నార్కట్‌పల్లి, వెలుగు: హైదరాబాద్–విజయవాడ హైవేపై నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్ వద్ద రూ.9 లక్షల బ్యాగును ఆదివారం ఉదయం దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటకు చెందిన మోటార్ మెకానిక్ ఆరే రవీందర్ రెడ్డి ఆదివారం ఉదయం ఖమ్మం నుంచి ఆర్టీసీ బస్సులో తన బావమరిది కొండూరు సంతోష్ రెడ్డితో కలిసి హైదరాబాద్ బయలుదేరాడు.
8 గంటల సమయంలో నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి బస్సు ఆపారు. రవీందర్ రెడ్డి టిఫిన్ చేస్తుండగా, ఓ వ్యక్తి పక్కకు వచ్చి బ్యాగ్‌ను లాక్కొని కారు ఎక్కి హైదరాబాద్ వైపు పరారయ్యాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు టీమ్‌లు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. కాగా, పూజిత హోటల్ వద్ద గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
