
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో బుధవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. మార్కెట్ యార్డులో రైతులు నిల్వ చేసిన జొన్నలు దొంగిలించేందుకు ప్రయత్నం చేయగా.. గుర్తించిన రైతులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రాళ్లతో రైతులపై దాడికి దిగారు. ఈ దాడిలో రైతులు బరంపూర్‌కు చెందిన నారాయణ, రాంపూర్‌కు చెందిన దిలీప్ గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం రైతులను పరామర్శించారు. మార్కెట్ యార్డులో రైతులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడం వల్లే రైతులు యార్డ్‌లో పడిగాపులు కాయాల్సి వస్తుందని మండిపడ్డారు.