ప్రశాంతత: ఆలోచనతోనే పరిష్కారం సాధ్యం

ప్రశాంతత: ఆలోచనతోనే పరిష్కారం సాధ్యం

మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో  ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనపడదు. సాధారణంగా ఉండే నీటిలో మన ప్రతిబింబం అద్దంలో కనపడినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అదే బాగా మరుగుతున్న నీటిలోకి చూసుకుంటే మన ప్రతిబింబం ఏమాత్రం కనపడదు. అలాగే సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు, ఆవేశంతో సమస్యకు పరిష్కారం లభించదు. అదే ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. అందుకే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆనందంలో వరాలు ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతోంది. 

మహాభారతంలో..

విరాటరాజు బావమరిది కీచకుడు ద్రౌపదిని చూసి మోహించాడు. ఆమెను వెంటాడుతూ ఒకనాడు కొలువులోకి ప్రవేశించాడు. ఆమె పట్ల అసభ్యంగా మాట్లాడాడు. అది చూసిన భీమునికి ఆవేశం కట్టలు తెంచుకుంది. అసలే బలవంతుడు. దానికితోడు ఆ కీచకుడు ద్రౌపదిని పరాభవించాడు. ఎలాగైనా వాడిని హతమార్చాలనే క్రోధంతో, పక్కనే ఉన్న పెద్ద వృక్షాన్ని పెకిలించబోయాడు. 

ఆవేశంలో భీముడు చేయబోయిన పని కారణంగా, వారి అజ్ఞాతవాసం బయటపడిపోయేది. కాని ధర్మరాజు ‘వలలా! మంచి ఫలాలనిచ్చే చెట్టుని వంటచెరకుగా చేయడం మంచి పని కాదు. ఆ చెట్టును ముట్టుకోకు’ అని భీముడిని శాంతపరిచాడు. ప్రశాంతంగా ఆలోచించాడు కనుకనే ధర్మరాజుకి పరిష్కారం లభించింది. వారి అజ్ఞాతవాసం బయటపడకుండా నిలిచింది. 

రామాయణంలో...

రావణుడు అపహరించిన సీతను వెతకటానికై హనుమంతుడు లంకా నగరానికి వచ్చాడు. లంక అంతా వెతికాడు. సీతమ్మ జాడ కనపడలేదు. ఇక మనస్సు వ్యాకులం చెందినవాడై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కాసేపటికి ప్రశాంత చిత్తుడై, తాను అశోకవనంలో వెతకలేదని తెలుసుకున్నాడు. అంతే తక్షణమే బయలుదేరి అశోకవనంలో వెతికాడు. అక్కడ శింశుపా వృక్షచ్ఛాయలో అమ్మవారు కనిపించింది. హనుమంతుడు ప్రశాంత చిత్తంతో ఆలోచించాడు కనుకనే పరిష్కారం లభించింది. సీతమ్మ జాడని రామయ్యకు చేర్చాడు. 

పంచతంత్రంలో...

పావురాలు, బోయవాడు కథ అందరికీ తెలిసిందే. ఒకసారి ఒక బోయవాడు పావురాల కోసం గింజలు చల్లి, దాని మీద వల వేసి ఉంచాడు. అవి చూసిన పావురాలు, ఆకలితో ఉండడం వల్ల ఆ గింజలు తినడానికి అక్కడకు వెళ్దామన్నాయి. అందుకు ఒక వృద్ధ కపోతం.. అది వేటగాడు పన్నిన వల. మనం అక్కడకు వెళ్లవద్దు అని పలికింది. కానీ ఆకలి వల్ల ఆలోచన కోల్పోయి ఆ వృద్ధ కపోతం మాటలు వినకుండా, పావురాలన్నీ ఆ గింజల కోసం అక్కడ వాలాయి. అంతే... అవన్నీ బోయవాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. పావురాలన్నీ ఏడ్పు మొదలుపెట్టాయి. ఆ వృద్ధ పావురం ప్రశాంతంగా... ‘నేను చెప్పినట్లు చేయండి. మనందరం తప్పించుకోవచ్చు. 

బోయవాడు మనం చిక్కుకున్న వలను కట్టిన తాడును విప్పుతాడు. సరిగ్గా అదను చూసుకుని, అందరం కలిసి ఒకేసారి వలతో సహా ఎగిరిపోదాం. తరవాతి విషయం తరవాత చూద్దాం’ అంది. పావురాలన్నీ అంగీకరించాయి. బోయవాడు తాడు విప్పగానే, అన్నీ కలిసి వలతో సహా ఎగిరిపోయాయి. వృద్ధ కపోతం ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించడం వల్లే వారి సమస్యకు పరిష్కారం లభించింది.
జీవితంలో కూడా ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. కష్టాలు రాగానే కుంగిపోకుండా, ఆ కష్టాన్ని అధిగమించటానికి మార్గం కోసం అన్వేషించాలి. అంతేకాని, కష్టం కలగగానే దుఃఖంతో, ఆత్మహత్యలకు పాల్పడితే ఉపయోగం ఉండదు. 

జీవితంలో చీకటివెలుగులు సహజం. చీకటి వెంట వెలుగు, వెలుగు వెంట చీకటి వస్తూపోతుంటాయి. అందువల్ల కష్టం లేదా బాధ కలిగినప్పుడు... కొద్దిసేపు మనసుని ప్రశాంతంగా ఉంచుకుని, ఆ తరవాత wనిర్ణయం తీసుకోవాలని అనాదిగా మన పురాణాలు, గాథలు చెబుతూనే ఉన్నాయి. మనం నడిచేటప్పుడు ఒక గొయ్యి లాంటిది ఏదైనా ఆటంకం కలిగిస్తే.. దానిని దాటి ఎలా వెళ్లాలా ఆలోచించాలే కాని, మనం దాటలేము, వెనక్కి మరలిపోదాం అనుకోకూడదని పెద్దల వాక్కు. మనసుని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేసి, పరిష్కారం కోసం అన్వేషించాలి.

-డా. పురాణపండ వైజయంతి-