- మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి
మల్కాజిగిరి, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో పోలీస్ అధికారుల అలసత్వం ఆందోళన కలిగిస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. అట్రాసిటీ కేసులను దర్యాప్తు చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు.
వెంకటాపురం డివిజన్ యాదమ్మ నగర్‌లోని ఎస్సీ, ఎస్టీ దళిత కుటుంబాల నివాస ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడం దారుణమన్నారు. సివిల్ రైట్స్ డే సందర్భంగా ప్రభుత్వ అధికారులు చట్టంపై అవగాహన కల్పించినప్పటికీ, ఇప్పటికీ విద్యుత్ సదుపాయం అందకపోవడం బాధాకరమన్నారు. అవసరమైన బల్క్ విద్యుత్ మీటర్లు మంజూరు చేసి విద్యుత్ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీ విషయంలో తహసీల్దార్లు నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శంకర్ రెడ్డి, చక్రపాణి, వెంకట్ రెడ్డి, ఎస్ఐలు ప్రశాంత్, రవి, సుధీర్, తహసీల్దార్లు వాణి, రాములు, సీతారాం, ఏఎస్డబ్ల్యూవో తులసీకృష్ణ, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
