దేశాన్ని మార్చిన ఐడియాలు

దేశాన్ని మార్చిన ఐడియాలు

స్వాతంత్ర్యం తర్వాత కొత్తగా ఏర్పడిన ఇండియాకు ఎన్ని సమస్యలు, ఎన్నెన్ని సవాళ్లు! వాటన్నింటినీ ఎదుర్కోవాలంటే  సరికొత్త సొల్యూషన్స్ ఆలోచించాలి కదా మరి. ఈ 75 ఏళ్లలో అలాంటి ఇన్నొవేటివ్ ఐడియాలు బోలెడు పుట్టుకొచ్చాయి. ఒక ఐడియా జీవితాన్నే కాదు, దేశాన్ని కూడా మార్చగలదని ప్రూవ్ చేశాయి. ప్రసూతి మరణాలతో పోరాడటం నుంచి వ్యవసాయ పద్ధతుల్ని మార్చడం వరకు ఎన్నో ఇన్నొవేటివ్ ఐడియాలు, ప్రాజెక్టులు భారతదేశాన్ని కొత్త శకంలోకి తీసుకెళ్తున్నాయి.  దేశంలో ఉన్న పెద్దపెద్ద ప్రాబ్లమ్స్‌‌కు సరికొత్త సొల్యూషన్స్ కనిపెడుతూ.. ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నాయి. వాటిలో కొన్ని ఇవి.

సోలార్ పవర్
పొలానికి నీరు పెట్టేందుకు ఒకప్పుడు కరెంట్ కోసం ఎదురుచూసిన రైతులే ఇప్పుడు  పొలంలో సోలార్ ప్యానెళ్లు పెట్టి ప్రభుత్వానికి కరెంట్ అమ్ముతున్నారు. దీనికి కారణం1961-–66 ఆర్థిక సంవత్సరంలో ఇండియా తీసుకున్న సోలార్ పాలసీ  నిర్ణయం. విద్యుత్ ఉత్పత్తికి ఇతర మార్గాలున్నప్పటికీ సోలార్ ఎనర్జీతో జరిగే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అప్పట్లోనే సోలార్ శక్తికి పెద్దపీట వేసింది ఇండియా. దేశంలోని చాలా ప్రాబ్లమ్స్‌‌కు ఇది సొల్యూషన్‌‌గా మారింది. ప్రస్తుతం దేశంలో సౌరశక్తి ద్వారా సుమారు 57 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.  ఈ ఏడాది చివరికల్లా వంద గిగావాట్లు ఉత్పత్తి చేయడమే ఇండియా టార్గెట్. సోలార్ పవర్‌‌‌‌ను వినియోగించుకోవడంలో చైనా మొదటి స్థానంలో ఉంటే ఇండియా ఐదో స్థానంలో ఉంది. పల్లెల నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకూ దేశంలో పెద్ద మార్పుని తీసుకొచ్చిన ఐడియా ఇది.

ప్లాస్టిక్ రోడ్
మనదేశాన్నే కాదు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ వేస్ట్.. మొదట ఉంటుంది. అలాంటి ప్లాస్టిక్ వేస్ట్‌‌కు ఇండియా ఒక బెస్ట్ సొల్యూషన్ కనిపెట్టింది. ఈ ఐడియా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచింది. అదే ప్లాస్టిక్ వేస్ట్‌‌తో రోడ్డు నిర్మించే టెక్నాలజీ.  తమిళనాడుకి చెందిన రాజగోపాలన్ వాసుదేవన్ దీన్ని డెవలప్ చేశారు.  ఎందుకూ పనికిరాని ప్లాస్టిక్ వ్యర్థాలను భారత్ ఇప్పుడు వినూత్నంగా వాడుతోంది. ఇప్పటికే ప్లాస్టిక్ వ్యర్థాలతో  లక్ష కిలోమీటర్ల మేర రోడ్లను పూర్తి చేసింది. దీంతో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా అవ్వడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాల సమస్యకు మంచి సొల్యూషన్ దొరికినట్టయింది. రీసైక్లింగ్ చేయడానికి కుదరని ప్లాస్టిక్‌‌ను ఈ రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఈ రోడ్ల వల్ల గుంతలు పడడం, నీరు నిలవడం వంటి సమస్యలుండవు. హైదరాబాద్‌‌లోని నాగోల్‌‌లో కూడా ప్లాస్టిక్ రోడ్డు ఒకటుంది. 

ఈవీలు
పెట్రోల్ రేట్స్, పొల్యూషన్ అనే రెండు పెద్ద సమస్యలకు ఒక్కటే సొల్యూషన్  ఆలోచించింది ఇండియా. అదే ఎలక్ట్రిక్ వెహికల్.  ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. 1993లో మొదటి ఎలక్ట్రిక్ కార్ ‘లవ్​బర్డ్’ లాంచ్ అయిన మూడేళ్లకే ఫస్ట్ ఎలక్ట్రిక్ త్రీవీలర్ కూడా లాంచ్ అయింది. ఆతర్వాత నాలుగేళ్లలో ఎలక్ట్రిక్ బస్ కూడా రెడీ అయింది. దీన్ని బట్టి చూస్తే ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎంత వేగంగా పెరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు పదుల సంఖ్యలో ఈవీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు కూడా పుట్టుకురావడంతో భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తున్నాయి. 2030 నాటికి కమర్షియల్ వాహనాల్లో 70 శాతం, ప్రైవేట్ వాహనాల్లో 30శాతం, టూవీలర్స్‌‌లో 80 శాతం.. ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలన్న టార్గెట్‌‌తో ఇండియా పనిచేస్తోంది.

