బడా నాయకులకు తొత్తులుగా మారి "ధరణి"ని ప్రారంభించిన్రు

బడా నాయకులకు తొత్తులుగా మారి "ధరణి"ని ప్రారంభించిన్రు

గత మూడు రోజులుగా ధరణి పోర్టల్ తో రైతులు పడుతున్న గోసపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కామారెడ్డి బీజేపీ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్యేఈటల రాజేందర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశాడు. ధరణిలో రైతులు పడుతున్న సమస్యలపై కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న వెంకట రమణారెడ్డి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ని సముదాయించి నిరాహార దీక్షను విరమింపజేశారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన సాగుతుందన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్... కేసీఆర్ చెప్పిందే వేదంలా తెలంగాణ రాష్ట్రం నడుస్తుందన్నారు. బడా నాయకులకు తొత్తులుగా మారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ని ప్రారంభించాడని ఆరోపించారు. 

ధరణితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈటల చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని... అధికారంలోకి రాగానే రైతుల సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ కేవలం కమిషన్ల కోసమే... తొత్తులుగా మారి రైతులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష పూర్తిగా న్యాయబద్ధమైందన్న ఆయన.. అతనికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ధరణి సమస్య కేవలం కామారెడ్డి జిల్లా సమస్యనే కాదని... రాష్ట్రంలో ఉన్న రైతులందరి సమస్య అని తేల్చి చెప్పారు. కావున రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు.