
కహ్రామన్మారస్(టర్కీ): వాళ్లు ముగ్గురు మృత్యుంజయులు. ఒకట్రెండు కాదు.. ఏకంగా వందల గంటల పాటు భవన శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడిపి.. బతికి బయటపడ్డారు. టర్కీలోని కహ్రామన్ మారస్ నగరానికి చెందిన ఈ ముగ్గురినీ రెస్క్యూ సిబ్బంది గురువారం కాపాడారు. 10 రోజుల కింద భూకంపం రావడంతో కూలిన అపార్ట్మెంట్ శిథిలాల కింద అబ్దుల్ బఖీ యెనినార్(21), మహ్మద్ ఎనెస్ యెనినార్ (17) అనే అన్నదమ్ములు ఇరుక్కుపోయారు. దాహాన్ని తీర్చుకునేందుకు మూత్రం తాగారు. ఆకలిని తీర్చుకునేందుకు శిథిలాల నడుమ దొరికిన ప్రోటీన్ పౌడర్‌ను తిన్నారు. ఏదోలా దాదాపు 200 గంటలు (9 రోజులు) శిథిలాల నీడలో గడిపి.. చివరకు ఫిబ్రవరి 14న రెస్క్యూ టీమ్స్ వచ్చి హెల్ప్ చేయడంతో బతికి బయటపడ్డారు. ఆ తర్వాత వారు జరిగిందంతా మీడియాకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఇటువంటిదే మరో ఘటన ఇదే నగరంలో చోటుచేసుకుంది. దాదాపు 248 గంటల పాటు (10 రోజులు) భవన శిథిలాల కింద చిక్కుకున్న 17 ఏళ్ల అమ్మాయిని రెస్క్యూ టీం బయటికి తీసింది. కాగా, భూకంపం వల్ల టర్కీ, సిరియాల్లో మరణించిన వారి సంఖ్య 42వేలు దాటింది. మృతుల్లో 36,187 మంది టర్కీవాసులు కాగా, 5,800 మంది సిరియావాసులు. టర్కీలో 1.08 లక్షల మంది గాయాలపాలయ్యారు.