ఫోన్ ట్యాపింగ్ లో డీజీపీనీ వదల్లేదు!

ఫోన్ ట్యాపింగ్ లో డీజీపీనీ వదల్లేదు!
  •  బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్
  • కీలక పోస్టుల్లోని ఐఏఎస్​లు, ఐపీఎస్​లపై ఎస్ఐబీ నిఘా
  • సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్​
  • అదుపులో ఎస్ఐబీ సీఐ గట్టుమల్లు భూపతి, ప్రణీత్ రావు డ్రైవర్
  • భుజంగరావు, తిరుపతన్నకు ఐదు రోజుల పోలీస్ కస్టడీ 

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో రోజుకో విషయం బయటకొస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీ సహా కీలక పోస్టుల్లో ఉన్న ఐఏఎస్​లు, ఐపీఎస్​ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు స్పెషల్ టీమ్ దర్యాప్తులో తేలిందని తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో పని చేసిన ఓ డీజీపీ ఫోన్​ను ప్రణీత్ రావు టీమ్ ట్యాప్​ చేసిందని, ఆయన ఇతర పార్టీల నేతలతో మాట్లాడుతున్నారనే అనుమానంతో నిఘా పెట్టిందని సమాచారం. వేరే పార్టీల లీడర్లతో టచ్‌‌లో ఉన్నారనే సమాచారంతో ఆ డీజీపీపై అప్పట్లో కేసీఆర్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ అధికారి కొంతకాలం సెలవులో వెళ్లడం అటు పోలీస్ డిపార్ట్‌‌మెంట్​లో, ఇటు మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. 

 అయితే అనారోగ్యం కారణంగానే తాను సెలవులో వెళ్లానని ఆ డీజీపీ అప్పట్లో వెల్లడించారు. కానీ దీనికి అసలు కారణం ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారమని ఇప్పుడు డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చర్చ జరుగుతున్నది. కాగా, ప్రతిపక్ష నేతలతో పాటు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, మీడియా సంస్థల చైర్మన్ల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు స్పెషల్ టీమ్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఇప్పుడు తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుసుకుంది. ఇలా ప్రతి అధికారి కదలికను తెలుసుకుంటూ తమ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా గత ప్రభుత్వం సీక్రెట్‌‌‌‌ ఆపరేషన్స్ నిర్వహించినట్టు సమాచారం.  

ఒకరు అరెస్టు.. అదుపులో ఇద్దరు  

ఈ కేసులో ప్రణీత్‌‌‌‌రావు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌‌‌ రావును స్పెషల్ టీమ్ అరెస్టు చేసింది. అలాగే ఎస్‌‌‌‌ఐబీ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ గట్టుమల్లు భూపతి, ప్రణీత్‌‌‌‌రావు కారు డ్రైవర్‌‌‌‌ను గురువారం అదుపులోకి తీసుకుంది. వాళ్లను బంజారాహిల్స్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో వెస్ట్‌‌‌‌జోన్‌‌‌‌ డీసీపీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. ప్రణీత్‌‌‌‌రావు టీమ్‌‌‌‌ ద్వారా టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ డిపార్ట్ మెంట్ కు అందిన సమాచారం వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఎస్‌‌‌‌ఐబీలో గట్టుమల్లు భూపతి నిర్వహించిన విధులపై ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ ప్రణీత్‌‌‌‌రావు, భుజంగరావు, తిరుపతన్నలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్స్‌‌‌‌ వివరాలు రాబడుతున్నారు. 

వారిచ్చిన సమాచారంతో స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేశారు. శుక్రవారం కోర్టుకు సెలవు కావడంతో కొంపల్లిలోని న్యాయమూర్తి ఇంట్లో వాళ్లను హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్లిద్దరినీ కస్టడీకి తీసుకునేందుకు శనివారం లేదా సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా, 2017లో సిటీ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ డీసీపీగా  రాధాకిషన్‌‌‌‌ రావు బాధ్యతలు చేపట్టారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఓఎస్‌‌‌‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్‌‌‌‌ డ్యూటీ)గా అప్పటి సీఎం కేసీఆర్ నియమించారు.

 దీంతో ఓఎస్డీ హోదాలో దాదాపు ఐదేండ్ల పాటు టాస్క్ ఫోర్స్ లో రాధాకిషన్ రావు పని చేశారు. ఈ క్రమంలో ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌రావుతో కలిసి ఆపరేషన్స్ నిర్వహించారు. ఎస్ఐబీ నుంచి అందిన సమాచారంతో హవాలా వ్యాపారులు, అక్రమంగా గుట్కా లాంటి బిజినెస్ చేసేటోళ్లను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

వాళ్లిద్దరికీ పోలీస్ కస్టడీ..  

ఈ కేసులో ప్రణీత్‌‌‌‌రావు సహా ఏఎస్పీ భుజంగరావు, అడిషనల్ డీసీపీ తిరుపతన్నలను స్పెషల్ టీమ్ ఇప్పటికే అరెస్టు చేసింది. వీరు ముగ్గురు ప్రస్తుతం చంచల్‌‌‌‌గూడ జైలులో రిమాండ్‌‌‌‌లో ఉన్నారు. ఈ ముగ్గురినీ ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా, దీనిపై నాంపల్లి కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. ప్రణీత్‌‌‌‌రావును ఇప్పటికే వారం రోజులు కస్టడీకి ఇచ్చినందున, మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. భుజంగరావు, తిరుపతన్నలను మాత్రం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంచల్‌‌‌‌గూడ జైలులో రిమాండ్‌‌‌‌లో ఉన్న భుజంగరావు, తిరుపతన్నలను పోలీస్ అధికారులు శుక్రవారం కస్టడీకి తీసుకోనున్నారు. వాళ్లను బంజారాహిల్స్ పీఎస్‌‌‌‌కు తరలించి విచారించనున్నారు.