వీసీల అక్రమ నియామకాలపై కోర్టుల మొట్టికాయలు! : డా.మామిడాల ఇస్తారి

వీసీల అక్రమ నియామకాలపై కోర్టుల మొట్టికాయలు! : డా.మామిడాల ఇస్తారి

యూ జీసీ- నిబంధనలకు విరుద్ధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకు వీసీల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టిందని, వాటిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ నిరుడు జాతీయవాద అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. ఆయన వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు ఏడాదిపాటు వాదనలు నడవగా, తాజాగా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ రాజర్షి భరద్వాజలతో కూడిన బెంచ్ ​కీలక తీర్పు ప్రకటించింది. కనీస అర్హతలు లేకుండా, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన రాష్ట్రంలోని 29 మంది వీసీలను తొలగిస్తూ కోర్టు 46 పేజీల తీర్పును వెలువరించింది. గుజరాత్ లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీ వీసీ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు, దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా ఉటంకిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తెలంగాణలోని పది యూనివర్సిటీల వీసీల నియామకాలు కూడా ప్రశ్నార్థకంగా మారనున్నాయని రాష్ట్ర వర్సిటీ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. పదేండ్లు ప్రొఫెసర్​గా అనుభవం లేని సర్దార్ పటేల్ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు తీర్పు ఒక పక్క ఉండగా, మరో పక్క తెలంగాణ రాష్ట్రంలోని రెండో అతిపెద్ద యూనివర్సిటీకి కూడా అలాంటి వీసీనే నియమించారని, ఆ వీసీని తొలగించాలని హైకోర్టులో వేసిన పిటీషన్​కు సంబంధించిన తీర్పు ఇంకా పెండింగ్​లో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ హైకోర్టులో కేసులు

పశ్చిమ బెంగాల్ తరహాలోనే తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల్లో కూడా యూజీసీ రూల్స్​కు విరుద్ధంగా వీసీల నియామకాలు జరిగాయని, అలాంటి వారిని తొలగించాలని నిరుడు హైకోర్టులో ఏడుగురు పిటీషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆయా వర్సిటీ వీసీల నియామకాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయనే చర్చ మొదలైంది. ప్రొఫెసర్​గా పదేండ్ల అనుభవం లేదని రాష్ట్రంలోని రెండో అతిపెద్ద వర్సిటీ వీసీ నియామకం చెల్లదని నిజామాబాద్​కు చెందిన విశ్రాంత ప్రిన్సిపాల్ డా.విద్యాసాగర్ రెడ్డి అప్పట్లో కేసు దాఖలు చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయి, జడ్జిమెంట్​ను వెలువరించే క్రమంలో ఈ కేసు మరొక న్యాయమూర్తికి బదిలీ అయింది. ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ డి.మనోహర్ రావు ఇదే సంవత్సరం మార్చి నెలలో ఏకంగా 40 మందిని ప్రతివాదులుగా చేస్తూ రాష్ట్రంలోని దాదాపు అన్ని వర్సిటీల వీసీల నియామకంపై హైకోర్టులో కేసు దాఖలు చేశారు. జవహార్​లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.ప్రదీప్ కుమార్, ఆ యూనివర్సిటీ వీసీ నియామకాన్ని తప్పుపడుతూ గత ఏడాది జూన్ నెలలో హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఓయూ ప్రొఫెసర్ డా. కరుణాకర్ రెడ్డి కూడా మహాత్మా గాంధీ వర్సిటీ వీసీగా నియామకం అయిన ప్రొ. సి.ఎచ్.గోపాల్ రెడ్డి రిక్రూట్​మెంట్​పై ఇదే ఏడాది జనవరిలో కేసు దాఖలు చేశారు. ఇలా రాష్ట్రంలో పలువురు వీసీల నియామకాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్లు ఈ నెల 21న విచారణకు రానున్నాయి. పశ్చిమ బెంగాల్ హైకోర్టు తీర్పు ఇటీవలే వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్సిటీల వీసీల నియామకంపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

సెర్చ్​ కమిటీ లేకుండానే నియామకాలు?

పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వీసీలకు ఉండాల్సిన కనీస అర్హతలు చూడకుండానే కొన్ని వర్సిటీలకు వీసీలను నియమించింది. ప్రొఫెసర్​గా పదేండ్ల అనుభవం లేనివారిని నియమించడం, వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీ నియామకం సరిగా జరగకపోవడం, కొన్ని వర్సిటీల వీసీల నియామకంలో సెర్చ్ కమిటీ ప్రాతినిధ్యమే లేకపోవడం అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందని వర్సిటీ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతుల నియామకాలు అక్కడి గవర్నర్ అనుమతి లేకుండానే జరపడం చూస్తుంటే ప్రభుత్వ తప్పిదం స్పష్టంగా కనబడుతుంది. యూజీసీ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మరియు యూజీసీలతో నామినేట్ చేయబడిన ముగ్గురు సభ్యులు కలిగిన సెర్చి కమిటీ ద్వారా విశ్వ విద్యాలయాలకు ఉపకులపతుల నియామకం జరగాల్సి వుండగా, పశ్చిమ బెంగాల్​లో యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తూ యూజీసీ నామినేట్ చేయబడిన మెంబర్ లేకుండానే సెర్చ్​కమిటీని నియమించి మొత్తం 29 విశ్వ విద్యాలయాలకు అర్హతలు లేని వారిని ఉపకులపతులుగా నియమించడం విద్యా వ్యవస్థను అవమానపరచడమే అని పలువురు భావిస్తున్నారు. దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అవసరం ఉన్న వాళ్లను వీసీలుగా నిబంధనలకు భిన్నంగా నియమించడం, అక్కడ చాన్స్​లర్​గా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్​లను పట్టించుకోకపోవడం వివాదాలకు కారణం అవుతున్నది. నిబంధనల ప్రకారం వీసీల నియామకాలకు చాన్స్​లర్​గా వ్యవహరించే గవర్నర్ అనుమతి తప్పనిసరి. కలకత్తా యూనివర్సిటీ  వీసీని కూడా అక్కడి గవర్నర్ అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నియమించగా, తాజా తీర్పులో కోర్టు ఆ నియామకాన్ని తప్పుబట్టింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కకపోయే సరికి రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్సిటీ వీసీని తొలగించక తప్పలేదు.

నిజాలు నిగ్గు తేల్చాలి

వర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వీసీల నియామకం పట్ల రాజకీయ బలాన్ని ప్రయోగించిందని, అందుకు ఈ కేసులే ఉదాహరణలని మేధావివర్గం అభిప్రాయం. రాష్ట్రంలోని దాదాపు అన్ని వర్సిటీలను సమస్యల నిలయాలుగా మారుస్తున్న వీసీల పాలన ఎప్పుడు మారుతుందా? అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన విద్యార్థులపై పోలీసు కేసులు పెడుతూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వర్సిటీల్లో అక్రమ నియామకాలు కొనసాగుతున్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల పైరవీలతో వర్సిటీల్లో సాగుతున్న అక్రమ నియామకాల వల్ల తాము నష్టపోతున్నామని విద్యార్థులు అంటున్నారు. ముఖ్యమైన విభాగాల్లో కూడా పైరవీలతో నియామకాలు జరపడం వల్ల సంస్థాగతంగానూ నష్టం జరుగుతున్నది. గతంలో కాకతీయవర్సిటీతో పాటు కొన్ని వర్సిటీల్లో నకిలీ సర్టిఫికెట్ ల కుంభకోణం చవిచూసిన విషయం తెలిసిందే. వర్సిటీల్లో పాలన సజావుగా జరగాలంటే రాజకీయ జోక్యం లేకుండా వీసీల నియామకాలు జరగాలని, వీసీల అక్రమ నియామకాలపై నిజాలు నిగ్గు తేల్చి యూనివర్సిటీలను కాపాడాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నాయి.

- డా.మామిడాల ఇస్తారి, ప్రధాన కార్యదర్శి, కేయూ టీచర్స్ అసోసియేషన్