బైక్ కొట్టేసి.. డ్రంకెన్ డ్రైవ్​​లో దొరికిన దొంగ

బైక్ కొట్టేసి.. డ్రంకెన్ డ్రైవ్​​లో దొరికిన దొంగ

పోలీసులు సీజ్ చేయగా.. వారి కళ్లు గప్పి మళ్లీ చోరీ

గచ్చిబౌలి, వెలుగు: బైక్ కొట్టేసి డ్రంకెన్ డ్రైవ్​లో పట్టుబడ్డ ఓ దొంగ.. పోలీసులు సీజ్ చేసిన అదే బైక్​ను మళ్లీ చోరీ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లిలోని బాలాజీనగర్​కు చెందిన శివయ్య శుక్రవారం రాత్రి స్కూటీపై కేపీహెచ్​బీలోని ఓ మాల్​లో షాపింగ్​కు వెళ్లాడు. బయటకు వచ్చేసరికి బైక్ కనిపించలేదు. వెంటనే కేపీహెచ్​బీ పీఎస్​లో కంప్లయింట్​చేశాడు. ఇదిలా ఉంటే, మాదాపూర్ ​ట్రాఫిక్​ పోలీసులు అదే రోజు రాత్రి డ్రంకెన్ డ్రైవ్ ​చేపట్టగా బి. కుమార్​అనే వ్యక్తి మద్యం తాగి వారికి చిక్కాడు. కుమార్ దగ్గరున్న బైక్​ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసి అతడిని పంపించేశారు. బైక్​ను మాదాపూర్ పీఎస్​కు తరలించి.. అది శివయ్య పేరు మీదు ఉన్నట్లు గుర్తించారు.

అప్పటికే కేపీహెచ్​బీ పీఎస్​లో బైక్ చోరీపై కంప్లయింట్ ఉండటంతో దాని ఆధారంగా మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు శివయ్యకు కాల్ చేసి..  మీ స్కూటీ దొరికిందని, పీఎస్​కు వచ్చి బైక్ తీసుకెళ్లాలని చెప్పారు. శివయ్య శనివారం ఉదయం అక్కడికి వెళ్లగా.. స్కూటీ కనిపించలేదు. స్టేషన్ పార్క్ చేసిన బైక్ మాయమవడంతో ట్రాఫిక్ పోలీసులు కంగుతిన్నారు. రాత్రి పట్టుబడ్డ కుమార్ అనే వ్యక్తే  మళ్లీ బైక్​ను దొంగిలించినట్లు గుర్తించారు. కుమార్ గతంలోనూ చోరీలకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ రాయదుర్గం పరిధిలో ఉండటంతో అక్కడి లా అండ్ ఆర్డర్ పీఎస్​లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.