హామీలిస్తూ బుజ్జగిస్తూ... యాదాద్రి జిల్లాలో ఉపసంహరణలపై లీడర్ల ఫోకస్

హామీలిస్తూ బుజ్జగిస్తూ... యాదాద్రి జిల్లాలో ఉపసంహరణలపై లీడర్ల ఫోకస్
  • నేడు విత్​ డ్రా.. గుర్తుల కేటాయింపు
  • నేటి నుంచి మూడో దశ నామినేషన్లు స్టార్ట్

యాదాద్రి, వెలుగు:  మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. బుజ్జగింపుల వ్యవహారం ముమ్మురంగా సాగుతోంది. బుధవారం నామినేషన్ల విత్​డ్రాతో బరిలో ఎవరుంటారో తేలిపోతుంది.  బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. యాదాద్రి జిల్లాలో మొదటి దశ ఎన్నికలు జరిగే 153 పంచాయతీల్లో నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా ఉంది. కొన్ని గ్రామాల్లో మాత్రమే రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మిగిలిన గ్రామాల్లో నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తంగా 984 నామినేషన్లు దాఖలయ్యాయి. 

1286 వార్డులు ఉండగా తుర్కపల్లి మండలం మల్కాపూర్​లోని ఒక్కవార్డుకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన వార్డులకు 3292 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే పార్టీ నుంచి రెండు అంతకంటే ఎక్కువగా నామినేషన్లు ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో లీడర్లు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా  నామినేషన్లు వేసిన వారిని బుజ్జగిస్తున్నారు. 

కొన్ని గ్రామాల్లో పెద్దలు రంగంలోకి దిగి, అభ్యర్థులకు నచ్చజెబుతున్నారు. పోలింగ్​ జరిగితే అనవసరపు ఖర్చు.. ఆ డబ్బు గ్రామ ‘అభివృద్ధి’ కోసం వెచ్చిద్దామంటూ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.  రాజకీయ భవిష్యత్​పై హామీలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటుందని నచ్చజెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ నచ్చజెప్పే ప్రక్రియ ఫలిస్తుండగా మరికొన్ని చోట్ల పోటీ చేయాల్సిందే అన్నట్టుగా నామినేషన్లు వేసిన వారు తేల్చి చెబుతున్నారు.

 బుధవారం మధ్యాహ్నం వరకూ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నామినేషన్లు ఉపసంహరించుకున్నా.. సాంకేతికంగా ప్రకటన బుధవారం మధ్యాహ్నం ఉంటుంది. ఆ తర్వాతే ఎన్నికల బరిలో ఉండేదెవరో తేలిపోతుంది.  యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో కొత్తగా ఏర్పాటైన పంచాయతీ బైరాంనగర్​లో సర్పంచ్​గా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నుంచి ఇద్దరే  నామినేషన్​ వేశారు. 

ఈ పంచాయతీ విషయంలో ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రంగంలోకి దిగారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి నంద మహేందర్​ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. గ్రామానికి అవసరమైన ఫండ్స్​ కేటాయిస్తానని హామీ ఇచ్చారు.  మొదట కుదరదని చెప్పిన మహేందర్​చివరకు నామినేషన్​ఉపసంహరణకు అంగీకరించారు. దీంతో కాంగ్రెస్​కు చెందిన వెంకటేశ్వరరాజుకు సర్పంచ్​గా లైన్​ క్లియర్​అయింది. 

 తుర్కపల్లి మండలం చోక్లా తండాలో ఏకగ్రీవం చేయాలని ఓ ముఖ్య లీడర్​ప్రయత్నించి విఫలమయ్యారు. గ్రామానికి అన్ని విధాలుగా సాయం అందిస్తానని, ఏకగ్రీవం చేయాలని సదరు లీడర్​ సూచించారు. అయితే బీఆర్​ఎస్​కు చెందిన వ్యక్తి అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. గెలిచిన తర్వాత మీ వెంటే ఉంటానని సదరు లీడర్​కు చెప్పినట్టు తెలిసింది. 

నేటి నుంచి మూడో దశ నామినేషన్లు

బుధవారం నుంచి మూడో దశ పంచాయతీ ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. జిల్లాలోని చౌటుప్పల్, నారాయణపూర్, అడ్డగూడూర్, మోత్కూర్, గుండాల, మోటకొండూర్   మండలాలకు సంబంధించి 124 పంచాయతీలు, 1086 వార్డులకు ఈ నెల 5 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు.

బ్యాలెట్​పై గుర్తులే..  పేర్లు నో

నామినేషన్ల ఉప సంహరణ అనంతరం అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాతే తెలుగు అక్షరమాల ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. సర్పంచ్​లకు ఎన్నికల కమిషన్​ 30 గుర్తులను కేటాయించింది. వార్డు మెంబర్ల కోసం 20 గుర్తులు కేటాయించింది. అయితే పోటీలో ఉన్న వారికి గుర్తులు కేటాయింపు ఉంటుంది. ఆ గుర్తే బ్యాలెట్​పై ఉంటుంది. 

కానీ అభ్యర్థి పేరు మాత్రం బ్యాలెట్​ పేపర్​పై ఉండదు.  సర్పంచ్​లకు మొదటి గుర్తు 'ఉంగరం' ఆ బ్యాలెట్​లో చివరగా 'నోటా' ఉంటుంది. వార్డు మెంబర్ల బ్యాలెట్​లోనూ మొదటి గుర్తు గౌను కాగా చివరగా నోటా ఉంటుంది. సర్పంచ్​గా నలుగురు ఉంటే ఐదో గుర్తు నోటా ఉంటుంది. వార్డు మెంబర్ల బ్యాలెట్​లోనూ పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తుల చివరగా నోటా ఉంటుంది. రెండు బ్యాలెట్​ పేపర్లలో ఏ అభ్యర్థి నచ్చని వారు నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించింది.