
బషీర్బాగ్, వెలుగు : దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి .. ప్రమాదవశాత్తు భవనం పై నుండి కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బేగంబజార్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబిడ్స్ డివిజన్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం .. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఉన్న మనోరంజన్ కాంప్లెక్స్ లోని రెండవ అంతస్తులో ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు దొంగతనానికి వచ్చారు. మూసి ఉన్న గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... అలికిడి రావడంతో వారు భయంతో వేరే భవనం పైకి దూకేందుకు యత్నించారు.
సుమారు 45 ఏళ్లు ఉన్న దొంగ కాలు జారీ కిందపడిపోయాడు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి పరారయ్యాడు. కింద పడ్డ వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు బేగంబజార్ పోలీసులకు సమాచారం అందించారు. మొదట హత్యగా ప్రచారం కావడంతో , అబిడ్స్ డివిజన్ ఏసీపీ వెంకట్ రెడ్డి , బేగంబజార్ సీఐ విజయ కుమార్ , క్లూస్ టీమ్ లు ఘటన స్థలానికి చేరుకొని , వివరాలను సేకరించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చుకి తరలించారు. ఈ ఘటన మరింత లోతుగా వివరాలు సేకరించేందుకు కేసు నమోదు చేసి సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.