- చర్చలతో రెండో విడతకు ఉపసంహరణలు
- జిల్లాలో పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు
- మొదటి విడతకు ప్రచారం స్పీడ్ పెంచిన అభ్యర్థులు
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల పై క్లారిటీ వచ్చింది. ఖమ్మం జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగడంతో, శనివారం నామినేషన్ల తుది సంఖ్యను అధికారులు ప్రకటించారు. మరోవైపు రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో శనివారంతో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. దీంతో పలు గ్రామాల్లో ఒక్కటి చొప్పున నామినేషన్లు మిగలడంతో, ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అయితే ఇంకా అధికారికంగా మాత్రం ఏకగ్రీవ పంచాయతీల వివరాలను అధికారులు ప్రకటించలేదు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత పోటీలో మిగిలిన అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. ఇక మొదటి విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ప్రచారం జోరందుకుంది. గుర్తులతో ఇంటింటి ప్రచారం చేయడంతో పాటు, మద్యం, చికెన్ పంపిణీ కూడా జోరుగా కొనసాగుతోంది.
ఆ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలే..
ఖమ్మం జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఒక సర్పంచ్ స్థానానికి, 9 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఏన్కూరు మండలం నూకాలంపాడులో ఎస్టీలకు సర్పంచ్ స్థానంతో పాటు నాలుగు వార్డులు రిజర్వు కాగా, ఆ గ్రామంలో ఎస్టీలు లేకపోవడంతో నామినేషన్లు రాలేదు. కల్లూరు మండలం తెలగారంలో ఒక వార్డు ఎస్సీకి రిజర్వు కాగా, గ్రామంలో ఎస్సీలు లేకపోవడం, కారేపల్లి మండలం కమలాపురంలో మూడు వార్డులు ఎస్టీకి రిజర్వు కాగా, ఆ గ్రామంలో ఎస్టీలు లేకపోవడంతో నామినేషన్లు రాలేదు.
తల్లాడ మండలం కొడవటిమెట్టలో ఒక వార్డులో రిజర్వుడ్ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ముందుకు రావడంతో నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు ప్రకటించారు. ఇదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం అడవిరామారంలో ఒక వార్డులో నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకురాలేదని తెలిపారు.
మూడో విడత నామినేషన్ల వివరాలు ఖమ్మం జిల్లాలో..!
మండలం గ్రామాలు సర్పంచ్ కు వార్డులు వార్డులకు
ఏన్కూరు 21 109 178 396
కల్లూరు 23 124 214 517
పెనుబల్లి 32 158 290 680
సత్తుపల్లి 21 106 208 524
కారేపల్లి 41 257 356 860
తల్లాడ 27 145 252 587
వేంసూరు 26 126 244 521
మొత్తం 191 1025 1742 4085
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
మండలం గ్రామాలు సర్పంచ్ కు వార్డులు వార్డులకు
ఆళ్లపల్లి 12 63 90 234
గుండాల 11 70 96 271
జూలూరుపాడు 23 124 188 452
లక్ష్మీదేవిపల్లి 31 164 260 661
సుజాతనగర్ 13 79 110 271
టేకులపల్లి 36 244 312 685
ఇల్లందు 29 196 274 680
మొత్తం 155 940 1330 3254
