పగలు రెక్కీ.. అర్ధరాత్రి దోపిడీలు.. హైదరాబాద్ శివారులో సంచలనం రేపిన దొంగలు అరెస్ట్

పగలు రెక్కీ.. అర్ధరాత్రి దోపిడీలు.. హైదరాబాద్ శివారులో సంచలనం రేపిన దొంగలు అరెస్ట్

మేడిపల్లి, వెలుగు: మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తూ తీహాడ్ జైల్లో పరిచయమైన ముగ్గురు నిందితులు విడుదలైన తర్వాత చోరీల బాట పట్టారు. బట్టలు అమ్మే వ్యక్తులుగా మారువేషంలో నగరానికి వచ్చి శివారులోని 9 ఇండ్లలో ఒకేరోజు చోరీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపడంతో పోలీసులు సవాలుగా తీసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఉప్పల్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్ శుక్రవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. 

మేడిపల్లి పరిధిలోని చెంగిచర్ల కనకదుర్గ కాలనీలో సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకున్న దొంగలు కాలనీపై కన్నేశారు. తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని బట్టలు అమ్మే వ్యక్తులుగా పగలు కాలనీలోకి ప్రవేశించి రెక్కీ నిర్వహించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకొని అర్ధరాత్రి ఇండ్ల తాళాలు పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లారు. మొత్తం 9 ఇండ్లలో 25 తులాల బంగారం, 6 కిలోల వెండి, రూ.2 లక్షల నగదును దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.

 ఈ కేసును మేడిపల్లి, ఉప్పల్ సీసీఎస్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. విచారణలో ఢిల్లీకి చెందిన మహదేవ్ ఝా (ఏ1), పవన్ గుప్తా (ఏ2), ఉత్తరప్రదేశ్ కాన్పూర్​కు చెందిన మంగళ్ సింగ్ (ఏ3)ను ప్రధాన నిందితులుగా గుర్తించారు. చోరీ సొత్తును బీహార్​కు చెందిన సీరం సావ్ బీరేందర్ (ఏ4)కు విక్రయించి రూ.6 లక్షలు తీసుకున్నారు. 

అందులో రూ.2 లక్షలను పంచుకోగా, నిందితులను అరెస్టు చేసి మిగిలిన సొత్తును రికవరీ చేశారు. పవన్ గుప్తా, మంగళ్ సింగ్​ను శుక్రవారం రిమాండ్​కు తరలించగా, మహదేవ్ ఝా, బీరేందర్​ను బిహార్​లో అరెస్టు చేసి హైదరాబాద్​కు తీసుకొస్తున్నారు. మహదేవ్ పై ఇప్పటికే 16 కేసులు, పవన్​పై 15 కేసులు, మంగళ్​సింగ్​పై 9  కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. వరంగల్, నల్లగొండ ప్రాంతాల్లోనూ వీరు ఇదే తరహా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.