నీ భర్తపై మరో మహిళ ప్రభావం ఉన్నది..నాకు వశీకరణ తెలుసు.. సమస్య తీరుస్తా

నీ భర్తపై మరో మహిళ ప్రభావం ఉన్నది..నాకు వశీకరణ తెలుసు.. సమస్య తీరుస్తా
  • నగదు, నగలతో దొంగ స్వామి పరార్

ఎల్బీనగర్, వెలుగు: పూజల పేరుతో ఓ మహిళ నుంచి నగదు, నగలు కొట్టేసిన దొంగ స్వామీజీపై నాగోల్​పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి వివరాల ప్రకారం.. నాగోల్​పరిధిలోని వీరారెడ్డి కాలనీకి చెందిన గుండు రజినీ అదే కాలనీ ఆటో స్టాండ్ వద్ద శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోర్డు చూసి, తన బంధువుతో కలిసి సాయి రాజ్ అనే వ్యక్తి వద్దకు వెళ్లింది. సాయి రాజ్ తనకు వశీకరణ తెలుసని, కుటుంబ సమస్యలకు పరిష్కారం అందిస్తానని చెప్పాడు.

ఆమె భర్తపై మరో మహిళ ప్రభావం ఉందని, విడాకులు జరిగే అవకాశం ఉందని భయపెట్టాడు. శక్తిపీఠాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమె నుంచి రూ.32 వేల నగదు, 5 తులాల బంగారం తీసుకున్నాడు. మరిన్ని పూజలకు ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఏప్రిల్ 28న నాగోల్​పీఎస్​లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు ఇంకా న్యాయం జరగడం లేదని బాధితురాలు మంగళవారం మరోసారి పీఎస్​కు రావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి చూసింది. ప్రస్తుతం సాయి రాజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.