పట్టపగలే రాష్ట్రాన్ని దోచుకున్నరు : షర్మిల

పట్టపగలే రాష్ట్రాన్ని దోచుకున్నరు : షర్మిల

ఇది బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ అని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ పెద్ద మోసగాడని, ఆయనకు ఓట్ల తోనే పని అని, ఆయన బోడ మల్లన్న లెక్కఅంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అర చేతిలో బంగారు తెలంగాణను చూపించారన్న ఆమె... బంగారు తెలంగాణ అయ్యిందా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో 16 లక్షల మంది రైతులు డీ ఫాల్టర్లుగా మిగిలారని చెప్పారు. వ్యవసాయానికి సబ్సిడీ పథకాలు బంద్ పెట్టారని, పంట నష్టపోతే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. కౌలు రైతు రైతే కాదని అంటున్నారన్న షర్మిల... కేసీఆర్ రైతాంగాన్ని ఆగం చేశారని విమర్శించారు. నిరుద్యోగులను మోసం చేశారని, కళ్లముందు1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. రెండో సారి పాలనలో ఒక్క ఉద్యోగం నింపలేదని మండిపడ్డారు. లెటర్ రాసి మరీ నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారన్న ఆమె... డిగ్రీలు, పీజీలు చదివి హమాలీ పని చేసుకోవాలా అని నిలదీశారు.

పేదవాడికి బ్రతుకే లేని తెలంగాణ చేశారని షర్మిల ఆరోపించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని చెప్పారు. ఇంత అప్పు చేసి బీడీ బిచ్చం కల్లు ఉద్దేర అన్నట్టు దేనికీ డబ్బు లేకుండా పోయిందని విమర్శించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే అని ప్రశ్నించారు. ఏ పథకానికీ డబ్బు లేదని, తెచ్చిన అప్పులన్నీ ఎక్కడ పోయాయి అని నిలదీశారు. అవన్నీ కేసీఆర్ ఇంట్లోకి కమీషన్ రూపంలో పోయాయని, బీఆర్ఎస్-  పార్టీ అకౌంట్ లో రూ. 860 కోట్లు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ కమీషన్ లు, ఆయన బిడ్డ లిక్కర్ స్కాం లు, కొడుకు రియల్ ఎస్టేట్ లతో  పట్టపగలే రాష్ట్రాన్ని దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి బంగారు తెలంగాణ అయిందన్న షర్మిల.. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి..  కేసీఆర్ మళ్ళీ వస్తాడు...మంచి మంచి మాటలు చెప్తాడు... మళ్ళీ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు అంటూ ప్రజలకు సూచించారు.

తెలంగాణ లో వైఎస్సార్ పాలన ఎక్కడా లేదని, అప్పటి పథకాలు కూడా ఎక్కడా లేకుండా షర్మిల ఆరోపించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో వైఎస్సార్ ఉన్నాడు.. పార్టీ అజెండా వైఎస్సార్ అని ఆమె చెప్పారు. వైఎస్సార్ ప్రతీ పథకాన్ని మళ్ళీ అద్భుతంగా అమలు చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. 8 ఏళ్లుగా కేసిఆర్ ఆడింది ఆట, పాడింది పాట అయిందన్న ఆమె.. కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా లొంగిపోయాయని ఆరోపించారు. అధికార పక్షంతో కుమ్మక్కయ్యారని, ప్రతిపక్షం అమ్ముడు పోయిందని వ్యాఖ్యానించారు. సమస్యలే లేవని ఈ దుర్మార్గపు సర్కార్ చెప్తోందని.. కానీ తాను ఆ సమస్యలున్నాయని చూపిస్తూ 3700 కి.మీ. పాదయాత్ర చేశానని గర్వంగా చెప్పారు. వైఎస్సార్ పాలనను సాధ్యం చేస్తానని షర్మిల నొక్కి చెప్పారు.