిమితం కోల్పోయిన అతడు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

  • బేగంపేటకు చెందిన మరో వ్యక్తి టైల్స్‌‌‌‌‌‌‌‌ కూలీగా పనిచేస్తున్నాడు. లిక్కర్​కు బాగా అలవాటు పడిన అతడు.. అది దొరక్క పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు. చివరకు పంజాగుట్ట ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడి ఉస్మానియాలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నాడు.
  • నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కల్లు దొరక్క చాలా మంది పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తున్నారు. ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి చనిపోయాడు.
  • సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కల్లుకు బానిసయ్యాడు. కల్లుకు కోసం ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండంతో భార్య ఇంట్లో కట్టేసింది. తప్పించుకుని పారిపోతుండగా ఓ వెహికల్​ ఢీకొని స్పాట్​లోనే చనిపోయాడు.
  • లాక్​డౌన్​ కారణంగా వైన్​ షాపులు, కల్లు కాంపౌండ్​లు మూతపడటంతో వాటికి బానిసలుగా మారిన చాలా మంది పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు. కొందరు వింత వింతగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఫిట్స్, కోమా వంటి వాటికి గురవుతున్నారు. ఇంకొందరైతే కల్లు, లిక్కర్​ దొరక్క ఆగమాగమై ఏకంగా సూసైడ్​ చేసుకుంటున్నారు. దీని ప్రభావం ఎక్కువగా కల్తీ కల్లు, నకిలీ మద్యానికి అలవాటుపడిన వారిపై ఎక్కువగా ఉంది.

కరోనాతో బంద్‌‌‌‌‌‌‌‌..

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ ప్రకటించడంతో అత్యవసర సేవలు మినహా అన్నింటినీ మూసేశారు. వైన్​ షాపులు, కల్లు కాంపౌండ్​లు, బార్లు కూడా మూతపడ్డాయి. దీంతో రోజూ లిక్కర్​ తాగే అలవాటు ఉన్న వారు, కల్లు తాగే వారికి తిప్పలు మొదలయ్యాయి. కల్లు కావాలంటూ కొందరు కల్లు బట్టీల వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీన్ని భరించలేక కొన్ని చోట్ల స్థానిక సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు కల్లు దుకాణాలను తెరిపిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల కల్తీ కల్లు దొరక్కపోవడం కొందరి ప్రాణాల మీదకు వస్తోంది. నిద్ర కూడా కరువై.. అనారోగ్యానికి గురవుతున్నారు. కల్తీ కల్లు లేక శరీరం వణకడం, నిలబడ్డ చోటే కూలిపోవడం, ఫిట్స్ రావడం, పిచ్చిపిచ్చిగా, వింతగా ప్రవర్తించడం వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. ఇంకొందరు కల్లు బాధితులు వింతవింతగా ప్రవర్తిస్తూ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌కు క్యూ కడుతున్నారు. ఇలాంటి కేసులు నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, కామారెడ్డి, మెదక్‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లాంటి చోట్ల ఎక్కువ కనిపిస్తున్నాయి.

‘కల్తీ’కి బానిస కావడంతోనే..

సాధారణంగా తాటి, ఈత చెట్ల నుంచి తీసే కల్లుకు కాంపౌండ్లలో అమ్మే సీసా కల్లుకు చాలా తేడా ఉంటుంది. కల్లు దుకాణాల్లో అచ్చంగా చెట్టు నుంచి తెచ్చిన కల్లు అమ్మరు. కల్లులో డైజోఫామ్‌‌‌‌‌‌‌‌, క్లోరోఫామ్‌‌‌‌‌‌‌‌, ఆల్ఫడాజోలం లాంటి కెమికల్స్‌‌‌‌‌‌‌‌ను కలుపుతారు. ఇలా రసాయనాలు కలిపే కల్తీ కల్లునే ఎక్కువగా అమ్ముతుంటారు. ఈ కల్తీ కల్లుకు అలవాటుపడ్డారంటే దానికి బానిసలు అయిపోతారు. అది తాగనిదే రోజు గడవదు. గతంలో కూడా కల్లు దుకాణాలు బంద్ చేసినప్పుడు వీరంతా మానసిక రోగుల్లా ప్రవర్తించేవారు. శరీరం వణకడం, నిలబడ్డ చోటే కూలిపోవడం, ఫిట్స్‌‌‌‌‌‌‌‌రావడం వంటివి జరిగాయి. ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ చేయించినా తిరిగొచ్చాక ఆ కల్తీ కల్లే కావాలని పిచ్చిపిచ్చిగా చేసేవారు.

లిక్కర్​ లేక సూసైడ్స్‌‌‌‌‌‌‌‌

ఇక రోజూ లిక్కర్​ తాగే మందుబాబుల పరిస్థితి మరోలా ఉంది. కొంత మంది రోజూ పెగ్గు వేస్తే కాని స్థిమితంగా ఉండలేరు. నాలుక పిడశ కట్టుకుపోవడం, తల దిమ్మదిమ్మ కొట్టుకోవడం, అశాంతి, ఆందోళనకు గురవుతారు. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో వైన్​ షాపులు, బార్లు బంద్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ నెల 22 నుంచి లిక్కర్​ బంద్‌‌‌‌‌‌‌‌ కాగా, ఒకట్రెండు రోజులు ఉండగలిగారు. ఇప్పటికే ఐదు రోజులు గడవడంతో మందుబాబులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రెస్​తో ఓ వ్యక్తి ఏకంగా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సాధారణంగా డీ అడిక్షన్ సెంటర్లలో కల్లు, మందు ఒక్కసారిగా బంద్‌‌‌‌‌‌‌‌ చేయించరు. మెల్లమెల్లగా కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ తాగుడు మాన్పిస్తారు. ప్రస్తుతం ఒక్కసారిగా మద్యం, కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ కల్లు లేకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.

మందు దొరకట్లేదని గొంతు కోసుకుండు

మందుకు బానిసైన అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఆదివారం కత్తితో గొంతు కోసుకున్నాడు. అశ్వారావుపేటలోని మోడల్ కాలనీకి చెందిన రాంబాబు హైదరాబాద్​లో కార్మికుడు. లాక్​డౌన్​ కారణంగా వారం క్రితం సొంతూరు వచ్చాడు. రోజూ మందు తాగే అలవాటున్న రాంబాబుకు స్థానికంగా మందు దొరక్కపోవడంతో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కత్తితో గొంతు కోసుకున్నాడు. గమనించిన భార్య, చుట్టుపక్కల వాళ్లు హాస్పిటల్​కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు.

కల్లు లేక పిచ్చిపిచ్చిగా..

లాక్ డౌన్​తో  వైన్ షాప్ లు, కల్లు దుకాణాలు మూతపడ్డాయి. కల్లు తాగేవారు అడ్జస్ట్ కాలేక వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. ఆదివారం సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిర్గాపూర్​కు చెందిన హనుమంతు  బట్టలు ఇప్పుకొని 65వ జాతీయ రహదారిపై తిరుగుతూ పిచ్చిగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న అతడి భార్య వచ్చి బలవంతంగా ఇంటికి తీసుకుపోయింది. కల్లుకు బానిసై  4 రోజులుగా రోడ్ల మీద పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడని  తెలిపింది.

 

టీమిండియా ఆసీస్‌ టూర్‌ కు కరోనా దెబ్బ !