
హైదరాబాద్: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ఎమ్మార్వో నాగేశ్వరరావు ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి రెండు లక్షల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూకట్ పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు.
సాధ్యమైనంత త్వరగా నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సీఐ రాజశేఖర్ రెడ్డి డి ఐ రవికుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిటీలోనే కాదు.. హైదరాబాద్ సిటీ శివారల్లో కూడా దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు యువకులను ఘట్కేసర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
జనగామకు చెందిన దస్తగిరి, సాయి నిఖిల్గత నెల30న అశోక్లీలాండ్వాహనంలో కూరగాయలు తీసుకొచ్చి బోయినపల్లి మార్కెట్లో అన్లోడ్ చేశారు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడ సమీపంలో టాయిలెట్ కోసం ఆగారు. ఈ సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వారిని బెదిరించి రూ.4 వేల నగదు, రూ.5 వేలు పేటీఎం ద్వారా వసూలు చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఘట్కేసర్ప్రాంతానికి చెందిన జవహర్, పత్తి రాజు, బంగారు శ్రావణ్ నిందితులుగా గుర్తించి, రిమాండ్కు తరలించారు.