థర్డ్ వేవ్ ముప్పు తప్పదు.. ఆరు వారాలే టైమ్

థర్డ్ వేవ్ ముప్పు తప్పదు.. ఆరు వారాలే టైమ్

న్యూఢిల్లీ: భారత్‌కు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని దేశ రాజధానిలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా హెచ్చరించారు. మరో ఆరు నుంచి ఎనిమిది వారాల్లో దేశంలో థర్డ్ వేవ్ మొదలవ్వొచ్చన్నారు. సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతున్న దృష్ట్యా దేశంలోని పలు రాష్ట్రాలు అన్‌లాకింగ్ దిశగా నడుస్తున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ మామూలు పరిస్థితులను నెలకొల్పేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో గులేరియా పైవ్యాఖ్యలు చేశారు. కరోనాపై అజాగ్రత, నిర్లక్ష్యం వద్దని వార్నింగ్ ఇచ్చారు. 

‘దేశంలోని చాలా రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలుపెడుతున్నాయి. ఈ సమయంలో కరోనాపై అజాగ్రత్తను దరిచేరనీయొద్దు. ఫస్ట్, సెకండ్ వేవ్స్ నుంచి మనమేం నేర్చుకున్నట్లుగా కనిపించడం లేదు. ప్రజలు మళ్లీ సమూహాలుగా, గుంపులు గుంపులుగా కలుస్తున్నారు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరిగే చాన్సెస్ ఉన్నాయి. మూడో వేవ్ ముప్పు పొంచి ఉంది. మరో ఆరు నుంచి ఎనిమిది వారాల్లో థర్డ్ వేవ్ మొదలవ్వొచ్చు లేదా అంతకంటే కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ జన సమూహాలు కాకుండా చూసుకుంటే ముప్పును రాకుండా అడ్డుకోవచ్చు’ అని గులేరియా పేర్కొన్నారు. 

‘వ్యాక్సినేషన్ అతి పెద్ద చాలెంజ్‌. కొత్త వేవ్ విజృంభణకు మూడు నెలలు లేదా అంతకంటే తక్కువ సమయం పట్టొచ్చు. అది వైరస్ మీద ఆధారపడిన విషయం. వైరస్ ఎప్పటికప్పుడు మ్యూటేట్ అవుతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, కేసులు ఎక్కువగా ఉండే హాట్‌‌స్పాట్స్‌పై పకడ్బందీగా నిఘాను పెట్టాలి. ఆయా ప్రాంతాల్లో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్‌ను అమలు చేయాలి. 5 శాతం లోపు కేసులు ఉండే ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్ పెట్టాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వనంత వరకు మనకు హాని తొలగనట్లే’ అని గులేరియా పేర్కొన్నారు.