వారికి ఎమ్మెల్సీ అయ్యే అర్హతలు ఉన్నయ్‌

వారికి ఎమ్మెల్సీ అయ్యే  అర్హతలు ఉన్నయ్‌
  •  హైకోర్టులో కోదండరాం, అమీర్‌‌ అలీఖాన్‌ తరఫు వాదనలు

హైదరాబాద్, వెలుగు : గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులయ్యేందుకు ప్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ అమీర్‌ అలీఖాన్‌కు అన్ని అర్హతలున్నాయని వారి తరఫు అడ్వకేట్‌ దేశాయ్‌ అవినాశ్‌ పేర్కొన్నారు. కేబినెట్‌ సిఫార్సులకు అనుగుణంగా వారి పేర్లను గవర్నర్‌ ఆమోదించారని చెప్పారు. గవర్నర్‌ కోటా కింద తమ ఎమ్మెల్సీ నామినేషన్లను తిరస్కరించడాన్ని బీఆర్‌‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్ర సత్యనారాయణ సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సోమవారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌ కుమార్‌‌ల బెంచ్‌ విచారణ చేపట్టింది. 

కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ తరఫు లాయర్‌‌ అవినాశ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్సీ అభ్యర్థులను మార్పు చేస్తూ గత జనవరి 27న ప్రభుత్వం 12, 13 జీవోలను జారీ చేసిందన్నారు. వీటిని కొట్టేసి, తమనే ఎమ్మెల్సీలుగా నియమించేలా ఉత్తర్వులివ్వాలని పిటిషనర్లు కోరుతున్నారని చెప్పారు. కేబినెట్‌ సిఫార్సుల మేరకే కోదండరాం, ఖాన్ల పేర్లను గవర్నర్‌ ఆమోదించారన్నారు.

 గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యిందని చెప్పారు. గవర్నర్‌ తీసుకునే నిర్ణయాలపై న్యాయ సమీక్షకు ఆస్కారం లేదన్నారు. గత సెప్టెంబర్‌‌లో దాసోజు, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్‌‌ తిరస్కరించారన్నారు. గవర్నర్‌ తిరస్కరించినా ఆ పేర్లనే కేబినెట్‌ తిరిగి రికమండ్‌ చేసే అవకాశం ఉండి కూడా గత ప్రభుత్వం చేయలేదని అవినాశ్‌ వివరించారు. అనంతరం విచారణను ఈ నెల 14కి హైకోర్టు వాయిదా వేసింది.