పోలీస్ కారుతో దొంగ పరార్.. అబ్బే అదేం లేదన్న డీఎస్పీ

పోలీస్ కారుతో దొంగ పరార్.. అబ్బే అదేం లేదన్న డీఎస్పీ

మహబూబ్​నగర్​, వెలుగు: హలో బ్రదర్​ సినిమా చూశారా! చూస్తే.. ఆ సినిమాలో హీరో దొంగ, తన స్నేహితుడు దొంగతో కలిసి స్టేషన్​ నుంచి తప్పించుకుని పోలీస్​ జీపును ఎత్తుకెళ్లిపోయే సీన్​ గుర్తుందా! అచ్చం అలాంటి సీనే జరిగింది జోగులాంబ గద్వాల జిల్లాలో. ఉండవల్లి మండలంలో ఐదు రోజుల కింద దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని ఊరోళ్లు పోలీసులకు పట్టించారు. నాలుగు రోజులు స్టేషన్​లో పెట్టి పోలీసులు విచారించారు. అతడు కార్లను చోరీ చేసే తీరును చెబుతుంటే పోలీసులే విస్తుపోయారట. నాలుగు రోజులు ఆ దొంగ బాగానే ఉన్నాడు. కానీ, బుర్రలో చోరీ అనే పురుగు తిరిగిందో ఏమోగానీ, గురువారం తెల్లవారుజామున స్టేషన్​ నుంచి తప్పించుకున్నాడు. పొయ్యేటోడు ఉత్తగా పోయిండా..? ఏకంగా పోలీస్​ ఇన్నోవా కారులో పరారయ్యాడు.

తెల్లారక దొంగ, కారు కనపడకపోయే సరికి షాక్​ అవ్వడం పోలీసుల వంతైంది. గుట్టుచప్పుడు కాకుండా దొంగను పట్టుకునేందుకు పోలీసులు హడావుడిగా వెళ్లారు. హైవే వెంట వెతికారు. కొన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయినా దొంగ ఆచూకీ దొరకలేదు. ఇంతలోనే ఉండవెల్లి మండలంలోని తక్కశిల అనే గ్రామంలో పోలీస్​ కారు కనిపించినట్టు వారికి కబురు వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకుని అతడిని పట్టుకుని పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లారు. అప్పటికే ఈ విషయాన్ని కొందరు పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో, ఆనోటా ఈ నోటా పడి అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పేపర్లలో రావొద్దని ఓ ఉన్నతాధికారి ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది.

అయితే, చోరీ జరిగిన ముందు రోజు రాత్రి స్టేషన్​లో నలుగురు సిబ్బంది ఉన్నట్టు చెబుతున్నారు. వాళ్లంతా కూడా మద్యం మత్తులో ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని గమనించే దొంగ పారిపోయి ఉంటాడని కొందరు పోలీసులు చర్చించుకుంటున్నారు. డ్యూటీలో ఉన్న నలుగురు సిబ్బందితో పాటు ఎస్సైపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటార్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు ఏ దొంగా దొరకలేదని, కారుతో పారిపోలేదని గద్వాల డీఎస్పీ షాకీర్​ హుస్సేన్​ చెప్పారు. పోలీస్​ కారు పోయిందన్న వార్తలను నమ్మొద్దన్నారు. ఆ దొంగది తెలకపల్లి మండలం గట్టునెల్లికుదురు గ్రామంగా తెలుస్తోంది. హైదరాబాద్​ ఎర్రమంజిల్​లో మెకానిక్​గా పనిచేస్తూ కార్ల దొంగతనాలకు అలవాటు పడ్డాడని అంటున్నారు.

అలంపూర్ వైన్ షాపులో మందు కొంటు న్న దొంగ (సీసీటీవీ ఫుటేజీ రికార్డు)