బర్త్ కిట్లు
జీవితాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన 61 ప్రపంచ ఉత్పత్తులలో ఒకటిగా ఎంపికైన ‘బర్త్ కిట్స్’ రూపొందించింది ఇండియానే. దేశంలో భారీగా నమోదవుతున్న ప్రసూతి మరణాలను తగ్గించేందుకు ఏదైనా చేయాలనుకున్న జుబేదా బాయికి వచ్చిన ఐడియా ఇది. అపరిశుభ్రమైన ప్రసూతి పద్ధతులు కారణంగా చనిపోయే వేలాది మంది తల్లులు, శిశువుల ప్రాణాలను ఈ కిట్లు కాపాడగలిగాయి. ఈ ఐడియాను ప్రభుత్వం కూడా  అడాప్ట్ చేసుకుని మెరుగైన కిట్లు ఉచితంగా అందజేసి దేశవ్యాప్తంగా లక్షల మంది తల్లులను కాపాడగలిగింది. ఈ ఒక్క ఐడియా దేశవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటుని గణనీయంగా తగ్గించింది.

ఇ-గవర్నెన్స్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పరిపాలనను ప్రజల వరకూ చేరవేయడం సవాళ్లతో కూడుకున్న విషయం. అయితే దానికి కూడా ఇండియా ఒక మంచి సొల్యూషన్  ఆలోచించింది. అదే ‘ఇ–-గవర్నెన్స్’.  ప్రతీ చిన్న పనికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ఆన్‌‌లైన్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించే డిజిటల్ గవర్నెన్స్‌‌ను తీసుకొచ్చింది.
పాస్‌‌పోర్ట్ సేవల కోసం ‘ఎమ్ పాస్‌‌పోర్ట్ సేవా’, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేలా ‘యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌‌‌‌ఫేస్’, ‘భీమ్’ అప్లికేషన్(యాప్),  పాఠ్యపుస్తకాలను ఆడియో వీడియో రూపంలో అందించే ‘ఇ-–పాఠశాల’. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి వాటిని భద్రపరుచుకునేందుకు ‘డిజీ లాకర్’ లాంటి సేవలతో పాటు మరెన్నో ప్రభుత్వ సేవలను ఆన్‌‌లైన్ ద్వారా అందిస్తోంది. ‘ఇ-–గవర్నెన్స్’, ‘రియల్ టైం గవర్నెన్స్’ లాంటి విధానాలతో  ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉండే గ్యాప్‌‌ బాగా తగ్గింది.  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి పిల్లల వరకూ ఎంతోమంది జీవన విధానాన్ని మార్చిన సక్సెస్‌‌ఫుల్ ఐడియా ఇది.

ఫేక్ న్యూస్ వారియర్స్
దేశాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న మరో సమస్య ఫేక్ న్యూస్. భారతదేశంలో 200 మిలియన్లకు పైగా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లున్నారు. రోజూ వందల మిలియన్ల మెసేజ్‌‌లు ఫార్వార్డ్ అవుతుంటాయి.  అందులో ఏది పుకారు, ఏది  నకిలీ వార్త అనేది తెలియదు. అందుకే స్వచ్ఛందంగా కొంతమంది కలిసి దీనికి సొల్యూషన్ కనిపెట్టారు. ఫేక్ న్యూస్ వారియర్స్‌‌గా మారి నకిలీ వార్తలతో యుద్ధం చేస్తున్నారు. బూమ్ లైవ్, ఆల్ట్ న్యూస్, ఎస్ఎమ్ హోక్స్‌‌లేయర్ వంటి సంస్థలు సోషల్ మీడియాను పర్యవేక్షిస్తూ, తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తాయి. సమగ్ర పరిశోధన జరిపి సోషల్ మీడియాలోని వార్తలు, కథనాలను ధ్రువీకరిస్తారు. ఇలా సోషల్ మీడియా నుంచి ఫేక్ న్యూస్‌‌ను  చాలావరకూ  ఏరిపారేస్తున్నారు. ఈ సంస్థలను సీనియర్ జర్నలిస్టులు, రీసెర్చర్లు  నిర్వహిస్తున్నారు. ఫేక్ న్యూస్‌‌కు ఇలాంటి ఒక సొల్యూషన్ కనిపెట్టడం ఇదే మొదటిసారి.

ఇస్రో నావిక్
ఈ 75 ఏండ్లలో ఇండియా అత్యాధునిక మిలిటరీ పవర్‌‌‌‌గా ఎదిగింది. శక్తిమంతమైన దేశంగా ఎదగాలంటే శత్రువుల కన్ను మనపై పడకుండా చూసుకోవాలి. కానీ ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు నావిగేషన్ కోసం అమెరికా రూపొందించిన ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్)’ పైనే ఆధారపడ్డాయి. ఇది దేశంపై మూడో కన్ను లాంటిది. అందుకే దీనికో సొల్యూషన్ కనిపెట్టింది ఇండియా. అదే నావిక్.  మన నావిగేషన్ మన చేతుల్లో ఉండేలా సొంత శాటిలైట్ సిస్టమ్ రూపొందించింది. 2017లో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం(ఐఆర్ఎన్ఎస్ఎస్)–1జీ శాటిలైట్‌‌ను సక్సెస్‌‌ఫుల్‌‌గా ప్రయోగించింది. ఈ వ్యవస్థ కోసం ఇస్రో మొత్తం ఏడు ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్స్‌‌ను పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్లతో అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అయితే నేటి వరకూ ఇండియా దాన్ని మిలటరీ అవసరాలకు మాత్రమే వాడుతోంది. త్వరలోనే మనం వాడుతున్న మొబైల్స్, కార్లలో కూడా ఈ నావిగేషన్‌‌ను తీసుకురానుంది. దేశ భద్రతను పూర్తిగా అప్‌‌డేట్ చేసిన ఐడియా ఇది.