
- అబద్దాల్లో రేవంత్‌రెడ్డికి ఆస్కార్ ఇవ్వొచ్చు
- మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
మెదక్, వెలుగు : అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట తప్పడం, అబద్ధాలు చెప్పడమే ఆయన నైజమని విమర్శించారు. ఆదివారం మెదక్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ మెదక్ జిల్లాను అభివృద్ధి చేయలేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు జిల్లాలు, మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీ, రైల్వే లైన్‌కు భూ సేకరణకు వంద కోట్లు, ఘనపూర్ ఆనకట్ట అభివృద్ధి, కాల్వల లైనింగ్ పనులన్నీ బీఆర్‌ఎస్ చేసినవేనని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వమే మెదక్ జిల్లాను మోసం చేసిందన్నారు. ఏడుపాయల అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేస్తే ఆ నిధులను కాంగ్రెస్ రద్దు చేసిందని, వారికి అమ్మవారి ఉసురు తగులుతుందన్నారు. ఇక్రిశాట్, బీహెచ్‌ఈఎల్‌ను ఇందిరా గాంధీ ఇచ్చిందని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే కేసులు పెడ్తా, ఉర్కిచ్చి కొడ్తా, బొంద పెడ్తా అని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, ఆటో డ్రైవర్లను పరామర్శించేందుకు సీఎంకు, మంత్రులకు టైం దొరకడం లేదా అని ప్రశ్నించారు. మెదక్‌లో 20 ఏండ్ల నుంచి బీఆర్‌ఎస్సే గెలుస్తోందని, ఇప్పుడు కూడా విజయం మాదేనని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి ఉన్నారు.