- తెలంగాణలోనూ అధికారంలోకి వస్తం
- ఇక్కడ బెంగాల్‌లాంటి పరిస్థితులే కనిపిస్తున్నయ్: ప్రధాని మోదీ
- తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ పాలన కోరుకుంటున్నారు
- దేశంలోని ప్రతి మూలన ప్రజల్లో మార్పుకు ఇది సంకేతం
- భారత్ అభివృద్ధిలో తెలంగాణ, హైదరాబాద్ భాగంగా మారాయి
- ఈ రాష్ట్రానికి రూ. వేల కోట్ల నిధులు ఇస్తున్నం
- కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది
- ఆ పార్టీ.. ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్‌గా మారిందని కామెంట్
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారి భారీ మెజార్టీతో అద్భుత విజయం సాధించిందని, తెలంగాణలోనూ బెంగాల్ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
‘‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మధ్యలో కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే.. ‘‘తెలంగాణ ప్రజలారా, యువకులారా.. మీరు ఇంత ప్రేమను నాపై కురిపిస్తున్నారు..సంతోషం..శాంతిగా ఉండండి’ అంటూ సముదాయించారు.
అబ్ కీ బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్
తెలంగాణ ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు.‘‘బీజేపీ కార్యకర్తల సమరోత్సాహం చూస్తుంటే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే నమ్మకం కలిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హామీలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బీజేపీపై భరోసా ఏర్పడింది.
దేశంలోని నలుమూలలా బీజేపీకి ప్రజల ఆశీర్వాదం నిరంతరం పెరుగుతూ వస్తోంది. మా పాలనకు ప్రజలు ఓటేస్తున్నరు. సుపరిపాలనతోనే దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. అబ్ కీ బార్ తెలంగాణ మే బీజేపీ సర్కార్. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో బీజేపీ సర్కార్‌కు హ్యాట్రిక్ వచ్చింది. అస్సాంలో మూడోసారి అధికారంలోకి వచ్చాం.
పుదుచ్చేరిలో బీజేపీ సర్కారు రెండో సారి విజయం
సాధించింది.ఈ విజయాల ద్వారా తెలంగాణ ప్రజల భావన చూస్తున్నా.. తెలంగాణలోనూ బీజేపీ సర్కార్ వచ్చి తీరుతుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు” అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతేనని మోదీ అన్నారు. ‘‘బెంగాల్ ప్రజలు టీఎంసీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారు. మమత నియంతృత్వాన్ని ఎదురించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తోంది. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు కాదు.. విశ్వాస రాజకీయాలను ప్రజలు నమ్ముతున్నారు. పదేండ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు.
ఇప్పుడు 205 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. గతంలో బెంగాల్‌లో బీజేపీ జెండా పట్టుకోవడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఉండేది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఒకరు గెలుస్తారు..మరొకరు ఓడుతారు.. ఇది ప్రజాస్వామ్యంలో భాగం. కానీ బెంగాల్‌లో బీజేపీ విజయోత్సవాలపై దేశంలో చర్చ జరుగుతున్నది.
గతంలో ఇంత చర్చ ఎక్కడా జరగలేదు. అక్కడ ఓడిపోయింది రాజకీయ నాయకులు కాదు.. గులామీలు.. బెంగాల్ ప్రజలు రాజకీయాల్లో తానాషాహీ (నియంతృత్వం)ని తిరస్కరించారు. ఈ విజయం దేశంలోని ప్రజలందరి పూర్తి విజయోత్సవం. దక్షిణాది నుంచి తూర్పు వరకు భారత సీమలో ఎక్కడైనా బీజేపీని నిలువరించలేరని ఈ విజయం స్పష్టం చేసింది’’ అని పేర్కొన్నారు.
తెలంగాణకు వేలకోట్ల నిధులిస్తున్నం..
ఒకప్పుడు బీజేపీకి రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ‘‘తెలంగాణకు వేల కోట్ల నిధులిస్తున్నాం. రాష్ట్ర వికాసమే దేశ వికాసం.. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందడంలో తెలంగాణ, వికసిత్ భారత్‌లో హైదరాబాద్ భాగంగా మారింది.
దీనిలో ఎన్డీయే ప్రభుత్వ నిరంతర కృషి ఉంది. దేశంలో 14 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే ఒకటి తెలంగాణలోని జహీరాబాద్‌లో (మాన్యుఫాక్చరింగ్ కారిడార్) ఏర్పాటు చేస్తున్నం. దీంతో ఇక్కడి లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడి రైతులకు మరో ఒక కొత్త అవకాశం కల్పిస్తున్నాం.
దేశంలో 7 పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కులు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నాం. ఇది రాష్ట్ర పత్తి రైతుల జీవితాలను మారుస్తుంది. కాటన్ప్రొడక్షన్ క్వాలిటీ కోసం కొత్త మిషన్ స్టార్ట్ చేస్తున్నాం. వేల కోట్లు ఖర్చు చేస్తే లక్షలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది. హైదరాబాద్‌ను అన్ని రకాలుగా కేంద్రం అభివృద్ధి చేస్తోంది” అని వెల్లడించారు.
ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్‌గా మారింది
మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.‘‘కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా.. అబద్ధాలతోనే పాలన సాగిస్తుంది. హామీలతో ఆకాశానికి ఎత్తి గెలిచిన తర్వాత మోసం చేస్తారు. లెఫ్ట్ పార్టీల కంటే వికృతమైన మావోయిస్టు పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ముస్లింలీగ్ మావోయిస్టు కాంగ్రెస్‌గా మారింది. మావోయిస్టుల హింసతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. దేశమంతా మావోయిస్టులు అంతమైనా తెలంగాణలో ఇంకా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి, కేంద్రంతో కలిసి నడిస్తే ఎప్పుడో మావోయిస్టులు అంతమయ్యేవారు. బీజేపీ, ఎన్డీయేతోనే మావోయిస్ట్ ముఫ్త్గా మారింది. తెలంగాణలో మావోయిస్టులను అంతం చేయాలంటే బీజేపీ పాలన రావాలి. బీజేపీతోనే కొత్త ఆలోచన, కమిట్‌మెంట్‌తో వికసిత్ తెలంగాణగా మారుతుంది” అని పేర్కొన్నారు.
నేచురల్ ఫార్మింగ్ చేయండి..
రైతులు పంటల సాగులో రసాయనాలు తగ్గించాలని మోదీ సూచించారు. ‘‘కెమికల్ ఫర్టిలైజర్ వినియోగం కారణంగా భూమి సారం కోల్పోతున్నాం.. పంటలు నాశనం అవుతున్నాయి. పంట భూములను కాపాడుకోవాలి.. నేచురల్ ఫార్మింగ్ చేయాలి.. ఫర్టిలైజర్ తగ్గించాలి.. పంటలు కాపాడుకోవాలి.. రైతులు పంట భూముల్లో డీజిల్ పంపు సెట్లకు బదులు సోలార్ పంపుసెట్లు వినియోగించాలి.
కొవిడ్ టైంలో చెప్పినట్టు స్థానిక వస్తువులు వినియోగించాలి. మేడిన్ ఇండియా వస్తువులనే వాడాలి. దేశహితం కోసం ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. మీడియా సంస్థలు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. ఇలాంటి సంకల్పం ప్రతీ కష్టకాలంలో ఉపయోగపడుతుంది” అని మోదీ సూచించారు.
మోదీ పొదుపు మంత్రం
ప్రపంచ సంక్షోభ సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ప్రపంచం నేడు ఎన్నో సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొం టోంది. పశ్చిమా సియా, ఉక్రెయిన్ యుద్ధంతో సప్లయ్ చైన్ దెబ్బతిన్నది.
కొవిడ్ తర్వాత ఉక్రెయిన్ యుద్ధంతో ఫర్టిలైజర్‌పై ఎఫెక్ట్ పడింది. ఈ ఐదారేండ్లలో విపత్కర పరిస్థితుల నుంచి భారత్గట్టెక్కింది. ఇతర దేశాల్లో ఫర్టిలైజర్బస్తా రూ.3 వేలకు అమ్ము తున్నరు. మన దేశంలో రైతుల కు కేవలం రూ.300 కంటే తక్కువకే ఇస్తున్నాం. పశ్చి మాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉంది.
గత రెండు నెలలుగా యుద్ధం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాం తం పెరిగాయి. మనవద్ద పెట్రోల్, డీజిల్‌ను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గత రెండు నెలల నుంచి ప్రజలపై భారం పడ కుండా నిరం తరంగా అన్ని చర్య లు తీసుకుంటున్నాం. యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తోంది. ధరలను పెంచడం లేదు, ప్రజలపై భారం వేయడం లేదు” అని తెలిపారు.
ఏడాది దాకా బంగారం కొనొద్దు
యుద్ధం కారణంగా ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రతి పౌరుడు కొన్ని త్యాగాలు చేయాలి. దేశ హితం కోసం ఏడాది వరకు ఎలాంటి శుభకార్యాలు, ఫంక్షన్లకు బంగారం కొనొద్దు. వంట నూనెల వాడకాన్ని కనీసం 10 శాతం తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించాలి. స్వయం సంమృద్ధి సాధించాలి.. విదేశీ మారకద్రవ్యాన్ని మనం కాపాడుకోవాలి.
ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలి. సరుకు రవాణాకు రైల్వే సర్వీసులను వినియోగించండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచండి. కొవిడ్ తరహాలో వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలి. విదేశీ ప్రయాణాలు మానుకోవాలి.- ప్రధాని మోదీ
కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ మార్పు సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కమలం వికసించడం ఖాయం. వారసత్వ రాజకీయాలను పక్కనపెట్టి.. ప్రజలంతా ఇప్పుడు విశ్వాస రాజకీయాలను నమ్ముతున్నారు. సౌత్ నుంచి నార్త్ వరకు బీజేపీని ఎవరూ ఆపలేరు.
ప్రధాని నరేంద్ర మోదీ
