లవ్ ఇన్ క్వారంటైన్ : పెళ్లితో ఒక్కటైన జంట

లవ్ ఇన్ క్వారంటైన్ : పెళ్లితో ఒక్కటైన జంట

కరోనా వ్యాప్తితో చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు … ఎలా కరోనా సోకుతుందో తెలియక భయాందోళనకు గురువుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ జంట మాత్రం ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు కరోనా కాటుకు బలవుతుంటే… వీరిద్దరు మాత్రం జీవిత భాగస్వాములయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన యువకుడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతికి కరోనా సోకింది. దీంతో వీరిద్దరూ గుంటూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో వీరిద్దరి బెడ్లు పక్కపక్కనే ఉన్నాయి. దీంతో…మొదట ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి. ట్రీట్ మెంట్ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరికీ నెగెటివ్ రావడంతో… ఆస్పత్రి నుంచి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

డిశ్చార్జ్ అయిన తర్వాత తమ ప్రేమ గురించి వారిద్దరూ వారి వారి తల్లిదండ్రులకు చెప్పారు. అబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అమ్మాయి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. అంతేకాదు ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో… ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్లికి గ్రీన్ సిగ్నలిచ్చారు. దీంతో వారిద్దరూ పెద్దల సమక్షంలో పొన్నూరులోని ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి లవ్ ఇన్ క్వారంటైన్ గా ప్రారంభమైన వారి ప్రేమ పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు.